Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయోధ్యలో రామాలయ నిర్మాణం తరువాత వారణాసి, మథుర, బృందావనం వంటి ప్రార్థనా స్థలాల్లో కొత్త మేలుకొలుపు వస్తోందనీ, వాటిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలనీ చెపుతున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం సంఫ్‌ుపరివార్ వికృత కుట్రను బహిరంగపరిచింది. లక్నోలో ఆదివారంనాడు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చేసిన ఈ ప్రసంగంలో ఆయన వారణాసి, మథుర, బృందావనం, వింధ్యావాసి ధామ్, నైమిశ ధామ్... అంటూ వరుస జాబితా వల్లె వేయడం ఆ ప్రాంతాలన్నిటా మత కుంపటిని రాజేస్తామని చెప్పడమే! ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆ దిశగా నడిపించాలన్న ప్రయత్నమే. జ్ఞాన్వాపి మసీదులో శివలింగం ఉందన్న పేరుతో ఇప్పటికే వారణాసిలో చిచ్చు రగిల్చారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా నమాజులు జరగనివ్వలేదని యోగి గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించడమేగాక ముస్లింలు చేసుకునే ప్రార్థన సందర్భంగా వెలువడే శబ్దాలను ఆయన పనికిమాలిన ధ్వనులుగా ఛీత్కరించుకోవడం కుసంస్కారమే. ఉత్తరప్రదేశ్‌లోని 80లోక్‌సభ స్థానాల్లో 75 గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుండే పనిచేయాలన్న యోగి పుంగవుని మార్గ నిర్దేశనం పరివార్ శ్రేణులకు ఎంతటి పూనకం తెస్తుందో వేరుగా చెప్పనక్కరలేదు. ఇకనుండి పైన పేర్కొన్నవేగాక ఇంకొన్ని ప్రార్థనా స్థలాలకు సంబంధించిన సరికొత్త వివాదాలు పుట్టుకొస్తాయన్నమాట. వాటిని ఆసరా చేసుకొని పరివార్ శక్తులు విద్వేష రాజకీయాలు నడుపుతాయని స్పష్టమవుతోంది.
దేశంలోగల అన్ని బహిరంగ ప్రార్థనా స్థలాలు అంటే దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు మొదలైనవన్నీ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్టు 15 నాడు ఎలా ఉన్నాయో అదే యధాతధ స్థితిలో కొనసాగుతాయనీ, వాటి చరిత్ర లేదా మరో పేరుతో ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు మార్చడానికి వీల్లేదని ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం (1991) స్పష్టంగా పేర్కొంది. కేవలం అయోధ్యలోని వివాదాస్పద కట్టడం మాత్రమే ఇందుకు మినహాయింపని 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో సైతం ఐదుగురు సభ్యుల ధర్మాసనం పునరుద్ఘాటించింది. కాబట్టి జ్ఞాన్వాపి మసీదు మొదలు యోగి చెప్పిన జాబితాతో సహా అన్ని ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని ఇప్పుడు మార్చాలనడం చట్ట విరుద్ధం. కానీ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఇలా బాహాటంగా చట్టాన్ని ఉల్లంఘించమని చెప్పడం పెద్ద నేరం. ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించడం ద్వారా రాజకీయాధికారాన్ని పొందాలన్న ఆర్ఎస్ఎస్ హిందూత్వ ప్రాజెక్టును అమలు చేయడానికి పూనుకున్న బీజేపీ నాయకులకు భారత రాజ్యాంగం అన్నా చట్టాలన్నా లెక్కలేదు. వారికి కావలసింది అధికారం. అందుకోసం ఏమైనా చేస్తారు. ఎంతటి మారణహౌమానికైనా తెగబడతారు. అయోధ్య రథయాత్ర, గుజరాత్ నరమేథం... ఇలా ఎన్నో, ఎన్నెన్నో!
లక్నోలో యోగి ఉవాచ అలా ఉండగా కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్లో శాంతిని నెలకొల్పారని చెప్పడం ఎంత పెద్ద అబద్ధం! గుజరాత్లో మత విద్వేషాలను పథకం ప్రకారం సృష్టించి, మారణహౌమం సాగించి, ఆ తరువాత ముస్లిం మైనార్టీలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారన్నది జగమెరిగిన సత్యం. అదే గుజరాత్ ప్రయోగాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కాషాయ పాలకులు అమలు చేస్తున్నారు. కర్నాటకలో ప్రస్తుతం అమలు జరుగుతున్నది కూడా అదే ప్రయోగం. ఇలా... దేశమంతటికీ విస్తరింపజేయాలన్నది హిందూత్వ మతతత్వ శక్తుల కుట్ర. మోడీ పాలనలో దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ పునాదుల్ని విచ్ఛిన్నం చేసే వికృత క్రీడకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి పాల్పడుతోంది. ప్రజలంతా ఐక్యమై ఈ కార్పొరేట్ హిందూత్వ కూటమిని మట్టిగరిపించాలి. జనాన్ని చీలదీసే కుయుక్తులను తిప్పికొట్టాలి. ప్రజలను ఐక్యం కానివ్వకుండా విడదీసే విద్వేష రాజకీయాలపట్ల అప్రమత్తతే ఈ దేశానికి రక్ష!