Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంక్షుచిత సామాజిక కాలంలోనూ ఎవరో ఒక సంస్కర్త సమాజాన్ని చైతన్యపరిచే పనికి పూనుకుంటాడు. ఇది పరిణామ క్రమంలోని అనివార్యాంశం. సామాజిక పరివర్తన అవసరమైన సందర్భాలలో చరిత్ర నాయకులను, సంస్కర్తలను తనకు తానే తయారుచేసుకుంటుంది. మన సమాజంలో అలాంటి టార్చ్బేరర్లు చాలామందే ఉన్నారు. బసవేశ్వరుడు, పోతులూరి, నారాయణగురు, రాజారామ్మోహనరారు, మహత్మాజ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, రామస్వామి నాయికర్, కందుకూరి, గురజాడ ఇలా సంఘసంస్కరణ కోసం కృషి చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరూ మన సాంస్కృతిక జీవనాన్ని ఒక అడుగు ముందుకు వేయించిన ఆదర్శనీయులు. అలాంటి వాళ్లలో హైదరాబాద్ సంస్థానంలో దళిత చైతన్యానికి, విద్యా వ్యాప్తికి, దురాచారాల నిర్మూలనకు ఉద్యమాన్ని నిర్మించిన భాగ్యరెడ్డి వర్మ ఒకరు. ఆయన 135వ జయింతిని ఈ రోజున జరుపుకుంటున్నాము.
1888లో హైదరాబాద్లో జన్మించిన ఆయన, జ్యోతిబాఫూలే చూపిన మార్గంలో హైదరాబాద్ సంస్థానంలో దళిత ఉద్యమానికి పునాదివేసాడు. అణగారిన వర్గాల జీవనాన్ని అభివృద్ధి చేయటం కోసం జీవితకాలం శ్రమించాడు. ''ఏ హిందూ పురాణాల్లోనూ పంచముడనే పేరులేదు. ఈ ప్రాంతంలో మొదటి నుండీ స్థానికులయిన వాళ్లు వీరే కాబట్టి, వీరిని 'ఆది ఆంధ్రులని' పిలవటం సరైనది'' అని 'ఆది ఆంధ్ర' పేరును దళితులకు మొదట ఖరారు చేసింది భాగ్యరెడ్డి వర్మనే. దీన్నే జాతీయ స్థాయిలో 'ఆది హిందువులు'గా పిలవాలని ప్రతిపాదించాడు. దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదిహిందూ జాతీయ సభలలోనూ పాల్గొన్నాడు. దళితులు వెనుకబడి పోవటానికి అవిద్య, అజ్ఞానం కారణమని గ్రహించి, వారి విద్యావ్యాప్తికి పూనుకున్నాడు. జగన్మిత్ర మండలి అనే పేరుతో సంస్థను స్థాపించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు.
1906లోనే అస్పృశ్యతా నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించారు. 1910లో ఇసామియా బజారులో లింగంపల్లిలో ప్రాథమిక పాఠశాలను ఆరంభించారు. జంట నగరాల్లో బాలికల విద్యకోసం 26 ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసి ఆడపిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారు. మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజం, ఆదిహిందూ సోషల్ సర్వీస్ గ్రూప్ మొదలైన ఎన్నో సంఘాలను స్థాపించి దీన జనోద్ధరణకు నడుంకట్టాడు. అతను హక్కుల కర్యకర్త, రచయిత, పాత్రికేయుడు, ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సమాజంలో నెలకొని ఉన్న దురాచారాలైన, దేవదాసి, జోగిని వంటి వాటిని నిర్మూలించటం కోసం, బాల్య వివాహాలను నిర్మూలన కోసం పనిచేశారు.
ఆయన జయంతి రోజున తను చేసిన పనులను గర్తుచేసుకుని స్మరించుకోవటం బాగానే ఉంది. కానీ వందయేండ్ల క్రితం ఆయన ఎలాంటి సమాజాన్ని ఆశించి కృషి చేశాడో, అది ఇంకా కలగానే మిగిలివుంది. వివక్షతలు, అవిద్య, దురాచారాలు, దుర్మార్గాలు, ఆధిపత్య ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన నడయాడిన ఈ హైదరాబాద్ నగరంలోనే కుల దురహంకార హత్యలు నిత్యకృత్యమైపోతున్నాయి. నాగరాజు ఉదంతం మరువకముందే నీరజ్ అనే యువకుడిని నగరం మధ్యలోనే కొట్టి చంపారు. వివక్షతలు, అంటరాని తనాలు మారింది లేకపోగా అత్యాచారాలు, హత్యలు, హతమార్చడాలు జరుగుతున్నవి. వీటిని నిర్మూలించలేని ప్రభుత్వాలు, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎన్కౌంటర్ల పేరుతో మానవ హక్కులను కాలరాస్తున్నాయి.
ఇక ఉన్నత సాంస్కృతిక జీవనం సాగించటంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందని నాడు భాగ్యరెడ్డి వర్మ గ్రహించాడు. అందుకు కృషి చేశాడు. కానీ నేడు విద్య వ్యాపారుల చేతుల్లోకి పోయి మార్కెట్ సరుకుగా మారిపోయింది. సగానికిపైగా ప్రజలు విద్యను అంగట్లో కొనుక్కునే పొందుతున్నారు. ఇప్పుడు నూతన విద్యావిధానం పేర విద్యా వ్యవస్థలోకి వర్ణాశ్రమ ధర్మాలను, మధ్యయుగ సాంస్కృతిక జీవన విధానాన్ని ఆదర్శంగా ముందుకు తెస్తున్నారు. అణగారిన వర్గాలను చదువుకు దూరం చేసే ప్రయత్నం ఆరంభమయింది. అంతే కాదు ఆ చదువుల్లో కూడా చరిత్రను, సంఘ సంస్కర్తలను, సామాజిక వేత్తలను, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలను తొలగించి, మతతత్వ బోధకులకు స్థానం కల్పిస్తున్నారు.
తెలంగాణ రాజధానిలో వందేండ్ల క్రితం సంఘ సంస్కరణ కోసం కృషి చేసిన భాగ్యరెడ్డివర్మను స్మరించుకొనే సందర్భంలో నేటి పరిణామాలను, పరిస్థితులను ఆలోచించవలసి ఉంది. ఆయన స్ఫూర్తితో మరో సాంస్కృతిక సమరానికి సమాయత్తం కావటమే మనం ఆయనకిచ్చే గౌరవం.