Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తవ్వకాలు.. తవ్వకాలు.. తవ్వకాలు... ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఈ తవ్వకాలపై ఉన్నంత ప్రేమ మరేదానిపైనా లేదు. అందుకే ప్రజల నిత్య జీవిత సమస్యలైన ధరలు, దరిద్రం, ఆకలి, నిరుద్యోగం నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు వీలుగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞాన్వాపి మసీదులో తవ్వకాల సందర్భంగా శివలింగం బయటపడిందనే విషయాన్ని ప్రచారంలో పెట్టి...కాషాయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడీ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి... దీనిపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం సముచితం కాదు. కానీ ఇదే తవ్వకాలకు సంబంధించి దాదాపు 65 ఏండ్లకు సరిపడా సిమెంట్ ముడి పదార్థాలు, నిక్షేపాలు ఉన్నాయంటూ నిపుణులు తేల్చి నివేదికనిచ్చిన ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను కేంద్రం శాశ్వతంగా ఎందుకు మూసేస్తామని ప్రకటించిందో అర్థం కావటం లేదు. మొత్తం 2,300 ఎకరాల (ఇందులో 779 ఎకరాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. 1500 ఎకరాలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు) విస్తీర్ణంలో 48.18 టన్నుల ముడి సరుకుతో ఉన్న ఈ పరిశ్రమను 1984లో ప్రారంభించారు. దాదాపు 14 ఏండ్లపాటు నిరాటంకంగా నడిచి, ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ కర్మాగారం... 1998లో మూతబడింది.
ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సీట్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే... సీసీఐని తిరిగి పునరుద్ధరిస్తామంటూ బీజేపీ హామీనిచ్చింది. ఆ మాటను నమ్మిన స్థానిక జనం ఆ పార్టీకి ఓట్లేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేయటం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్... కేంద్ర మంత్రులకు లేఖలు రాయటం, ఆనవాయితీ ప్రకారం మోడీ సర్కార్ పెడచెవిన పెట్టటం శరా మామూలుగా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ అడవి బిడ్డల ఉపాధి కల్పన కోసం కంకణం కట్టుకున్న సీసీఐ సాధన కమిటీ అనేక పార్టీలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వినతులు, విజ్ఞాపనలతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావటానికి వీలుగా దశలవారీ ఆందోళనలు చేపట్టింది. అయినా 'అత్యంత సున్నిత హృదయం'గల బీజేపీ సర్కార్... ఈ విషయాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవటం అత్యంత బాధాకరం. అంతకుమించిన బాధ్యతారాహిత్యం. తాజాగా సీసీఐలోని యంత్ర సామాగ్రి అమ్మకం, ఆస్తుల మదింపు, సిబ్బంది క్వార్టర్ల కూల్చివేతలకు టెండర్లు పిలవటాన్నిబట్టి ఆ కర్మాగార పునరుద్ధరణ కాదు.. జీర్ణోద్ధరణకు కేంద్రం రంగం సిద్ధం చేసిందనే విషయం స్పష్టమవుతున్నది.
మరోవైపు అదే సీసీఐ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో ఉన్న సిమెంట్ కర్మాగారం ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నది. దాదాపు రెండు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తున్నది. కాషాయ కళ్లద్దాల్లోంచి చూస్తున్న బీజేపీ నేతలకు ఈ వాస్తవం ఇంకా కనబడకపోవటం విడ్డూరం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అన్ని రంగాల్లో పురోగమిస్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన కేరళ రాష్ట్రం... ప్రభుత్వరంగ పరిరక్షణ బాధ్యతను తన భుజానేసుకున్నది. అక్కడి కాసర్‌ఘడ్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ను, కొట్టాయం జిల్లాలోని హెచ్ఎన్ఎల్ను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయగా... వాటిని కొనేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చి, ఆ రెండు కంపెనీలనూ అక్కున చేర్చుకుంది. అలాగే త్రివేండ్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, హెచ్ఎల్ఎల్ అనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థనూ బడాబాబులకు అమ్మేందుకు ప్రయత్నించిన సందర్భంలోనూ అడ్డం తిరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రెండింటినీ తమ ప్రభుత్వానికి విక్రయించాలంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినా 'మిత్రోన్...' అంటూ ప్రజల్ని పలకరించే ఆ 'ఆప్తమిత్రుడి' హృదయం ఇప్పటికీ స్పందించలేదు. ఇదే తరహాలో ఇప్పుడు సీసీఐ పునరుద్ధరణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా రూ.రెండు వేల కోట్లు ఇచ్చేందుకు, ఇతర ఎలాంటి సహాయాలు కావాలన్నా చేసేందుకు సిద్ధపడినా 'దేశం కోసం, ధర్మం కోసం' అంటూ ఊదరగొట్టే మోడీ సర్కార్ కనీసం చెవికెక్కించుకోవటం లేదు. ఇదీ దాని దేశభక్తి. ఈ నేపథ్యంలో ప్రజలను కూడగట్టటం ద్వారా అప్రజాస్వామికమైన కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకుని తీరతామంటూ సీసీఐ సాధన సమితి ప్రతినబూనింది. దాని పోరాటం విజయవంతం కావాలనీ, సీసీఐ పునరుద్ధరణ జరగాలని ఆశిద్దాం.. ఆకాంక్షిద్దాం...