Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనిషికి తినటానికి తిండి, కప్పుకోవటానికి బట్ట, తలదాచుకోవటానికి ఓ కొంప అవసరం. వీటిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది...' ఒకానొక సందర్భంలో కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన మాటలివి. వీటితోపాటు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించటం ద్వారా ప్రజలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టు చేయగలగటం కూడా పాలకుల బాధ్యతే. ముఖ్యంగా రెక్కాడితేగానీ డొక్కాడని పేదలకు పని కల్పించటం అత్యంత ఆవశ్యకం. ఇదే ఉద్దేశంతో వామపక్షాల ఒత్తిడి మేరకు 2005లో ఉపాధి హామీ చట్టా(నరేగా)న్ని ఆనాటి యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా బడుగు జీవులకు ఎంతో కొంత ఉపశమనం లభించింది. అప్పటి నుంచి పని దొరకటమే కాదు.. దేశంలోని పేదల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి.
కానీ కేంద్రంలో యూపీఏ పోయి ఎన్డీయే వచ్చిన తర్వాత 'ఉపాధి'కి తూట్లు పొడవటం ప్రారంభమైంది. రకరకాల కొర్రీలు వేస్తూ కండీషన్లు పెడుతూ ఆ పథకాన్ని నిర్వీర్యం చేయటానికి మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. మరోవైపు సహకార సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని, వివక్షనూ ప్రదర్శిస్తున్న కేంద్రం... నరేగా నిధులకూ గండి కొడుతున్నది. రాష్ట్రాలకు సంబంధిత డబ్బును సకాలంలో విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నది. ఇదే క్రమంలో తెలంగాణలో ఈ చట్టం అమలు కోసం ఇప్పటి వరకూ రూ.11,711 కోట్లను ఖర్చు చేశారు, అందులో ఇంకా రూ.1,100 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. బకాయిపడ్డ ఈ నిధులను సత్వరమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం వైపు నుంచి స్పందన కరువైంది. నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమై రెణ్నెల్లు పూర్తవుతున్నా ఆ నిధులకు అతీగతీ లేకపోవటం ఆందోళనకరం. దీంతో కిందిస్థాయిలోని పేద కూలీలు సకాలంలో డబ్బులు అందక విలవిల్లాడుతున్నారు. కరోనాతో జీవితాలు కకావికలమై.. ఉపాధి కరువై అల్లాడుతున్న పేదలకు ఇది గోరు చుట్టపై రోకటిపోటులా మారింది. వారికి మరిన్ని రోజులపాటు పని కల్పించాల్సిన కేంద్రం... అందుకు భిన్నంగా ఉన్న ఉపాధినే ఊడగొట్టేందుకు ప్రయత్నించటం శోచనీయం.
మరోవైపు నిధుల విషయంలో కేంద్రం వైపు వేలెత్తి చూపుతున్న టీఆర్ఎస్ సర్కారు... ఒక విషయంలో మాత్రం అదే కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి మద్దతు పలుకుతుండటం విస్మయపరిచే అంశం. అదే వ్యవసాయానికి ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానించటం. బీజేపీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ అనుసంధానాన్ని గులాబీ పార్టీ కూడా కోరుకుంటున్నది. అదే జరిగితే ఇప్పటిదాకా నరేగా ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో... వాటన్నింటికీ తిలోదకాలు ఇచ్చేనట్టే అవుతుంది. ఇప్పటి వరకూ పేదలు, కూలీలు 'ఉపాధి' ద్వారా ఒకడి కింద ఊడిగం చేయకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడ్డారు. ఇది వారిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, ఇతర బూర్జువా పార్టీలు కోరుకున్నట్టు... ఆ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానిస్తే అవి రెండూ పూర్తిగా తొక్కేయబడతాయి. ఈ పేరుతో గ్రామాల్లోని భూస్వాములు, పెత్తందార్ల భూములు, ఇండ్లలో పేదలు చాకిరీ చేయాల్సి వస్తుంది. ఇదిప్పుడు అందర్నీ ఆందోళనపరిచే అంశం. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా... బీజేపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీలేవైనా సరే... 'ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం...' చేయాలని చూస్తే దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఇందుకోసం పేదలు, వ్యవసాయ కార్మికులతో కలిసి మేధావులు, అభ్యుదయవాదులు నడుం బిగించాలి. దీంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఇదే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచకపోవటం, ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించకపోవటం, ఐదు కిలోమీటర్ల దూరం దాటితే ప్రయాణ ఖర్చులు భరించాలన్న నిబంధనను అమల్జేయక పోవటం, పలుగు, పార, తట్ట, బుట్ట తదితర వస్తువులను ఏడేండ్ల నుంచి ఇవ్వకపోవటం, టెంట్లు వేయకపోవటం తదితర సమస్యలు 'ఉపాధి'ని వెంటాడుతున్నాయి. వీటికితోడు కూలీలకు మస్టర్ల సమస్య ప్రధానంగా ఎదురవుతున్నది. అంటే పనికి వెళ్లిన కూలీల ఫొటోలు, వేలి ముద్రలను ఏ పూటకాపూట వెబ్సైట్లో అప్లోడ్ చేసి పై అధికారులకు పంపాలన్నమాట. అనేక గ్రామాలకు ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని క్రమంలో... ఇది ఆచరణ సాధ్యం కాని పని. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని ఇలాంటి సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించటం ద్వారా 'ఉపాధి'ని మరింత పటిష్ట పరచాలి. లేదంటే పేదలు, వ్యవసాయ కార్మికులు తమ పోరాటాల ద్వారా ఆ పనికి పూనుకోవాల్సి వస్తుంది.