Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తిండి కలిగితే కండగలదోరు! కండకలవాడేను మనిషోరు'' అన్నారు మహాకవి గురజాడ. మనిషికి ప్రాణాధారం ఆహారం. మనం తినే ఆహారం ఎంత స్వచ్ఛమైనదైతే అంత ఆరోగ్యంగా ఉంటాం. కానీ, 'కల్తీకి కాదేదీ అనర్హం' అన్నట్టు ప్రస్తుతం మన నిత్యావసర వస్తువులన్నీ 'కల్తీ' మయం అవుతున్నాయి. పండ్లు, పాలు, నూనెలు, కూరగాయలు ఇలా చెబుతూబోతే సమస్త ఆహార ఉత్పత్తుల్లో కల్తీ కాని పదార్థాలు వేళ్లమీద లెక్కబెట్టే అన్ని కూడా లేవు. ఏది కొనాలో... ఏది తినాలో, ఏది మంచిదో, ఏది కల్తీదో నిర్ధారించుకోలేని స్థితికి నెట్టివేయబడ్డాం. కల్తీ మాయాబజారులో డబ్బులిచ్చి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. అనారోగ్యాలతో దవాఖానాల పాలైతే అక్కడిచ్చే మందులను కూడా అనుమానించక తప్పని ప్రపంచంలో బతుకుతున్నాం.
స్వార్థం పెట్రేగిపోయి మానవీయ విలువలు పాటించకుండా దోపిడీ చేయడం ఒకఎత్తు అయితే, మరోవైపు వ్యాపారంలో కనీస విలువలకు కూడా తూట్లు పొడుస్తూ డబ్బు పోగేసుకోవడమే ధ్యేయంగా మారింది. పాల నుండి పాలకుల వరకు, నూనెల నుండి నవ్వుల వరకు వ్యవస్థలో అన్నీ కల్తీమయం అయిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు పాతాళంలో ఉంటే ధరలు నిచ్చెనలెక్కి ఆకాశంలో కూర్చున్నాయి. కనీస సరుకులు కూడా కొనలేని దుర్భరపరిస్థితి నేడు దాపురించింది. చాలిచాలని ఆదాయాలతో అగ్గువకు దొరికే కల్తీ వస్తువులనే వాడుతున్నారు. ఫలితంగా విరోచనాలు, కామెర్లు వంటి సాధారణ వ్యాధులతో పాటు రక్తహీనత, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల భారిన పడి వైద్యం కూడా చేయించుకొలేక మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్ వంటి రోగాల భారీన పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకుని ప్రజారోగ్యనికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలకు ఇది కనీస సమస్యగా కూడా కనపడకపోవడం వైచిత్రి.
కల్తీ సారా వంటి వలన పేదల జీవితాలకు ప్రమాదం వాటిల్లిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానమే స్వయంగా ముళ్లగర్రతో పొడిచి మరి కదిలించే ప్రయత్నాలు చేస్తోంది. అయినా ప్రభుత్వాలు ''మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనుకకు'' అన్నట్టు వ్యవహరించాయే కానీ, చట్టాలను అమలు చేసింది కానీ, చర్యలకు ఉపక్రమించింది కానీ లేదు. తూతూ మంత్రంగా ఏడాదికి ఒకసారి తనిఖీలు చేస్తే ఫలితం శూన్యం. పైపెచ్చు కల్తీ నిరోధక వ్యవస్థ బలహీనత, సిబ్బంది కొరతను గమనించి, ఇది 'మూడు పువ్వులు 36 కాయలు'గా వర్థిల్లుతున్నది. కల్తీ ఆహార పదార్థాలపై పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలను నింపాలని హైకోర్టు ఆదేశించి ఆరేండ్లు గడిచినా ఇప్పటికీ భర్తీకి నోచుకోలేదు. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా! మన రాష్ట్రంలో 30 ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలకు గాను, 23 ఖాళీగానే ఉన్నాయంటే ప్రజల ప్రాణాలపట్ల పాలకులకు ఎంత ఉదాసీనత ఉందో తెలుస్తోంది.
'విధిలేక తింటున్నం! చావలేక బతుకుతున్నం!' అంటూ ఆహారకల్తీపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన చెంది కూడా చాలా కాలమే అయింది. అయినా హైదరాబాద్ పరిసరాల్లోనే వందల కోట్ల కల్తీ నూనె వ్యాపారం జరుగుతోంది. అది రాష్ట్రమంతా విస్తరించింది. మరి దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమిటి? ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ మాఫియాపై చర్యలకు ఎందుకు ఉపక్రమమించడం లేదు. ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమైన ప్రయోజనాలు పాలకులకేమైనా ఉన్నాయా? అన్న అనేక సందేహాలు కలుగుతున్నాయి. గతంలో వినియోగదారుల ఫోరమ్ వంటివి కల్తీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చట్టాల కొరడా ఝుళిపించేవి. నేడా వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేశారు?
చివరికీ కల్తీలు వస్తువులు, సరుకులకే పరిమితం కాలేదు. అవి మనుషులనూ అవరించాయి. వారి ప్రవర్తనలను సైతం ప్రభావితం చేస్తున్నాయి. ''పెనం మీద నుంచి పొయిలోకి పడ్డట్టు'' మనిషి బతుకు చిత్రం మారిపోయిన తరువాత ఆ జీవితాల్లో స్వచ్ఛమైన నవ్వులకు కానీ, ఆత్మీయమైన పలకరింపులకు కానీ చోటే లేకుండాపోయింది. 'కల్తీ' సర్వాంతర్యామి అయి అన్ని వ్యవస్థలను కలుషితం చేస్తోంది. కల్తీమయంగా మారిన వ్యాపార సామ్రాజ్యాన్ని పెకలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, రాజకీయాలు అంతకంటే కల్తీగా మారిపోయాయి. చెప్పేదొకటి చేసేదొకటి అయిపోయింది. బయటకు ఒకటి, లోనొకటిగా మారింది. సేవ అనేది మారి స్వాహా మొదలైంది. ఈ కల్తీల నుండి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఈ ప్రభుత్వాలను కదిలించాల్సింది చైతన్యవంతమైన ప్రజలే.