Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దావోస్‌లో బ్రహ్మౌతవం ముగిసింది. రాజులు, యువరాజులు కట్టుకెళ్ళిన ముడుపుల మూటలు 'పెట్టుబడి' దేవుళ్ల సన్నిధిలో విప్పటం, సాగిలపడటం, సదరు దేవుళ్లు ''ఇష్టకామికార్థ ఫలసిద్ధిరస్తు!'' అంటూ 'షఠగోపం' పెట్టడం కూడా షరా మామూలే! కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లే ఏర్పాటు చేసుకున్న ఈ 'దావోస్ బ్రహ్మౌత్సవం' గత యాభయ్యేండ్లుగా (1971) కార్పొరేట్లే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్లకు కాపలాకాసే పాలకులు దావోస్‌లో ఛీఫ్గెస్టులు. వ్యవస్థపై నమ్మకం సడలకుండా ఎప్పటికప్పుడు భ్రమలు వెదజల్లడం దీనిపని. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 2009లో 'షేపింగ్ ఎ పోస్ట్ క్రైసిస్ వరల్డ్' అనీ, 2010లో 'ఇంప్రూవ్ ది స్టేట్ ఆఫ్ వరల్డ్' అనీ, 'రీథింక్, డీ బిల్డ్, రీడిజైన్' వగైరా నినాదాలిస్తూ ఆయా సంవత్సరాల్లో దావోస్ బ్రహ్మౌత్సవాలు జరిగాయి. మొదట్లో దేశాధినేతలే పాల్గొంటున్న ఈ తీర్థయాత్రల్లో ప్రపంచ బ్యాంకు ప్రవేశం తర్వాత 1990లో ముఖ్యంగా 1996 తర్వాత రాష్ట్ర నేతలూ 'పాలు' పంచుకోవడం మొదలైంది. బహుశా బాబుగారే దీనికి ఆద్యుడు. ఎందుకోగాని చంద్రశేఖరరావు సర్కార్‌కు చంద్రబాబు ప్రభుత్వమే ఈ విషయంలో ఆరాధ్యమైనట్లుంది. లేనిది ఉన్నట్లూ, ఉన్నది లేనట్లూ భ్రమింపచేసే ఈ మయసభలో ప్రజల్ని శాశ్వతంగా ఉంచలేరని సరిగ్గా పదేండ్లలో మొహంమొత్తిన బాబు హయామే కల్వకుంట్ల వారి కండ్లు తెరిపించాలి. నాడు చంద్రబాబు చెప్పినన్ని పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే, పరిశ్రమలు వరదలై పొంగేవి కాదా? వేల ఉద్యోగాలు వెల్లువెత్తేవి కావా? ఆనాడే ''స్వర్ణాంధ్రప్రదేశ్'' సాక్షాత్కరించకపోవునా? నేడు ఎనిమిదేండ్ల ''బంగారు తెలంగాణ''లో 17,500 పోలీసు ఉద్యోగాల కోసం 13లక్షల మంది ఎగబడాల్సిన స్థితి ఉండేదా?
యాభైఒక్క దావోస్ బ్రహ్మౌత్సవాల తర్వాత ప్రపంచంలో, నాలుగైదు దేశాల్లో మినహా ఆకలి పోలేదు. దరిద్రం పోలేదు. నిరుద్యోగం సమసిపోలేదు. అమెరికా, ఈయూ, జపాన్ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభపు కడలిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వీటితో ముడేసుకున్న 'గ్లోబెల్ వర్క్‌షాపు' చైనా పెరుగుదలా నెమ్మదించింది. 2021 సంవత్సర ప్రపంచ జీడీపీ పెరుగుదల లెక్కల్ని 6.1శాతం నుండి 3.6శాతానికి మొన్ననే ఐఎంఎఫ్ సవరించింది. తాజాగా దావోస్ 'వరల్డ్ ఎకనామిక్ పోరమ్' కూడా ఇదే అంచనా కొచ్చింది. మనదేశంలో ఫైనాన్షియల్ పత్రికలు కూడా గత కొంత కాలంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆటో మొబైల్ రంగం సంక్షోభం నుండి బయటపడట్లేదు. దీనికి తోడు ముడిసరుకుల ధరలు పెరిగిపోవడంతో తమ లాభాల మార్జిన్స్ తగ్గిపోయాయని టైర్ల కంపెనీల యాజమాన్యాలు ఉత్పత్తి తగ్గించాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో కొంతకాలం కళకళలాడిన రియాల్టీరంగం కుదేలైంది. టెక్స్టైల్ రంగందీ ఇదేస్థితి.
