Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అడ్డదారుల్లో చొరబడటంవల్లే చోటుచేసుకొంటున్నాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రమాదాల నియంత్రణకు గతేడాదినే డెడ్‌లైన్‌గా పెట్టింది. కానీ, ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్లు రక్తసిక్తం కాని రోజంటూ లేదని నిపుణుల గణాంకాలు స్పష్టం చేస్తూన్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనది కాదు మొత్తం దేశమంతా ఇదే పరిస్థితి. నిన్నటికి నిన్న నల్లగొండలో 65వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరిని కొల్పోయిన చిన్నారికి ఎవరు సమాధానం చెబుతారు.
నిర్లక్ష్యపూరిత రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 1.20లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడిస్తోంది. అంటే సగటున రోజుకు 328మంది అసువులు బాశారు. రోడ్లపై వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేండ్లలో దాదాపు 3.29లక్షల మంది మరణించారు. గుర్తు తెలియని వాహనాలు ఢకొీన్న కేసులు భారత్‌లో 2018 నుంచి 1.35 లక్షలు నమోదయ్యాయి. 2019లో భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో 1.36 లక్షల మంది మృతి చెందారు. కరోనా లాక్డౌన్ల వల్ల చాలా రోజులు వాహనాలు రోడ్లపైకి రాకపోయినా గతేడాది అంత పెద్దమొత్తంలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమే! ఇదే విషయాన్ని గడ్కరీ పార్లమెంట్లో 'దేశంలో కొవిడ్ కల్లోలం కన్నా రహదారి ప్రమాదాలు మరింత నష్టదాయకంగా మారాయని' అన్నారు. నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపి ఇతరులను గాయపరచిన ఘటనలు పోయిన సంవత్సరం 1.30లక్షలు నమోదయ్యాయి. సగటున రోజూ 112 హిట్ అండ్ రన్ కేసులు వెలుగుచూశాయి. సగటున ప్రతి గంటకు దేశంలో 53 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు, ప్రతి 4నిమిషాలకు ఒకరు మరణిస్తున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఒక శాతమే మన దేశంలో ఉన్నా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం 11శాతం మరణాలు భారత్‌లోనే చోటుచేసు కుంటున్నాయని గతంలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. రహదారులే మృత్యుదారులై ప్రాణాలు తీస్తున్న ఘటనలలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. గత దశాబ్దంలో భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల 13 లక్షల మంది మత్యువాత పడితే, మరో 50లక్షల మందికి పైగా గాయపడ్డారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.5.96 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. జీడీపీలో ఇది 3.14శాతానికి సమానం. కేంద్రం లెక్కల ప్రకారమే రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్నవారు 75శాతానికి పైగా 18-45ఏండ్ల లోపు యువతే. ఫలితంగా దేశం ఏటా ఎంతో విలువైన శ్రామిక శక్తిని కోల్పోతోంది. ఇంటి యజమానులు అకస్మాత్తుగా మరణిస్తుం డటంతో ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. గాయపడిన వారి కుటుంబాలు వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 6,288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య 6,415. ఏపీలో 491 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా, తెలంగాణలో వాటి సంఖ్య 1332. ఏపీతో పోలిస్తే ఇవి రెండున్నర రెట్లు ఎక్కువ. ఎన్నిరకాల నియమ నిబంధనలు పెట్టినా ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదే తప్ప తరగకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు చేయాల్సింది ఎంతో ఉందని ప్రమాదాల సంఖ్య చూస్తే మనకు ఇట్టే అర్ధమవుతుంది. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా అమలుచేయడం ఒక్కటే ప్రభుత్వాల పని కాదు. చిన్న వర్షానికే రోడ్లన్ని తటాకాలను తలపిస్తాయి. భారీ వర్షమైతే ఇక వాటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి రోడ్లుపై ప్రయాణమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం కాక మరేమిటి. ట్రాఫిక్ నియమాలు పాటించని వారి ఫోటోలు తీసి పంపిమరి చలానాలు వసులుచేసే పోలీసుశాఖ, ప్రమాదానికి గురైన రోడ్డు, గుంతల ఫొటోలు తీసి ఆయా ప్రభుత్వ శాఖలకు పంపి వారిని ఎందుకు శిక్షించదో తెలియాల్సిన అవసరం ఉంది. మద్యం తాగి వాహనాలను నడిపేవారిని, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండేవారిని గట్టిగా శిక్షించే ప్రభుత్వాలు... నిబంధనలకు విరుద్దంగా జాతీయ రహదారుల పక్కన రోజురోజుకు పుట్టుకొస్తున్న బార్లు, మద్యం దుకాణాలపై చర్యలను మాత్రం చూసిచూడనట్టు వదిలేస్తాయి. ఈ ఉదాసీనతే అధిక ప్రాణనష్టానికి కారణం అవుతోంది. ఏదేమైనా, ప్రమాదాలు జరిగాక బాధపడడం కంటే ప్రమాదాలు జరగకుండా చూడడమే ముఖ్యం. ఈ ప్రమాదాలను ఎంతగా తగ్గించగలిగితే.. అంతగా ప్రజల ప్రాణాలను కాపాడినట్టే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాలను పటిష్టవంతమైన విధానాలతో నివారించి, ప్రజలను ప్రమాదాల బారినుంచి తప్పించాల్సి ఉంది.