Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానొచ్చేముందు ఉసిళ్లొస్తాయి. ఎన్నికలొచ్చేముందు కండువాలు మారుతుంటాయి. వాస్తవానికి ఆ కండువాల ఓనర్లు మనరాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ల్లో ఎక్కుడున్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రజలకి వొరిగేదేం లేదు. అయితే ప్రస్తుత రాజకీయ తంత్రంలో నెంబర్లకు కూడా చాలా విలువే ఉంది. అందుకే ఒకరు గాలం పట్టుకుని జెయింట్ ఫిష్ కోసం, తిమింగలం కోసం నిలబడితే, ఇంకొకరు వలే విసిరి కూర్చున్నారు. గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడొస్తే జనానికి ఏమి ఉపయోగం? ప్రజల బతుకులు మాత్రం పెనం మీద నుండి పొయ్యిలోకి లేదా అటు నుంచి ఇటు మారుతూంటాయి. వెరసి, కష్టాల్లోనే, ఇంకా గట్టిగా చెప్పాలంటే కాష్టాల్లోనే అఘోరిస్తాయి. మధ్యలో కాషాయాంబరధారులు రాజగురువులై ఈ పార్టీల మధ్య వారధులుగా కొన్నిసార్లు, అగాధాలుగా మరికొన్ని సార్లు అవతారమెతు ్తతుంటారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సాగుతున్న మూడు స్తంభాలాటిది.
మన రాష్ట్రంలో ఫర్ సేల్ ట్యాగ్ తగిలించుకుని సంతలో నిలబడ్డ వారందర్నీ కొనుగోలు చేసేందుకు ఒక్క అదానీ చాలడా? ఎగువనుండే వాడికి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ విధంగానేగా దిగువ నీళ్లు తాగుతున్న లేడి పిల్లలని దాని ఎంగిలి నీళ్లు తన నోట్లోకొచ్చాయని తోడేలు తినేసింది. ఎగువనుండే వారికున్న అన్ని అవకాశాలూ బీజేపీకున్నాయి. ఇటీవల తెలుగు పత్రికల్లో అయిన, కానున్న జంప్ జిలానీల కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. బీజేపీ చేతిలో డబ్బు సంచుల గలగలలున్నాయి. జమాజట్టీల్లాంటి ఇద్దరు గుజరాతీ కుబేరులున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి కోదండాలున్నాయి. ఎదిరించేవారికి అరదండాలేసే ఎత్తుగడలున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే మచ్చికైన మీడియాలో కావల్సినన్ని కిరాయి కలాలున్నాయి. మోడీ మహల్‌లోని నెమలిగారికి మూడు కాళ్లున్నాయని అధినేత చెప్తే దాన్ని గ్రామ గ్రామానికి మోసుకెళ్లగలిగే వాట్సాప్ యూనివర్సి క్యాడర్ అదనం.
ఇంత సాధనాసంపత్తి ఉన్న బీజేపీ నేతలు, తెలంగాణ తన ఒళ్లో పడ్డట్లేనని రోజూ ఎవరో ఒక కేంద్ర నాయకులు ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఎందరికి ఉద్యోగాలిచ్చావని ఒక 'బండి' కేసీఆర్‌ను ప్రశ్నిస్తాడు. ఒక పక్క ఎఫ్‌సీఐని పండబెట్టి, ప్రజా పంపిణీకి తూట్లు పొడిచి, ఆహార భద్రతను ఫణంగాపెట్టిన బీజేపీ నాయకమ్మణ్యులు వరి ఎందుకు కొనవని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తారు. తాజాగా తాడిచెర్ల మైన్ ప్రయివేటీకరణలో ఎన్నికోట్లు మింగావని పెద్దపల్లికి తప్పిపోయిన పార్లమెంటు సభ్యులు సర్వశ్రీ వివేక్, ఉరఫ్ పారిశ్రామికవేత్తగారు కేసీఆర్‌ను ప్రశ్నించడం చూస్తే అత్త తెడ్డు నాకుతూ కోడల్ని వారించినట్లు లేదా? ఈ లెక్కన కోలిండియాకు చెందిన 160 బ్లాకులను వేలంపాట పెట్టి ప్రయివేటువారికిచ్చేసిన మోడీసర్కార్ లక్షల కోట్ల అవినీతిలో మునగానాం, తేలానాం' కాదా?!
అయితే, ఇవన్నీ మన రాష్ట్ర సర్కార్ పవిత్రతను రుజువు చేసేవేంకాదు. తాటాకు చప్పళ్లుత చేస్తూ ఎంతో కాలం గడపలేరని కేసీఆర్ సర్కార్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆదిలాబాద్ సి.సి.ఐ.కి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీ డైలాగులేమైనాయని ఆ కార్మికులు అడుగుతున్నారు. రెండువేల కోట్లు ప్రకటించి కూర్చుంటే సరిపోతుందా? ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికెగురుతుందా? అన్నట్లు గంత చిన్న సిసిఐని ఉద్ధరించలేని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలు కొనగలదా? చప్పట్లు కొట్టించుకునేందుకు పనికొచ్చే ఆ డైలాగులు ఓట్లు రాల్చవచ్చేమోగాని పరిశ్రమల్ని నిలబెట్టవు ముఖ్యమంత్రి వర్యా! ''ప్రభుత్వరంగం పుట్టిందే చావడానిక''ని ఢిల్లీ సింహాసనాధీశుడు కాకముందే చెప్పాడు మోడీ సాబ్... ప్రభుత్వరంగ పరిశ్రమలను హాల్‌సేల్‌గా ప్రయివేటీకరిస్తామని 2020-21 బడ్జెట్ తన ఉపన్యాసంలో నిర్మలమ్మ చెప్పింది. మొన్ననే ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ''ప్రతి ప్రభుత్వ పరిశ్రమని ప్రయివేటీకరిస్తాం, లేకుంటే మూసేస్తాం'' అన్నాడు వినలేదా కేసీఆర్ సాబ్?! దీన్ని సీరియస్‌గా ప్రతిఘటించకుండా ''మా సింగరేణి జోలికొస్తే ఖబడ్తార్!'' అంటే ఎవరైనా వింటారా? సునామీలో గొడుగేసుకుని నిలబడ్తే ఆపగలరా? టీఆర్ఎస్ అభ్యంతరం ఈ విధానం కాదా? బీజేపీతో పోరు ఇద్దరు నాయకుల మధ్య ద్వంద్వయుద్ధం కాదు. నాలుగు కోట్ల తెలంగాణీయులను రంగంలోకి దింపాల్సింది.
రాష్ట్రంలో బలమైన ప్రజా పునాది ఉన్న పార్టీ కాంగ్రెస్. కాని దాన్నిండా అధికారం చుట్టూ తిరిగే పొద్దు తిరుగుడు పూలే! 2014 ఎన్నికల్లో గెల్చినవారు, 2018లో విజయులెందరో కండువాలు మార్చుకున్న ఉదంతం చూశాం. తాజాగా అనేక మంది పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు కాషాయమైనా, గులాబీ కండువా అయినా తన కాంట్రాక్టులకు, వ్యాపార సామ్రాజ్యానికి ఏది ఉపయోగపడితే ఆ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు... వెరసి, ఈ మూడు స్తంభాలాటలో లేనిది ప్రజలు. బలయ్యేది కూడా ప్రజలే!