Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్ళద్దాల రంగు గురించి కాదు, వాటి గుణం గురించే! ఆ కంటి అద్దాల్లో నుండి కొన్నే కనపడతాయి. ఎన్నో కనపడవు. అన్నీ అసలు కనపడవు. తాజాగా కాషాయదళానికి ఒక ''చాన్స్'' దొరికింది. దాన్ని ఉపయోగించుకుని మన తెలంగాణలో కాలకూటాన్ని చిలకరిస్తున్నది. గల్లీస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతలవరకు సింగిల్ పాయింట్ ఎజెండాతో 'శివతాండవం' చేస్తున్నారు. జులై మొదట్లో జరిగే అఖిల భారత సమావేశాల కోసమనుకుంటే తప్పులో కాలేసినట్లే. దానికి వారి వెన్నుకాచే కాసులమూటలెన్ని లేవు?! వారికోసమేగా మోడీసర్కార్ గత ఎనిమిదేండ్ల నుండి ప్రభుత్వరంగ సంస్థల విధ్వంసం చేస్తోంది? ఆ ఉత్సవాన్ని వారికొదిలేస్తే అంగరంగ వైభవంగా జరిపేస్తారు కాదా!
నేటి కమలం పార్టీ కేంద్రీకరణంతా జుబ్లీహిల్స్ పబ్ ఘటనపైనే! మైనర్ బాలికను అపహరించి సామూహిక మానభంగం చేసిన ఘటనపైన కూడాకాదు. అది చేసింది ముస్లిం యువకులన్న దానిపైనే! ఒక ఆడపిల్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనలోనూ మతాన్ని చూడటం బీజేపీకే చెల్లుతోంది. శాసనసభ్యుల, మంత్రుల వారసులున్నారని కూడా మీడియాలో గుసగుసలు చక్కర్లుకొడుతున్నాయి. నిజానిజాలు తేల్చాల్సింది పోలీసులు, వారి పరిశోధన. ఆపని చేయకుండానే తీర్పులిచ్చేస్తున్నారని కొందరు ఐపీఎస్‌లు బ్యానర్లకెక్కుతున్నారు.
తన నలుపెరుగని పెద్ద గురివింద బీజేపీ. తమ యోగి నేతృత్వంలోని సర్కార్ ఆత్రాస్లో దళిత మహిళ సామూహిక మానభంగం, హత్య తర్వాత వారి కుటుంబానికి ఆమె భౌతికకాయాన్ని కూడా ఇవ్వకుండా అర్థరాత్రే అంత్యక్రియలు నిర్వహించిన సంగతి, సాక్ష్యాలను కాల్చి బూడిద చేసిన సంగతి మన రాష్ట్ర బీజేపీ నేతలు మరిచిపోయినట్టున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని కతువాలో ఏడు ఏండ్ల అసీఫాని గుళ్లోనే మానభంగం చేసి పూడ్చిపెట్టారు రాకాసులు. ఆ కేసులో అరెస్టు చేసిన వారి విడుదల కోసం జరిగిన ప్రదర్శనలో ఆకాలంలో రాష్ట్ర బీజేపీ మంత్రులు పాల్గొన్నారు. అత్రాస్ కేసులో అరెస్టు అయిన బీజేపీ నేత విడుదల కోసం తపించిన ఒక మంత్రి పుంగవుడు, సదరు ''రాక్షసనేత యవ్వనమంతా జైల్లో గడిచిపోవల్సిందేనా?'' అని ప్రశ్నిస్తున్నాడు. బయటే ఉండి ఉంటే ఇంకా ఎన్నో మానభంగాలు చేయాల్సిన యవ్వనం జైలు గోడల మధ్య మగ్గుతోందని ఆయన ఆవేదన కాబోలు. మన రాష్ట్రంలో వారి వారసులు నేడు కార్చిన మొసలికన్నీటితో మన డ్రైనేజి వ్యవస్థ 'చోక్' అయిపోయింది. బూర్జువా పార్టీల నేతలు వారి పిల్లల్ని సాకుతున్న తీరు, రాష్ట్రంలో విస్తరిస్తున్న సాంస్కృతిక కాలుష్యం తీరుతెన్నులు నేడు అసలు చర్చలోకి రావడం లేదు. వాటిని సౌకర్యవంతంగా పక్కకు జరిపేస్తున్నారు. ప్రత్యూష హత్య విషయంలో, ఆయేషామీరాను చంపేసిన సందర్భంలో నాటి టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల పుత్రరత్నాల పేర్ల చుట్టూ జరిగిన రభస ప్రజల స్మృతిపథం నుండి ఇంకా చెరిగిపోలేదు.