ఈ(దు)స్థితిలో కేటీఆర్ దావోస్ పర్యటన సాగింది. 45 కంపెనీలతో చర్చలు సాగిస్తే రూ.4200 కోట్ల పెట్టుబడులు మన తెంగాణలోకి వస్తాయని చెప్పారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ పెవిలియన్'ను ఎంఎన్‌సిల ప్రతినిధులంతా వేనోళ్ల ప్రశంసించారట! హ్యుండారు కంపెనీ రూ.1400 కోట్లతో 'మొబిలిటీ క్లస్టర్'లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిందట! మంత్రిగారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోని కొన్ని పేర్లు ప్రశాంత్‌పిట్టి, విధిత్ ఆత్రే, సచిన్‌దేవ్ దుగ్గల్, నిఖిల్ కామత్ వంటివి చూస్తే ఈ భారతీయ 'స్టార్ట్ అప్' కంపెనీల 'ఇన్నోవేషన్' (సరికొత్త ఆలోచన)ను వినడానికి దావోస్ దాకా వెళ్ళాలా అనే సందేహం కూడా రావచ్చు.
ఒక విషయం స్పష్టం. తమ ఎన్నికల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కర్నాటక బొమ్మైగారు దావోస్ నుండి తమకు 60వేల కోట్లు పెట్టుడులొస్తున్నాయన్నారు. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలవారు ఈ విధంగానే చెప్పుకోవచ్చు. పెట్టుబడి లాభంవైపే పరిగెడుతుంది. నీరు పల్లానికే ప్రవహిస్తుందన్నంత నిజమిది. చౌకగా భూమి కొట్టేయడం, పన్ను రిలీఫ్‌లు సాధించడం, నీరు, విద్యుత్ వంటివి వీలైతే పుక్కట్లో సంపాదించడం, కార్మిక చట్టాలన్నింటినీ తొత్తడం చేసి శ్రమ దోపిడీకి పాలకులు గేట్లు ఎత్తేస్తే పెట్టుబడి ఎక్కడికైనా ప్రవహిస్తుంది. ఇన్ని చేసినా కొనుగోలు చేసే మార్కెట్ ఉండాలి. పైన పేర్కొన్న ధనిక దేశాలన్నీ మాంద్యంలో కొట్టుకుంటున్నాయి. కనీసం మన దేశంలో ధనవంతులు, నయా ధనవంతులకైనా అమ్ముకోవాలన్నా వారి ఆదాయాలు స్థిరంగా ఉంటాయో లేదో అనుమానం.
గత ఎనిమిదేండ్లుగా అవిగవిగో కంపెనీలు, ఇవిగివిగో కొలువులు అంటూ కాలక్షేపం చేస్తున్నారు రాష్ట్ర పాలకులు. సెంటిమెంటొక్కటే చిరకాలం తిండిపెట్టదు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, పారిశ్రామిక విధానాలను ప్రతిఘటిస్తూనే రాష్ట్రంలోని కోట్లాది కష్టజీవులకు అందించగల సాయం అందించాలి. అవే విధానాలను తామూ అములుచేస్తూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేరని రాష్ట్ర పాలకులు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంతమంచిది.