Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్విలేక చతురతగలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ! అని హిరణ్యకశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ చెప్పిన మాటలు. చదువుకోవాలి, ఎందుకంటే చదివితే మంచీ చెడుల మధ్య తేడా ఏంటో తెలుస్తుంది అని చెప్పాడు. మన పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతంలోని పద్యమిది. బాగానే ఉంది. హిరణ్యకశ్యపుడు రాజు. తన ఆలోచనలకు, రాజ్యానికి అనుకూలమైన, మద్దతుపొందే చదువును, శైవసంప్రదాయాన్ని అందించాలనే తలంపుతో చదవమన్నాడు. కానీ వాడు నేర్చుకున్నది వేరు. అసలు విషయమేమిటంటే, పాలకులు ఎప్పుడయినా అది రాజుల కాలమైనా ఆధునిక కాలమైనా, తమకు పనికివచ్చే, తమను సమర్థించే విద్యనే నేర్పాలనుకుంటారు. సత్యాసత్యాలతో వారికి పనిలేదు. మన విద్యావిధానం కూడా ఆంగ్లేయుడు మేకాలే రూపొందించినదే. సేవకులుగా తీర్చిదిద్దే విద్యను ఎంచక్కా అమలు పరిచారు. భారతీయ రక్తం కలిగున్నా, ఆలోచనల్లో ఆంగ్లేయుల ననుసరించాలని భావించారు. అయితే మన ప్రహ్లాదుడిలాగానే కొందరు భారతీయులు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విముక్తి పోరాటానికి పూనుకొన్నారు. వాస్తవిక చైతన్యంలోకి వచ్చారు.
ఇదంతా చరిత్ర. డెబ్బయియేండ్లు దాటిన స్వాతంత్య్రంలో మనం ఎలాంటి విద్యను గరుపు తున్నాము. మనశక్తిని మనం పెంచుకోవటానికి, సాధికారతను సాధించుకోవటానికి, సొంత ఆలోచనతో శాస్త్రసాంకేతికరంగంలో, పరిశోధనలో ప్రగతిని పొందేందుకు విద్యను మలచుకున్నామా! స్పష్టంగానే కాదు, లేదు అని చెప్పవచ్చు. మార్కెట్లో మహావ్యాపారులకు లాభాలను ఎలా తెచ్చిపెట్టాలనే పరిశోధనలే ఉన్నత విద్యా లక్ష్యాలుగా మారాయి. మార్కెటింగ్ నైపుణ్యాల కోసమే విద్య బోధించబడుతోంది. గత పది సంవత్సరాలలో పరిశోధనలో ఒక్క ముందడుగూ లేదు. అంతే కాదు, మూడు దశాబ్దాలుగా పరిశోధన ఫలితాలేవీ లేక పోవడం, వాటి కోసం ప్రయత్నమూ, వ్యయమూ, కేటాయింపులూ జరగకపోవడం ఒక విషాదం. అసలు ఉన్నత విద్యలో ప్రభుత్వ ప్రమేయాన్ని తొలగించుకుంటూ ప్రయివేటుకు ప్రోత్సాహాన్ని పెంచటాన్ని చూస్తున్నాము. ఎదుగుతున్న ప్రపంచానికి భారతదేశం ఆదర్శమనే ప్రచారం వెనకాల ఉన్న చేదునిజాలివి. కేవలం మాటలకు, ప్రచారానికి మాత్రమే పరిమితమైన పాలకవర్గాల ఆలోచన ఫలితాలు ఇలానే ఉంటాయి.
ఇదలా ఉంచితే, 'చదివిన వాడజ్ఞుండగు' అని పోతనగారిని తిరగేసి చదువుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యారంగానికి మరో పెద్ద ప్రమాదం ఎదురవుతున్నది. అదేమంటే మత పరమైన, మనువాద భావజాలాన్ని విద్యలోకి తెస్తున్నారు. పురాణాలు, వేదాలు, భగవద్గీతలు, జ్యోతిష్యం, హస్త సాముద్రిక జ్ఞానం, చిలుక జ్యోస్యాలు మొదలైన వాటిని ప్రవేశపెట్టి, విద్యార్థుల మెదళ్లను వికసించకుండా, మూఢత్వాన్ని నింపుతున్నారు. ఇవన్నీ కూడా ఇష్టమైనవాళ్ళు ఇంట్లోవుండి చదువుకోవచ్చు. వీటికి విద్యాలయాలు అవసరం లేదు. అంటే భావితరాలు మూఢత్వంలో మునిగిపోయి, నమ్మకాల్లో కూరుకుపోవాలని పాలకులు కోరుకుంటున్నారు. ఇకపోతే చరిత్రకు సంబంధించిన విషయాలను కూడా మత ప్రాతిపదికన వక్తీకరించి అందించే ప్రయత్నం ఆరంభమయింది. ఇటీవల కర్నాటక రాష్ట్రంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం, పాఠశాల పాఠ్యాంశాల పునర్‌పరిశీలనకు కమిటీని వేసి పాఠాలను మారుస్తున్నది. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన భగత్‌సింగ్ పాఠాన్ని, టిప్పు సుల్తాన్, సంఘ సంస్కర్తలు బసవన్న, పెరియార్, నారాయణ గురు వంటివారి చరిత్రను సిలబస్ నుండి తొలగించింది. స్వాతంత్య్రోద్యమానికి ఏ సంబంధమూ లేని ఆరెస్సెస్ వ్యవస్థాపక నేత హెడ్గేవార్ చేసిన ప్రసంగాన్ని పాఠంగా చేర్చారు. వీరుల త్యాగాల చరిత్రను మరుగుపరచి మతతత్వాన్ని పాఠ్యాంశాల్లోకి తెస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అందుకనే కర్నాటకలోని రచయితలు, కవులు దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మేధావులు, విద్యావేత్తలు, రచయితలు తమ తమ పదవులకూ రాజీనామా చేసి, రాజ్యాంగానికి విరుద్ధంగా విద్వేషాలు పెంచే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఖండించారు. విద్యను కాషాయీకరించే చర్యను సహించబోమని హెచ్చరించారు. మేథోవర్గాల నుండి ఈ రకమైన స్పందన రావటం శుభపరిణామం. భవిస్యత్ తరాలు ఛాందసత్వంలో, మత మూఢత్వంలో కూరుకుపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తిరోగమన చర్యలను అడ్డుకోకపోతే, ఆధునిక వెలుగుల భారతాన్ని కలగనలేము. మేధావులు, ప్రజలు మేల్కోవాలి.