Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆకలి మంటలు ఒకచోట.. అన్నపు రాసులు మరో చోట...' పేదలకు ఆహార పంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. 'అమ్మా పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు...' అన్నట్టుంది బియ్యం సేకరణలో అది అనుసరిస్తున్న తీరు. తాజాగా 'నేను చెప్పినట్టు చెయ్యకపోతే బియ్యం సేకరణ ఆపేస్తాం...' అంటూ అది రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశమైంది. కాకపోతే తనకు తానుగా ఆ నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) భుజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ సర్కారును కాల్చేందుకు మోడీ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది.. చేసింది. తద్వారా ధాన్యం, బియ్యం సేకరణ, పంపిణీ బాధ్యతల నుంచి అది క్రమక్రమంగా తప్పుకోజూస్తున్నది.
ఇందుకు సంబంధించి కేంద్రం చెబుతున్న కారణాల్లో ఒకటి.. రాష్ట్రంలో రెండు నెలలుగా బియ్యం పంపిణీ జరగటం లేదు. రెండోది.. మిల్లుల్లో పెద్దగా ధాన్యం నిల్వల్లేవు, కొన్నిచోట్ల ఉన్నా అవి లెక్కించేందుకు అనువుగా లేవు. మూడోది.. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవటం లేదు. మోడీ సర్కార్ ఎఫ్సీఐ ద్వారా చెప్పించిన ఈ మూడు కారణాలను... కారణాలు అనటం కంటే సాకులు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే లోపాలున్నప్పుడు వాటిని సరి చేయాలి తప్ప అవి ఉన్నాయనే కారణంతో అసలు వ్యవస్థనే దెబ్బతీయజూడటం సరికాదు.. సహేతుకం అంతకంటే కాదు. ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయిని చేయాల్సి వస్తే.. అంతకంటే పెద్ద ముద్దాయి కేంద్రమే అవుతుంది. 'రెండు నెలల నుంచి బియ్యం పంపిణీ రాష్ట్రంలో జరగటం లేదు...' అని చెప్పటం ద్వారా ఇక్కడి సర్కారును ఇరకాటంలో పెట్టినప్పుడు... కరోనా కాలంలో జనం అరిగోస పడుతున్న సమయంలో కూడా గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను కేంద్రం ఎందుకు పంచలేదు...? అనేది కూడా చర్చకు రావాలి. దానికి ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. నియమ నిబంధనల ప్రకారం విపత్తులు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు వీలుగా కనీసంలో కనీసంగా రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను గోదాముల్లో నిల్వ ఉంచాలి. ఇప్పుడు దేశంలోని గోడౌన్లలన్నింటిలో కలిపి అంతకు మూడు రెట్లకు పైగా (ఏడు కోట్ల టన్నులు) నిల్వలున్నాయి. వాటన్నింటినీ ఎలుకలు, పంది కొక్కులు తిన్నా ఫర్లేదు.. మేం మాత్రం వాటిని బయటకు తీయం... పేదలకు పంచబోమనే రీతిలో కేంద్రం వ్యవహరించిందంటే వారి పట్ల దాని చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో బియ్యం పంపిణీలో లోపాలున్నాయనే కారణంతో అసలు సేకరణనే ఆపేస్తామనటమనేది 'ఇంట్లో ఎలుకలున్నాయనే కారణంతో ఆ ఇంటినే తగలబెట్టటం...' అవుతుంది.
మరోవైపు ధాన్యం, బియ్యం సేకరణ, బియ్యం పంపిణీ అనే వాటిని కేంద్రం కేవలం ప్రభుత్వాల వ్యవహారాలుగానే చూస్తే అంతకుమించిన పొరపాటు ఇంకోటి ఉండదు. ఇది ఫక్తు రైతులు, రేషన్ వినియోగదారులైన పేదలు, సామాన్యులకు సంబంధించిన అంశం. ఇప్పటికే ధాన్యం, బియ్యం సేకరణకు సంబంధించి అనేక కొర్రీలేస్తున్న కేంద్రం... దానికి క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తున్నది. ఇది రైతాంగానికి తీవ్ర నష్టం.. దేశానికి పెను ప్రమాదం. ఎఫ్సీఐ ఒకవేళ సేకరణ చేయకపోతే రైతులకు కనీస మద్దతు ధరలు లభించవు. అప్పుడు వారు ప్రయివేటు వ్యాపారులకు, మధ్య దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అదే జరిగితే చాలా తక్కువ ధరకే ధాన్యాన్ని తెగనమ్మాలి. ఇప్పుడు మార్కెట్లో క్వింటాల్ ధాన్యానికి రూ.1,960 ధర ఉంది. ఇది రైతుకు లాభదాయకం. అదే ప్రయివేటు వారికి అమ్మాల్సి వస్తే రూ.1,600 లేదా రూ.1,500తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రజలందరికీ ఆహార భద్రత అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికే ఈ సమస్య ఉత్తర భారతంలో కొనసాగు తున్నది. ఇప్పుడు కేంద్రం చర్యల వల్ల అది దక్షిణాదిన కూడా తలెత్తే అవకాశముంది. వాస్తవానికి దేశంలో ఆకలి చావుల్లేకుండా ఉన్నాయంటే దానికి కారణం పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థే కారణం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంపకుండా అడ్డుపడటం, కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణను ఆపేస్తామన్న కేంద్రానికి ఆస్కారమివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా లోపా లన్నింటినీ సరిచేసుకోవాలి. తద్వారా కేంద్రానికి సరైన నివేదికనివ్వాలి. అదే విధంగా మసీదులు, గుళ్లు, గోపురాల గురించి సొల్లు పురాణాలు వల్లె వేస్తున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి... బియ్యం సేకరణ ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.