Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్కూలుకు వెళ్లిన తమ పిల్లలు సురక్షితంగా తిరిగి వస్తారనే హామీ లేని తలిదండ్రులున్న దేశం, తమ కుటుంబ సభ్యులకు ఎప్పుడేమవుతుందో అన్న ఆందోళన పడే కుటుంబాలున్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది అమెరికా ఒక్కటే. ఎవరు ఎందుకు ఎవరి మీద కాల్పులు జరుపుతారో, ఎవరి చేతిలో ఎవరు బలవుతారో తెలియని జనం ఉన్న అపరిమిత స్వేచ్ఛా దేశం అది. ఎదుటి వారు నల్లగా ఉన్నారని అప్పటికప్పుడు ఆవేశం తెచ్చుకొనే శ్వేతజాతి దురహంకారం, దేని మీద అసహనం కలిగినా ఎవరో ఒకరిని తుపాకితో అంతం చేయాలనే కసి ఎక్కడ చూసినా ప్రమాదకరంగా కనిపిస్తోంది. మంగళవారంనాడు టెక్సాస్ రాష్ట్రంలోని యువాల్డీ అనే ఊర్లోని ఒక ప్రాధమిక పాఠశాలలోకి ప్రవేశించిన 18ఏండ్ల సాల్వడోర్ రామోస్ తుపాకితో జరిపిన కాల్పుల్లో 19మంది ముక్కుపచ్చలారని పిల్లలు, ఇద్దరు టీచర్లు మరణించగా మరో పదిహేడు మంది గాయపడ్డారు. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో తెలీదు. హంతకుడిని అక్కడికక్కడే భద్రతా సిబ్బంది కాల్చివేశారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించాడు. తుపాకి సంస్కృతిని అంతం చేయటం గురించి చర్చోపచర్చలు షరా మామూలుగా జరుగుతున్నాయి. పార్టీల మాటలు కోటలు దాటతాయి తప్ప చేతలు గడపదాటకపోవటానికి కారణం రెండు ప్రధాన రాజకీయ పార్టీలను తెరవెనుక ఉండి ఆడించేది కార్పొరేట్ తుపాకి లాబీ కావటమే.
తుపాకి సంస్కృతికి స్వస్తి పలకాల్సిన పెద్దలు దాన్ని పెంచిపోషించటం అమెరికా సమాజం ఎదుర్కొంటున్న పెద్ద విషాదం. ఆ కారణంగానే అమెరికాలోని ప్రతి వందమంది దగ్గర 2011లో 88 ఉంటే ఇప్పుడు 120.5 మారణా యుధాలున్నాయి. తుపాకులను కొనుగోలు చేయటంలో కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉండగా టెక్సాస్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. కొత్తవాటి కొనుగోలులో మన రాష్ట్రం వెనుకబడిపోవటం నాకు చికాకు పుట్టిస్తోంది. కొనుగోళ్ల వేగం పెంచాలంటూ ఆ రాష్ట్రగవర్నర్(మన ముఖ్యమంత్రికి సమానం) గ్రెబ్ అబోట్ పిలుపు ఇవ్వటాన్ని చూస్తే అక్కడి రాజకీయ నాయకత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తుపాకులు కొనుగోలు చేసే వారికి ఒక వేళ నేర చరిత్ర ఉన్నా దాన్ని తనిఖీ చేయకూడదని కూడా సదరు గవర్నర్ సెలవిచ్చాడు. అంతే కాదు, ''అనుమతితో నిమిత్తం లేకుండానే తుపాకులు కలిగి ఉండేవిధంగా'' ఆమోదించిన ఒక బిల్లుకు ఇదే గవర్నర్ గతేడాది జూన్లో ఆమోద ముద్రవేశాడు. దీని ప్రకారమే యువాల్డీ నేరగాడు తన పుట్టిన రోజున రెండు తుపాకులు కొనుగోలు చేసి ఉండాలి. అమ్మమ్మ మీద కాల్పులు జరిపి గాయపరిచిన తరువాత ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అధికారుల అనుమతులు, దాన్ని ఉపయోగించేందుకు అవసరమైన శిక్షణతో పనిలేకుండానే ఎవరైనా తుపాకులు కొనుగోలు చేయవచ్చు, బహిరంగంగా తిరగవచ్చు. ఇప్పటి వరకు 25రాష్ట్రాలలో ఇలాంటి స్వేచ్ఛ ఉంది. రిపబ్లికన్లు-డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా తుపాకీ తయారీ సంస్ధల కనుసన్నలలోనే పని చేస్తారు. నిజానికి ఆ రెండు పార్టీలు తలచుకుంటే విచ్చలవిడి కొనుగోళ్లను నివారించటం అసాధ్యం కాదు. వివిధ ఎన్నికల సందర్భంగా తుపాకులకు అనుకూల, వ్యతిరేక పైరవీకారులు చేసిన ఖర్చు చూస్తే అనుకూలుర ఖర్చు ఎక్కువగా ఉంది. సగం మంది జనం కూడా తుపాకులు కావాలనే చెబుతున్నారు. యువాల్డీ స్కూల్లో మారణకాండకు పాల్పడినవాడు అంతకు ముందు తాను ఒక స్కూల్లో కాల్పులు జరపనున్నట్లు ఫేస్బుక్లో పేర్కొన్నప్పుడే అతగాడిని అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు.
ఈ ఏడాది ఇప్పటికి సామూహిక కాల్పుల ఉదంతాలు 212 నమోదు కాగా మరణించిన వారి సంఖ్య పదిహేడు వేలు దాటింది. గతేడాది తుపాకులకు 45వేల మంది బలయ్యారు. పదేండ్లనాటితో పోల్చితే 43శాతం, ఐదేండ్ల క్రితంతో చూస్తే 25శాతం మరణాలు పెరిగాయి. 2019 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు కొత్తగా అమెరికాలో తుపాకులు కొనుగోలు చేసిన కోటీ పది లక్షల మందిలో 50లక్షల మంది పిల్లలే ఉండటం, మొత్తంగా చూసినప్పుడు సగం మంది మహిళలు, 40శాతం మంది నల్లవారు లేదా స్పానిష్ మాట్లాడేవారు ఉన్నారు. యువాల్డీలో స్పానిష్ మాట్లాడేవారే ఎక్కువ, బాధితులు, హంతకుడు కూడా ఆ సామాజిక తరగతికి చెందినవారే. కరోనా కాలంలో తుపాకుల కారణంగా గాయపడిన పిల్లల సంఖ్య పెరగటానికి వారు తుపాకులు ఎక్కువగా కొనుగోలు చేయటమేనని 2021 అమెరికన్ పిల్లల వైద్య అకాడమీ నివేదిక వెల్లడించింది. గతంలో జరిగిన ఉదంతాలను విశ్లేషించినపుడు ఇలాంటి హత్యాకాండకు పాల్పడుతున్న వారి నేపథ్యాలు, పరిస్థితులను చూసినపుడు శ్వేతజాతి దురహంకారంతో పాటు అనేక సామాజిక అంశాలున్నట్లు తేలినందున మొత్తంగా అమెరికా సామాజిక వ్యవస్థ వైఫల్యానికి ఇది నిదర్శనం తప్ప మరొకటి కాదు.