Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరులోనేముంది అని చాలామందిమి అనుకుంటాం కానీ, పేరులో అన్నీవుంటాయి. అది కేవలం పేరుగానే ప్రతిబింబించదు. ఒక చరిత్రను, ఒక పరిణామాన్ని, ఒక దృక్పథాన్ని కూడా తెలియపరుస్తుంది. అది ఊరు పేరయినా, మనిషి పేరయినా, పదార్థం పేరయినా ఏదయినా కానీ, వాటికి సంబంధించిన ఒక భావ చిత్రం దృశ్యమానవుతుంది. అది అనేక ప్రతిస్పందనలకు కారణమవుతుంది. 'వందేమాతరం!' అనే మాట వినగానే తెల్లవాడు వణికిపోలేదూ! 'లంబసింగి' అని పలకగానే అల్లూరి సీతారామరాజు ఉద్యమం గుర్తురాకుండా ఉంటుందా! జలియన్ వాలాబాగ్ స్థలాన్ని తలచుకోగానే డయ్యర్ దుర్మార్గం కళ్లముందుండదూ! భగత్‌సింగ్ పేరు పలకగానే 'ఇంక్విలాబ్' నినాదం ప్రతిధ్వనించదూ? చుండూరూ, కారంచేడూ ప్రస్తావించగానే కులదురహంకార హత్యకాండ నెత్తురు తడి తగులుతుంది కదా!
అందుకే కొన్ని పేర్లు శత్రువుల్లా దునుమాడుతాయి. కొన్ని తల్లి హృదయమై జోలపాడుతాయి. కొన్ని అహంకారాన్ని వెదలజల్లుతాయి. కొన్ని ఎక్కుపెట్టిన బాణాలై భయపెడతాయి. అందుకే పేరులో ఏముందీ అని అనుకోలేము. చాలా ఉంటుంది. పేరు పెట్టటమనేది ఇప్పడిది కాదు. అనాదిగా మానవుడు ప్రపంచానికి పేర్లు పెడుతూనే ఉన్నాడు. మనిషి పుట్టింతర్వాత పేరుపెట్టటమనేది ఒక ముఖ్యమైన ఘట్టంగానే జరుగుతుంది. వారసత్వపు జ్ఞాపకాలను మరచిపోకుండా ఉండేందుకు పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటాము. తాతదో, అమ్మమ్మదో, నాయనమ్మదో, ముత్తాతదో పేరు ఎంపిక చేసి పెట్టి మురిసిపోయేవారు గతంలో. ఆ తర్వాత చరిత్రలో గొప్పవీరుల, ధీరుల పేర్లూ పిల్లలకు పెట్టుకున్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసిన మహనీయులపేర్లూ పెట్టుకుని, ఆ భావాల వెంట పయనించే వాళ్లూ ఉన్నారు. ఎందుకంటే పేరు ఒక స్ఫూర్తినిస్తుంది. చైతన్యాన్ని పురికొల్పుతుంది. ప్రేరణై నిలుస్తుంది. మార్క్స్, జెన్ని, లెనిన్, స్టాలిన్, గాంధీ, నెహ్రూ, సుభాష్, భగత్, ఆజాద్, అంబేద్కర్, సిద్ధార్థ మొదలైన పేర్లెన్నో మనదేశంలో, తెలుగు ప్రాంతాల్లోనూ వినపడుతుంటాయి. ప్రాంతాలు, దేశాల కతీతంగా ఆపేర్లు ఉంటాయి. ఇక రహదారులకు, స్థలాలకు, ఊర్లకు, సంస్థలకు, వీధులకు కూడా పేర్లు పెట్టుకుని వారిని గౌరవిస్తూ ఉంటారు. రాజకీయంగా ఆ పేర్లు గిట్టనివారు ఇప్పుడు తొలగించడమూ చూస్తున్నాము. ఇవన్నీ కొన్ని ప్రస్తావనలు మాత్రమే.
