Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ తలవంపులకు కారణమెవ్వరు! డెబ్భయి ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావని జీవన విధానానికి కళంకమద్దుతున్నదెవ్వరు? భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుని, సత్యాహింసల శాంతి ప్రబోధాన్ని ప్రపంచాన చాటిన తరతరాల నేలను కల్మషమయం చేస్తున్నదెవరు! 'వసుధైక కుటుంబకం' అన్న నినాదముద్భవించిన భూమిలో విద్వేష కోరలు చాస్తున్నదెవరు? 'భారతీయులందరూ నా సహౌదరులు' అనే ప్రతిజ్ఞకు తూట్లు పొడుస్తున్న వేర్పాటువాదులెవ్వరు? సహనశీల మనస్సులలో విధ్వంసాల నెగళ్లనెగదోస్తున్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పాలక పార్టీవైపునకు వేళ్లు తిరుగుతాయి. ఇప్పటికి ఇంకా స్పష్టపడని వాళ్ళు ఇకనైనా తెలుసుకోవలసిన అవసరముంది. ఎందుకంటే ప్రపంచం ముందు తలవంపులు అందరికీ వర్తిస్తాయి. మహమ్మదు ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది మామూలు వ్యక్తులు కాదు. ఒక దేశానికి నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీ అధికార ప్రతినిధులు. అందుకనే ఇస్లామిక్ దేశాలు ప్రతిస్పందిస్తున్నాయి.
మనం అప్పుడే వాళ్ళ చేతులకు తాళాలెయ్యాల్సి ఉండె. గుజరాత్లో మైనార్టీలపై రాక్షసదాడులు చేసి వేలాదిమందిని హతమార్చిననాడు, మహాత్ముని బొమ్మలపై తూటాపేల్చి ఆనందించిననాడు, గాడ్సేను దేశభక్తుడని పొగిడిన నాడు, గొడ్డుమాంసం పేరుతో అఖ్లాక్ను కొట్టి చంపిన నాడైనా, గుజరాత్ మోడల్‌తో ఢిల్లీలో మత ఘర్షణల హత్యాకాండనాడైనా విద్వేషపు దుష్టత్వానికి చెక్‌పెట్టి ఉండాల్సింది. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోకుండా మనం మానవీయంగా మనుగడ సాగించలేమనే విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇదొక ఉన్మాదస్థాయికి చేరుకో బోతున్నది. అందుకు నిలువెత్తు సాక్ష్యాలు నుపూర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యానాలు. ఇవ్వేదో దొర్లిన మాటలు కాదు. మెదళ్లలో పేరుకొన్నవే. పరమత విద్వేషం ఈ ఇద్దరికి సంబంధించినదేనా! వీరికి ఆ వొరవడినద్దిన ఆరెస్సెస్ పాఠశాలవి కావా? ఆ పాఠశాలలోనే నాటి వాజ్‌పేయి నుండి నేటి మోడీ వరకు చదువుకుని, నేర్చుకుని ఎదిగినవారు కాదా? నేటి పాలకులంతా ఆ వరవడిలో ఎదిగినవారే! క్షమాపణలు చెప్పి, మాటలను వెనక్కు తీసుకున్నా బహిష్కరణ వేటు పడినా, నుపూర్ శర్మ చెబుతున్నదేమిటి? నాకు ప్రధాని, హౌంమంత్రి, పార్టీ ఛీప్ నడ్డా ప్రముఖులతో సంభాషణలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించింది కదా!
తమ దేశంలో యూదుల హననానికి పాల్పడి, జర్మన్జాతి దురహంకారంతో ప్రపంచంపైబడిన హిట్లర్ వీరికి ఆదర్శనీయుడు. కానీ ప్రపంచం అతన్ని కుక్కచావు చచ్చేలా చేసింది. ఎందుకంటే అధికారం కోసం జాతిదురహంకారం తోడ్పడుతుందేమో కానీ, పెట్టుబడి, దాని చలనానికి హద్దులు గీస్తే బద్ధలు కొడుతుంది. సరుకుల విస్తరణకు, లాభాలకు, జాతుల గిరిగీతలను పెట్టుబడి సహించబోదు. అయితే ఏకపక్ష దోపిడీకి ఆయా దేశాల్లో నియంతృత్వ, ఫాసిస్టు శక్తులకు అది కాపుకాస్తుంది. అందుకేమరి ఇస్లామిక్ దేశాలలో కొన్ని అదానీ, అంబానీ సరుకులను ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారని తెలవగానే తీవ్రంగా బెంబేలెత్తి పోయారు. వ్యాపార లావాదేవీలకు దెబ్బ తగులుతుందని తల్లడిల్లి నష్టనివారణ చర్యకు పూనుకున్నారు. వారు ఏ ఉద్దేశాలతో చేసినా భారతదేశ ప్రజాస్వామిక, లౌకిక సంప్రదాయానికి విఘాతం కలిగించే వారి చర్య గర్హనీయమైనది. చాలా ఆలస్యంగా ప్రభుత్వం స్పందించింది. అప్పటికే అరబిక్ దేశాలు, 56 దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, భారతదేశంలోని పాలక పార్టీని నిలదీసాయి. ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులను పిలిచి వివరణ కోరాయి. ఉప రాష్ట్రపతి తన ప్రెస్‌మీట్‌ను చివరికి అధికారయుత విందును కూడ రద్దుచేసుకోవాల్సి వచ్చిందంటే మన ''దౌత్య దౌర్భాగ్యం'' అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆరెస్సెస్ భావజాలపు ప్రతిబింబమైన బీజేపీ విధానం వలన భారతదేశం ఇంతటి ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఇది వారిలో చక్కబడే విధానం కాదు. మనం ప్రక్కన పెట్టాల్సిన విధానం. మన రాష్ట్రంలోని ఆపార్టీ నేత కూడా మసీదులు తవ్వాలని పిలుపునిచ్చాడు. వారి శాసనసభ్యుడైతే మా ధర్మాన్ని నిలబెట్టటం కోసం ఎవరినైనా చంపుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. వీరిపై రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా! రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ నిర్బంధ కాండను ప్రశ్నించిన రిహానా, గ్రేటాథన్బర్గ్లను, ఇది మా దేశ అంతర్గత విషయమని పెద్ద ఫోజులిచ్చిన భారతరత్న సచిన్, సునీల్ శెట్టి, అక్షయ కుమార్, కంగనా రనౌత్‌లు ఇప్పుడు మాట్లాడరేమి?
ప్రపంచ వ్యాపితంగా ఇంత చర్చకు కారణమైన, దేశం క్షమాపణలు చెప్పాల్సి వచ్చిన కారకులను కేవలం పార్టీ నుండి బహిష్కరించి ఊరుకున్నారు. వాళ్లకు తెలుసు, తాము ఆర్నెళ్ళలో తిరిగి పార్టీలోకి వస్తామని, కానీ చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రధాని నోరువిప్పాలి. దేశంలో జరుగుతున్న ఏ విద్వేషపు ఘటనలకు, మాటలకు ఆయన స్పందించటం లేదు. రాజ్యాంగం ఆధారంగా గద్దెనెక్కిన ప్రభు త్వాలు, ఆ విలువలను కాపాడకుంటే ఇలా తలవంపులకు గురవుతూనే ఉంటాం.