Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యజ్ఞ యాగాదుల్లో అగ్ని గుండం ఆరకుండా ఉండేందుకు నేయి పోస్తారు. తమ పెట్టుబడిదారుల లాభయాగాలు ఆగకుండా ఉండేందుకు అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు నిత్యం ఏదో ఒక మూలన అగ్గిరాజేసి దాన్ని ఆరకుండా చూడటం, ఒకదగ్గర కొనసాగింపు కుదరకపోతే మరోకొత్త అగ్గి రాజేస్తున్న తీరు తెన్నులు తెలిసిందే. శుక్రవారం నాటికి ఉక్రెయిన్‌లో పెట్టిన చిచ్చు వందవ రోజుకు చేరింది. దాన్ని ఆరకుండా చూసేందుకు మరిన్ని ఆధునిక మారణాయుధాలను అందచేస్తామని అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు ప్రకటించాయి. అమెరికా దాని మిత్ర(జనానికి శత్రు) దేశాలు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా చైనా, రష్యాలను ఒకేసారి దెబ్బతీసేందుకు చూస్తున్నాయి. దానిలో భాగంగానే రష్యన్లు ఉక్రెయిన్ ఆక్రమణకు పూనుకున్నారు తరువాత చైనా మిలిటరీ తైవాన్ను ఆక్రమిస్తుందనే ప్రచారం ప్రారంభించిన అంశం తెలిసిందే. తైవాన్ చైనాలోని ఒక తిరుగుబాటు ప్రాంతం, ఏదో ఒకనాడు చైనాలో విలీనం కావాల్సినదే. ఇప్పటికే ఉన్న వివాదాన్ని మరింత పెంచేందుకు అమెరికా సరికొత్తగా పావులు కదుపుతోంది.
ఇటీవల అమెరికా అధినేత జో బైడెన్ తొలిసారిగా జరిపిన ఆసియా పర్యటనలో ఒక వేళ తైవాన్ను గనుక చైనా బలవంతంగా విలీనం చేసుకుంటే తాము మిలిటరీ జోక్యం చేసుకుంటామని ప్రకటించిన అంశం తెలిసిందే. తైవాన్ ప్రాంతం చైనాలో అంతర్భాగమని ఒక వైపు గుర్తిస్తూనే అక్కడ అగ్గిరాజేసేందుకు బైడెన్ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ పర్యటనలోనే ఇండో-పసిఫిక్ ఆర్థిక చట్రం(ఐపిఇఎఫ్) అనే కొత్త ఆర్థిక కూటమికి రూపకల్పన చేశారు. తైవాన్ను ఐరాస ఒక దేశంగా గుర్తించలేదు గనుక ఆ చట్రంలో దాన్ని చేర్చటం కుదిరేపని కాదు. అందువలన అమెరికా ఇప్పుడు సరికొత్త ఎత్తుగడతో ముందుకు వస్తోంది. ''ఇరవై ఒకటవ శతాబ్దపు అమెరికా-తైవాన్ వాణిజ్య చొరవ'' పేరుతో కొత్త వివాదానికి తెరతీశారు.
ఈ అమెరికా-తైవాన్ చొరవ తైవానుకు గుర్తింపు అని చైనాలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులతో కూడిన ప్రభుత్వం వర్ణించింది. అందుకే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి లేదా సభ్యదేశాలు గుర్తించకపోయినా తమకు తాము స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్న ప్రాంతాలు ఉన్నాయి. తైవాన్ విడిగా ఉంది స్వాతంత్య్రం ప్రకటించుకోలేదు. అలాంటి వివాదాస్పద ప్రాంతాలతో సహా ఇతర చోట్ల ఉన్న పరిశ్రమలు, సంస్థలతో దేశాలు వాణిజ్య సంబంధాలు, లావాదేవీలను కొనసాగిస్తున్నాయి. వాటిని అభ్యంతర పెట్టటం లేదు. తైవాన్‌తో కూడా ఎప్పటి నుంచో అలాంటి సంబంధాలున్నాయి. 2020లో అమెరికా తైవాన్ మధ్య 106 బిలియన్ల విలువగల వస్తు, సేవల వాణిజ్యం జరిగింది. తైవాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామి చైనా, దాని వాటా 26శాతం ఉండగా మిగిలిన దేశాల్లో అమెరికా 13.2, జపాన్ 10.9, ఐరోపా సమాఖ్య 8.2, హంకాంగ్ 7.9శాతాలను కలిగి ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. వీటిని ఎన్నడూ చైనా వ్యతిరేకించలేదు.
అమెరికా ఈ స్థితిని మార్చి తైవాన్ను ఒక దేశంగా పరిగణిస్తూ వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు పూనుకోవటాన్నే చైనా వ్యతిరేకిస్తోంది. అమల్లో ఉన్న అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సర్వసత్తాక దేశాల మధ్యమాత్రమే ఒప్పందాలకు గుర్తింపు ఉంటుంది. దాన్ని ఉల్లంఘించి చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌తో ఒప్పందానికి ఉపక్రమించారు. ఇది తైవాన్‌పై చైనాకు ఉన్న హక్కును గుర్తించ నిరాకరించటమే. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థలో సైతం ఒక దేశంగా ప్రాతినిధ్యం కల్పించటాన్ని గతంలో చైనా అంగీకరించలేదు. ఇప్పటికే ఆయుధాలను అందచేసి చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను ఒక సాయుధశక్తిగా మారుస్తున్నది, అక్కడ వేర్పాటు వాదాన్ని పెంపొందిస్తున్నది. తైవాన్ జలసంధిలోకి తన సైనిక నావలను నడుపుతూ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. జపాన్‌లోని ఒకినావా దీవిలో అమెరికా సైనిక కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. అది జపాన్ ప్రధాన భూభాగం కంటే తైవాన్, చైనాలకే అతి సమీపంలో ఉంది. జపాన్‌కు రక్షణ కల్పించే ముసుగులో అవసరమైతే చైనాపై దాడులకే దాన్ని ఏర్పాటు చేశారన్నది తెలిసిందే. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం ముసుగులో చైనా అంతర్గత వ్యవహారాల్లో చేసుకుంటున్న జోక్యంలో మరో అడుగు ముందుకు వేస్తున్నది. ఇది ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే, చైనా అంగీకరించే ప్రసక్తి ఉండదు.