Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిపాలన మాట అటుంచితే, ప్రజలను వంచించడమే పాలనా దక్షతగా మారిపోతున్న తీరు చూస్తుంటే... ప్రజాస్వామ్యం గుండె పగిలి ముక్కలువుతున్న భావన కలుగుతోంది. ప్రధానమంత్రిగారు రాష్ట్ర పర్యటనలో వల్లించిన ప్రవచనాలు వారి రాజకీయ ప్రయోజనాలనే తప్ప, ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించకపోవడం గర్హనీయం. ఐఎస్బీ ద్విదశాబ్ది ఉత్సవాల కోసం హైదరాబాద్‌కు ఏతెంచిన ఈ ఏలిక, ఎయిర్‌పోర్టులో తన పార్టీ శ్రేణులనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన వంచనా చాతుర్యానికి నిదర్శనం. ''తెలంగాణ అభివృద్ధికై పోరాడుతాం'' అంటూ ఆయన ఢంకా బజాయిస్తుంటే... మాట్లాడుతున్నది ప్రధానమంత్రా లేక ప్రతిపక్ష నాయకుడా అని విస్తుపోవడం ప్రజల వంతయింది!
రాష్ట్రాభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరమూ కాదనలేం గానీ, మోడీ ప్రభుత్వం మాత్రం చేసిందేమిటి? వారు అభివృద్ధి చేయదలచుకుంటే అడ్డుపడిందెవరు? నిజానికి చేయాలనుకుంటే తెలంగాణ అభివృద్ధికి ఆయనకున్నన్ని అవకాశాలూ, అధికారాలూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేవు. కానీ చేసిందేమీ లేకపోగా ఉన్న అవకాశాలకూ మోకాలడ్డిన ఘనాపాటి మన ప్రధాని. లక్షల కోట్ల పెట్టుబడులకూ, లక్షలాది ప్రజల ఉపాధికీ అవకాశమిచ్చే ''ఐటీఐఆర్''ను గత యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేస్తే, దాన్ని రద్దు చేసిందెవరు? మోడీ సర్కార్ కాదా? హైదరాబాద్‌లో నెలకొల్పాల్సిన డబ్ల్యుహెచ్ఓ వారి ఆయుష్ సెంటర్‌ను చివరి నిమిషంలో గుజరాత్‌కు దారి మళ్లించిందెవరు? మోడీ సర్కార్ కాదా? రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని 2016లోనే మహారాష్ట్రకు తరలించిందెవరు? వీరి ప్రభుత్వమేగా! పైగా ఇచ్చిన హామీలలోనూ ఏ ఒక్కటీ నెరవేర్చింది లేదు. ఆఖరికి విభజన చట్టంలోని హామీలను కూడా తుంగలో తొక్కారు. ఇప్పుడేమో తగుదునమ్మా అంటూ నంగనాచి కబుర్లు చెపుతున్నారు!
ఇస్తామన్న బయ్యారం స్టీల్‌ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హౌదా, గిరిజన యూనివర్సిటీ, డిఫెన్స్ కారిడార్... ప్రధానినోట వీటి మాటే రాలేదు! వీటి గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా, ''తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుతాం'' అంటే ఎవరి మీద పోరాడుతారూ, దేనికోసం పోరాడుతారు?! వీటన్నిటినీ కావాలనే ప్రధాని అత్యంత సౌకర్యవంతంగా విస్మరించారుగానీ, తెలంగాణ సమాజం మాత్రం మరిచిపోలేదు. అందుకే ''మోడీ గో బ్యాక్'' హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. మోడీ రాకను నిరసిస్తూ నగరమంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. ''మా రాష్ట్రానికి ఏం చేశావ్? ఏ మొఖం పెట్టుకుని వచ్చావ్?'' అంటూ లక్షలాది ట్వీట్లు, పోస్టులు సునామీలా విరుచకుపడ్డాయి. దేశ వ్యాపితంగా 21 గంటలపాటు అవి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగాయంటే, తెలంగాణ సమాజం మోడీ పట్ల ఎంత అసంతృప్తితో ఉందో, ఎంత ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక కుటుంబ పాలన గురించీ, వారసత్వ రాజకీయాల గురించీ ప్రధాని చేసిన విమర్శలు సైతం గురివింద నీతినే గుర్తుచేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తరహా పాలన అవాంఛనీయమన్న ప్రధాని మాటల పట్ల ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు. కానీ, ఆయన గాజుకొంపలో కూర్చుని ఎదురింటిపై రాళ్లు రువ్వుతున్నానన్న సంగతి విస్మరించడమే విస్తుగొలుపుతోంది! మోడీ ప్రభుత్వంలోని మంత్రుల జాబితాలో మూడొంతుల మంది వారసత్వ రాజకీయాలకు ప్రతినిధులే. బీజేపీ ఎంపీలూ, ఎమ్మెల్యేల్లోని గణనీయమైన సంఖ్య కూడా కుటుంబ పాలనకు ప్రతీకలే. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, షియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు దియాకుమారి, రాజావీర్సింగ్, అశుతోష్ టాండాన్, సురేంద్ర పట్వా వరకూ చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంతవుతుంది. ప్రధాని ఈ నిజాలన్నీ దాచి నీతులు వల్లించడమంటే ప్రజలను వంచించడమే.
అందుకే... ''ఒకవైపు దేశమేమో మతాలుగా కులాలుగా ముక్కలవుతోంది... మరోవైపు పెట్టుబడేమో సంపదగా దోపిడీగా ఏకమవుతోంది... మన నాయకుడేమో ప్రజలను వంచిస్తూ, పెట్టుబడికి ఊడిగం చేస్తూ బలపడు తున్నాడు..'' అంటాడో ప్రజాకవి. ఈ కవి వాక్కులు ఎంత అక్షర సత్యాలో చెప్పడానికి ఇంతకన్నా నిదర్మనం ఏం కావాలీ? ఇదిలావుంటే.... గురువారంనాడు ప్రధాని తమిళనాడులోనూ పర్యటించారు. ఈ రెండు రాష్ట్రాల పర్యటనల్లో తెలంగాణ సీఎం పాల్గొనకుండా రాజకీయాల సాకుతో పక్కరాష్ట్రానికి పలాయనం చిత్తగించగా, తమిళనాడు సీఎం మాత్రం ప్రధానితో వేదిక పంచుకుంటూనే ప్రశ్నలతో నిలదీయడం కొసమెరుపు.