Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్లో రష్యా ప్రారంభించిన సైనిక చర్యలో మరోనూతన ఘట్టం మొదలైంది. ఈ వివాదాన్ని మరింతగా పొడిగించేందుకు ఒకవైపు ఆధునిక ఆయుధాలను కుప్పలు తెప్పలుగా పశ్చిమ దేశాలు అంద చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్లో దాడులు జరిపేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఐఎస్ కిరాయి మూకలను సమీకరిస్తున్నట్లు వార్తలు. కొత్త వివాదాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. కీలక రేవు పట్టణం మరియుపూల్ శివార్లలోని భారీ ఉక్కు కర్మాగారం ఇజౌస్తల్ బంకర్ల నుంచి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలు చేతులెత్తాశాయి. వెలుపలికి వచ్చి రష్యా మిలిటరికీ లొంగిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. వారిని డాన్టెస్క్ ప్రాంతంలో బందీలుగా ఉంచారు. ఫిబ్రవరి 24న రష్యా ప్రారంభించిన సైనిక చర్యలో కీలకమైన రేవు పట్టణం మరియుపూల్ ముట్టడి ఒక ముఖ్య ఘట్టం. ఉక్కు కర్మాగారం నుంచి సాయుధులు పూర్తిగా వెలుపలికి వచ్చినట్లు నిర్థారించుకున్నతరువాతే ఆ ముట్టడి పూర్తైనట్లు భావించాలి. బందీలుగా పట్టుకున్నవారిని సైనికులుగా పేర్కొంటూ అంతర్జాతీయ తీర్మానాల ప్రకారం తమకు అప్పగించాలని ఉక్రెయిన్ కోరుతున్నది. వారు కిరాయి మూకలు కనుక వారిని ఏమి చేయాలో తమ పార్లమెంటు నిర్ణయిస్తుందని రష్యా ప్రతినిధులు చెబుతున్నారు.
అతి పెద్ద ఉక్కు కర్మాగారం ఇజౌస్తల్ను కేంద్రంగా చేసుకొని మార్చి 18వ తేదీ నుంచి ప్రతిఘటిస్తున్న ఈ మూకలు మే 16న లొంగిపోతున్నట్లు ప్రకటించాయి. 1930దశకంలో ఏర్పాటైన ఆ కర్మాగారంలో శత్రుదాడులు జరిగినప్పుడు తలదాచుకొనేందుకు అవసరమైన భారీ బంకర్ల నిర్మాణం కూడా ఉంది. 2014లో డాన్బాస్ ప్రాంత రష్యన్ భాష మాట్లాడే మెజారిటీ పౌరుల్లో తలెత్తిన అసమ్మతిని అణచివేసేందుకు ఉక్రెయిన్ పాలకులు నయానాజీలు, కిరాయిమూకలతో ఇజౌ బెటాలియన్ పేరుతో సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్య్రం కోరుతున్న డాన్బాస్ ప్రాంత పౌరులపై దాడులు చేయిస్తున్నారు. బయటి ప్రపంచాన్ని అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నట్లు నమ్మించారు. ఆ దళాన్నే ఇజౌస్తల్ కర్మాగారానికి తరలించి మార్చి 18వ తేదీ నుంచి రష్యా మిలిటరీ మీదకు ప్రయోగించారు. వారికి రక్షణగా మానవకవచంగా ఉండేందుకు అనేక మంది పౌరులను కూడా అక్కడకు తరలించారు. దాని మీద జరిపేదాడులను పౌరుల మీద జరుపుతున్నవాటిగా చిత్రించారు. ఆ ఎత్తుగడను గమనించి ఆ కర్మాగారాన్ని చుట్టుముట్టిన రష్యన్ దళాలు దాడులను ఆపి పౌరులు బయటకు వచ్చేందుకు వీలు కల్పించి సాయుధులకు అవసరమైన సరఫరాలను అడ్డుకుంటూ తిష్టవేశాయి. వారంతటవారే వెలుపలికి వచ్చే ఎత్తుగడను అవలంభించాయి. అది ఫలించింది.
ఇజౌస్తల్ కర్మాగారం బంకర్లలో తిష్టవేసిన సాయుధమూకల సంఖ్య ఎంతో తెలియదు. ఇదిరాసిన సమయానికి రష్యా ప్రకటించినట్లు వచ్చిన వార్తల ప్రకారం 1,730మంది ఉన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో లొంగిన వారు 771 మంది. కొన్ని వందల మంది ఉక్రెయిన్ యుద్ద ఖైదీలు అని రెడ్ క్రాస్ సంస్థ చెప్పగా, అవసరమైన వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. మరియుపూల్ ముట్టడి కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. సాధారణంగా యుద్దాలపుడు బందీలుగా చిక్కిన మిలిటరీని ఒప్పందాల మేరకు ఆయాదేశాలకు అప్పగిస్తారు. పరస్పరం మార్పిడి చేసుకుంటారు. వీరు కిరాయిబాపతు కనుక రష్యా పార్లమెంటు అలాంటి మార్పిడిని అంగీకరించకపోవచ్చని నిర్దారణ కాని వార్తలు తెలిపాయి. ఇజౌ రెజిమెంటు పేరుతో ఉన్న వారిని ఉగ్రవాదులుగా గుర్తించాలని కోరుతూ దాఖలైన ఒక పిటీషన్ సుప్రీం కోర్టు ముందు ఉంది. అలా గుర్తిస్తే వారికి 20సంవత్సరాల వరకు శిక్షపడవచ్చు. లొంగినవారి గురించి పశ్చిమదేశాల నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. ఉక్రెయిన్ను ముందుకు నెట్టిన అవి ఇప్పుడు మరో కొత్త ప్రాంతాన్ని వెతుకుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలను కొనసాగిస్తూ తమ ఎత్తుగడలను అమలు జరిపే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు... ఒక వేళ ఉక్రెయిన్ వివాదం పరిష్కారమైనా కొత్త చిచ్చు రేపేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. ఫిన్లండ్, స్వీడన్లను నాటోలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతూ మరో వివాదాన్ని సృష్టించేందుకు పూనుకోవటం ఆందోళన కలిగించే అంశం.