అయితే పేర్లు పెట్టుకోవటంలో, ఆనాటి సామాజిక, సాంస్కృతిక ఆలోచనా ధోరణులు ఇమిడి ఉంటాయి. ప్రస్ఫుటమవు తుంటాయి కూడా. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకతీతంగా సమాజాన్ని నిర్మించుకోవాలని ప్రకటించుకున్న రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడుస్తోందని అనుకుంటున్నాం, కానీ కులాధిపత్య ప్రభావాలు వేళ్లూనుకొని ఉన్న సమాజమే మనది. ధనిక, పేద వ్యత్యాసాలూ అందులో భాగమే. డెబ్భయి ఏండ్ల స్వాతంత్య్రానంతరమూ ఇవేమీ మారలే. మరింత పెరిగి పెద్దయినవి. రాజకీయాలకు ఆటపట్టయినవి.
కోనసీమ ఉదంతం దీనికో ఉదాహరణ. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టినందుకు, మంత్రుల, ఎమ్మెల్యే ఇండ్లు తగలబడ్డాయి. వీధులన్నీ విద్వేషాల్నికక్కాయి. దారీ తెన్నూలేని యువత చేతిలో ఉన్మాదపు రాళ్లు చేరాయి. కులాంతరాల చిచ్చునెగదోస్తూ ఈ దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నది, చిచ్చుపెడుతున్నది ఎవరో బహుశా అందరికి తెలిసే ఉంటుంది. అనేక ప్రజాసమస్యలను గాలికొదిలి, ప్రజల్ని పావులుగా చేసి ఉన్మాదాన్ని చిమ్ముతున్నదెవరో తెలియకపోతే మోసపోతాం. అంబేద్కర్ ఓ ఆదర్శనీయ నేత, సంఘ సంస్కర్త, దీన జనోద్ధరణ ఉద్యమ నాయకుడు, మహామేధావి, రాజ్యాంగ నిర్మాత. ఇంతకంటే ఏం ఎకావాలి ఆయన పేరు పెట్టుకుని స్మరించుకోవడానికి! ఈ దేశం మొత్తానికోసం జీవితమంతా కృషి చేసిన వ్యక్తి పేరును ఒక జిల్లాకు పెట్టుకోవటాన్ని గర్వంగానే భావించాలి. అతన్నొక ప్రాంతానికో, కులానికో కుదించటమంత దౌర్భాగ్యం మరోటి ఉండదు. కుల పీడిత మనువాదాన్ని నిర్మూలించడం కోసం అహర్నిశలూ శ్రమించిన అంబేద్కర్ అందరివాడు. మనుషులందరూ సమనమే అన్న సమతాభావకుడు. అలాంటి మహౌన్నతున్ని కూడా కుల చట్రంలోకి దింపిన కులవాదం నశించకుండా, కుల వ్యవస్థను స్థిరీకరించే మనువాదం నశించకుండా ఆయన ఆశయం నెరవేరదు.
అంబేద్కర్ పేరు వినగానే కులాధిపత్య వర్గాలకు ఎంత కంపరమెక్కుతుందో గమనించండి. కుల రక్కసి, క్యాపిటల్ రాకాసితో ఎంత కలగలసి పోయిందో సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సే ఉంది. వీటిని రాజకీయ అరాచక శక్తులు ఎట్లా వాడుకుంటున్నదీ అవగాహన కావాలి. లేకుంటే అణగారిన వర్గాల వారు ఏకులంలో ఉన్నా నష్టపోతారు. ఒక జిల్లాకు పేరు పెట్టనంత మాత్రాన ఆయనేమీ సమసిపోడు. కులం కుళ్లు ఉన్నంత కాలం అంబేద్కర్ మండుతూనే ఉంటాడు. అంబేద్కర్ పేరు చిరస్మరణీయమే. ఎందుకంటే ఆయన భారతరత్న.