Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల హైకోర్టు వరసగా తన అసహనాన్నీ, ఆగ్రహాన్ని వెళ్లగక్కటం పరిపాటిగా మారింది. అనేకాంశాల్లో తమ ఆదేశాలను లెక్కచేయటం లేదనీ, వాటిని ధిక్కరిస్తున్నారని పేర్కొంటూ ఉన్నత న్యాయస్థానం సర్కారుకు మొట్టికాయలేస్తున్నది. తాజాగా తెలంగాణలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా, టైఫాయిడ్తోపాటు ఇతర వైరల్ జ్వరాలను అరికట్టలేకపోయారంటూ మొన్న కోర్టు ఆక్షేపించింది. ఇక్కడ న్యాయస్థానం ఆగ్రహావేశాలను కాసేపు పక్కనబెట్టి సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినా... ప్రజారోగ్యానికి సంబంధించి గులాబీ సర్కారు చర్యలు 'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన్ని...' తలపిస్తున్నది. మామూలు రోజులతోపాటు కరోనా మొదటి, రెండో దశలో జరిగిన అనేక ఘటనలు ఇందుకు దృష్టాంతాలుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ప్రతీయేటా వేసవి ముగియగానే వానలు పడటం, ఆ వెంటనే తాగు నీరు కలుషితమైందంటూ జనాలు మొత్తుకోవటం, దోమలు విజృంభణ.. వైరల్ జ్వరాలు వెంటాడటం షరా మామూలైంది. వాటిపై పత్రికల్లో కథనాలు రావటం కూడా రొటీనైంది. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా... మరింత దిగజారింది. ఇలాంటి దుస్థితి నుంచి ప్రజల్ని రక్షించాల్సిన సర్కారు...అందుకు భిన్నంగా ఆరోగ్య శ్రీ కార్డులు, హెల్త్ కార్డులు, వెల్నెస్ సెంటర్లను చూసి మురిసిపొమ్మంటున్నదే తప్ప అవి నామ్కే వాస్తేగా తయారయ్యాయనే వాస్తవాన్ని గుర్తెరగటం లేదు.
ప్రస్తుతం ప్రజల ధన, ప్రాణాలను హరిస్తోన్న డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటివి దోమకాటు ద్వారా వస్తాయన్న సంగతి మనకెరుకే. వీటితోపాటు మనిషి ఇంటిని, ఒంటిని గుల్ల చేసే టైఫాయిడ్, అతిసార, వాంతులు, విరేచనాలనేవి తాగునీరు కలుషితం కావటం వల్ల సంభవిస్తాయన్న విషయాన్ని చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం. ఈ క్రమంలో పై రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని, వీటి నివారణకోసం వానాకాలం ప్రారంభంలోనే ముందస్తు చర్యలను తీసుకుంటే పరిస్థితి అదుపు తప్పకుండా ఉంటుంది. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పూడిక తీసి, శుభ్రం చేయాలి, మురుగునీరు నిల్వకుండా చూడాలి, ఇండ్లలోని కుండీలు, డబ్బాలు, కొబ్బరి బోండాల్లో ఉన్న నీటిని పారబోయాలి, వర్షాకాలంలో కాచి, వడబోసిన నీటినే తాగాలనేవి దోమలు, కలుషిత నీటి నియంత్రణకు పాటించే చిన్న చిన్న చిట్కాలు. మూడో తరగతి పిల్లవాడి సైన్సు పుస్తకాన్ని తిరగేసినా ఇవే విషయాలు ఉంటాయి. కానీ జగమెరిగిన ప్రభుత్వ పెద్దలు మాత్రం వీటిపై దృష్టి సారించకపోవటం, వైద్యారోగ్య శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవటం, ప్రజల్లో అవగాహన పెంచకపోవటం విస్మయపరిచే అంశాలు.
ఇవన్నీ రోగం రాకముందు తీసుకోవాల్సిన నివారణా చర్యలు. వీటిలో ఉదాశీనతను కనబరుస్తున్న ప్రభుత్వం... ఇక రోగమొచ్చాక కూడా ప్రజలకు వైద్యాన్ని అందించటంలో అదే రకమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటం ఆందోళనం. సాధారణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వైద్య కళాశాలల వరకూ సిబ్బంది లేమి, మౌలిక వసతులు, మందుల కొరత మనల్ని వెక్కిరిస్తున్నాయి. మరోవైపు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలకు సంబంధించి వెంటనే వ్యాధి నిర్దారణ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రోగి ప్రాణాలు గాల్లో దీపంలా మారతాయి. కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కడా వ్యాధి నిర్దారణ పరీక్షా కేంద్రాలు (ల్యాబ్లు) రోగుల సంఖ్యకు సరిపడినన్ని లేవు. వాటిలో ల్యాబ్ టెక్నీషియన్లు, కెమిస్టుల సంఖ్య నామమాత్రమే. వందలాది మంది రక్త నమూనాలను సేకరించటం, వాటిని పరీక్షించటం, రిపోర్టులు తయారు చేయటమనేది తమకు నిర్ణీత సమయంలో సాధ్యం కావటం లేదని వారు వాపోతున్నారు. ఇలాంటి కారణాలన్నింటి రీత్యా ఒక్కో పేషెంట్ రిపోర్టు రావటానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వరకూ పడుతున్నది. ఇలా పుణ్యకాలం కాస్తా గడిచిపోవటంతో జబ్బు ముదిరి, రోగి మంచానపడుతున్నాడు. ఈ క్రమంలో మరికొంత మంది పేదలు, సామాన్యులు వైరల్ ఫీవర్లకు బలైపోతున్నారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తుందంటూ సర్కారువారు ఊదరగొడుతున్న క్రమంలో ఇలా అనారోగ్య తెలంగాణ ఆవిష్కృతం కావటం అత్యంత బాధాకరం.
ఒక విద్యాధికురాలికి ఎంటమాలజిస్టు పోస్టునిస్తే సరిపోదు.. రాష్ట్రంలోని ప్రజలందరూ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇలా ఖాళీగా ఉన్న అనేక ఎంటమాలజిస్ట్ పోస్టుల్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం భర్తీ చేయాలి. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వాటిని నియంత్రించేందుకు వీలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దోమల మందును పిచికారీ (ఫాగింగ్) చేయించాలి. ఏజెన్సీ ఏరియాల్లో రసాయనాల పూత పూసిన దోమ తెరలను పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో ల్యాబ్లను ఆధునీకరించి, చాలినంత మంది సిబ్బందిని నియమించాలి. తద్వారా వ్యాధి నిర్దారణ పరీక్షా ఫలితాలు వెంటనే వచ్చేట్టు చూడాలి. ఆ తర్వాత తగిన చికిత్సలను తక్షణం అందించాలి. అప్పుడే డెంగీ, మలేరియా, చికున్ గున్యా, టైఫాయిడ్ లాంటి వాటిని మనం అరికట్టగలం.