కాషాయ సులోచనాలకు కనపడని మరో విషయం కులదురహంకార హత్యలు. సారీ! కాషాయ పొరలుకమ్మిన కండ్లకు కనపడని అంశమది. తెలంగాణ వచ్చాక సుమారు డెబ్భయి వరకూ కుల దురహంకార హత్యలు జరిగాయి. వాటిలో బలయిన వారంతా దళితులు, ఇతర సామాజికంగా వెనుకబడ్డ తరగతులవారే! వీటిలో ఒక్కదానిపై కూడా స్పందించని కాషాయ దళాలు ఒక్క నాగరాజు హత్యోదంతంలో మాత్రం రెండ్రోజులు తీరిక చూసుకుని నానా యాగీ చేశారు. కారణం? చంపినోడు మొబిన్ అహ్మద్ కాబట్టి. నాగరాజును అతను చంపుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసింది చుట్టూ నిలబడి సెల్ఫోన్లో షూట్చేస్తూ కాషాయదళాలకు ఉప్పు అందించిన వారు కాదు, స్వయంగా నాగరాజు ప్రేయసి అస్రీన్ సుల్తానా. సలీమ్, అనార్కలీల ప్రేమంత లోతైన ప్రేమ వారిది. ప్రేమని మతంతో, కులంతో జోకలేరన్న సంగతి నాటి పాదుషా నుండి నేటి మొబిన్ లాంటి ఉన్మాదుల వరకు అర్థం చేసుకునే రోజులెప్పుడొస్తాయో!
విశ్వనగరం అవ్వుడు సంగతేమోగాని 'పబ్'ల సంస్కృతి మాత్రం మన హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తోంది. 150కి పైగా పబ్బులు..! వాటిలో విస్తారంగా డ్రగ్స్ వినియోగం..! మద్యానికి అంతేలేదు..! ఆరోజు 'అమ్నీషియా' పబ్‌కు ఎందురు మైనర్లొచ్చారు? అసలు మైనర్లను పబ్‌లకు అనుమతిస్తారా? వారికి డ్రగ్స్ ఇచ్చారా? అసలు ఇస్తారా? రాత్రి 12 గంటల నుండి తెల్లవారి 5 గంటల వరకు పార్టీ ఇచ్చిందెవరు? మే 28న ఘటన జరిగితే మే 31న ఆమె తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాతనైనా ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? మూడో తారీఖు వరకు దీన్ని మూతెందుకేశారు? ఈ సాంస్కృతిక విశృంఖలత్వానికి ప్రభుత్వాలు ఎందుకు గేట్లు బార్లా తెరుస్తున్నాయి? ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులకు సత్వర న్యాయం అందించాలి. నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెడితే దానితో పాటు ఈ పశ్చిమ దేశాల సాంస్కృతిక కాలుష్యం కూడా చొరబడి తీరాల్సిందేనా? అది అనివార్యమైనప్పుడు కాషాయ ''సాంస్కృతిక పోలీసులు'' వాలంటైన్ డే రోజు మాత్రం విజృంభిస్తే అర్థం ఉంటుందా?
దేశంలో అధికారం చెలాయిస్తూ 'మత'మొక్కటే పరమ పద సోపానపటంలో నిచ్చెనలందించే ఏకైక మార్గమని భావించేవారు మన ఏలికలుగా ఉండటం మన దౌర్భాగ్యం.