Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారం కోసమే ఎగబడే పార్టీలకు 'చిత్తకార్తె' వచ్చేసింది. జనానికి తాయిలాల పందారం, నాయకులకు పదవుల గాలం విసురుకుంటూ బిజీగా వ్యూహకర్తలు! ఎవరి పనిలో వారున్నారు. పెట్టుబడికి ప్రజలు వినియోగదారులుగానే కన్పడినట్లు, ఆ పెట్టుబడే కందెనగా నడిచే పార్టీలకు ప్రజలు కేవలం ఓటర్లుగా కనపడే రోజులొచ్చేసినారు. మరీ ముఖ్యంగా గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామమిది.
మొన్న గృహమంత్రి తమ ''గృహాన్ని'' పదిలపరుచుకునే పనిలో భాగంగా నిర్మల్ సభలో బహిరంగంగానే ఓ వల విసిరాడు. ''మోడీ 3.0 సర్కార్ ఏర్పాటులో మీకే బోలెడన్ని కేబినెట్ బెర్త్‌లు!'' అన్నాడు. దీనికి మూడు కోణాలున్నాయి. వేరేదార్లు వెతుక్కుంటూ గోడమీదెక్కిన వారిని వెనక్కి పిలవడం ఒకటి కాగా, వేరే పార్టీల్లోని సంపాదనాభిలాషులకు అందుకు శక్తివంతమైన మార్గాలు తామే చూపగలుగుతామన్న సంకేత మివ్వడం రెండవది. సరిగా పనిలోలేని కార్యకర్తలకు తాను, తమ ప్రధాని ఆశించిన పద్ధతిలో పనిని మెరగు చేసుకుంటే అనురాగ్ ఠాకూర్‌లా ఉన్నత స్థానాలందిస్తామన్న 'ఇషారా' కూడా ఆ ప్రకటనలోనే ఉండటం మూడవది. మీరు పార్టీని అందలం ఎక్కిస్తే పార్టీ మిమ్మల్ని ఇంకా పైకి లేపుతుంది అనేది దీని సారాంశం. ''ధర్మో రక్షతి, రక్షితః'' అనే నానుడి బాగా వంటబట్టించుకున్న వాళ్ళుకదా!
ఇక రాష్ట్రంలో ఒకే విధానం గల మూడు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అందరూ ''అభివృద్ధి'' మంత్ర పారాయణమే. అందరుమాట్లాడేది ఫోర్-లేన్ రోడ్ల అభివృద్ధే! అందరి ప్రచారమూ ''స్కైవేల''గురించే. అందరూ నగరాల సుందరీకరణ గురించి, మార్కెట్ గొప్పతనం గురించి మాట్లాడే పార్టీలే ఇవి. మాటలే కాదు, సరళీకృత ఆర్థిక విధానాలను ప్రారంభించింది ఒకరైతే, నేడు దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోతున్నది బీజేపీ. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ అది నాటి టీడీపీ అయినా, నేటి టీఆర్ఎస్ అయినా ఆ విధానాలకే అంటకాగుతూ అటు కాంగ్రెస్ సంకీర్ణంలోనో, ఇటు బీజేపీ సంకీర్ణంలోనో సేదదీరుతూ నెట్టుకొస్తున్నవే! అందరి డైలాగూ ఒకటే. రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంతో మంచిగా ఉంటున్నామనే!
కేసీఆర్‌ని విమర్శించే బీజేపీకి రాష్ట్రంలో కనీస వేతనాలందక అలమటించే కోటి మంది అసంఘటిత కార్మికులు కనపడరు. ఏ ఆదరువు లేని 14లక్షల కౌలురైతులు, వారి సమస్యలు కనపడవు. కోటీ 50లక్షల మంది వ్యవసాయ కార్మికుల బాధలు వారికి కనపడవు. కుటుంబ పాలనే వారికి కీలక సబ్జెక్ట్. మూడు తరాల థాకరేలున్న మహారాష్ట్రలో శివసైనికులతో పొత్తు కోసం వెంపర్లాడే బీజేపీకి టీఆర్ఎస్లో కుటుంబ పాలన కనపడటంలో ఆశ్చర్యమేముంది?! ఏడేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకి ఏమిచ్చిందని ప్రశ్నించే టీఆర్ఎస్ నాయకులు దానికోసం ఏ పోరాటం చేశారో చెప్తే తెలంగాణ సంతోషించేది. కనీసం జీఎస్టీ బకాయిల కోసం కేరళతో కలిసి పోరాడితే రాష్ట్రాల హక్కుల కోసం అడిగే గొంతులు బలపడేవిగా! ఎక్కడో 2013నాటి కేసీఆర్ ఉపన్యాసాలు కాదు, కండ్లముందు విద్యుత్ ప్రయివేటీకరణ, ఆర్టీసీ ప్రయివేటీకరణ సాగిపోతుంటే టీఆర్ఎస్ నాయకుల నోళ్లెందుకు పెగలడం లేదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
కాషాయ పార్టీకి తమ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో చేసేది పాదయాత్రో అధికార యావతో సాగే జైత్రయాత్రో తెల్సినట్లు లేదు. సాక్షాత్తూ హౌమ్మంత్రే ''అధికారం మాదే'' అని నిర్మల్‌లో డిక్లేర్ చేశాడు. అంటే ఇది అధికారం కోసం సాగే యాత్రేనా? అధికారంలోకి వస్తే మొదటి సంతకం 'విమోచన దినం'' ఫైల్‌పైనే నట! ఇక్కడా వీరికి ప్రజా సమస్యలు కనపడక పోవడం మన దౌర్భాగ్యం. ప్రధానిగారి ఫసల్ బీమా యోజన అమలు చేసుంటే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలుండేవికావని కాషాయనేతల ప్రకటన చూస్తే జనం దేంతో నవ్వుతారో కూడా వీరికి తెల్సినట్టు లేదు. ఆగస్టు 16 నాటికి ఈ 'ఫసల్ బీమా'లో రూ.2287కోట్లు కేంద్రం బిల్లులు సెటిల్ చేయలేదట! ఫలితంగా రైతులు గోసపడుతూనేవున్నారు. 'ఆరోగ్య సేతు' దగ్గర్నించి, ఫసల్ బీమా వరకు అన్నీ అమలు చేసిన యూపీలో అంత దారుణ పరిస్థితి ఎందుకుందో బీజేపీ నేతలు చెప్పగలరా?
అందుకే, వీరంతా ఒకరితో ఒకరు పూల చెండులతో బంతాటలాడుతున్నారు. లేలేత తమల పాకులతో వసంతాలాడుకుంటున్నారు. వీరు చెప్పే అభివృద్ధి రాస్తాలో మానవ మైలురాళ్లు మాయమౌతున్నాయి. ఇప్పట్నించే కష్టజీవులు కేంద్రంగా రాష్ట్రంలో చర్చ జరిగేలా చూడాలి. అది సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలైనా, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల సమస్యలైనా, మూడు వ్యవసాయ చట్టాలైనా, దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న ప్రయివేటీకరణలైనా వీటిపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పిన తరువాతే, ఇతర అంశాలపై తమ వాగ్దానాలు, హామీలు ప్రజల ముందుంచాలని చలిచీమలన్నీ కట్టగట్టుకుని, కూడబలుక్కుని రణన్నినాదం చేస్తే...!