Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ ప్రపంచంలోనే తనకు ఎదురులేదని విర్రవీగుతున్న అమెరికాకు తన పెరటి తోట అనుకున్న చోటే ఎదురు దెబ్బ తగిలింది. జూన్ ఆరు నుంచి పదవ తేదీ వరకు లాస్ ఏంజల్స్ నగరంలో జరుగుతున్న అమెరికా దేశాల సంస్థ తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడర్ చేసిన ప్రకటన అమెరికాకు చెంపదెబ్బ. క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వ దేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా చర్యకు నిరసనగా తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు లోపెజ్ ప్రకటించాడు. అదే వైఖరితో తాము కూడా మెక్సికో బాటనే అనుసరిస్తున్నట్లు అర్జెంటీనా, బొలీవియా, హొండురాస్ తదితర దేశాలు కూడా ప్రకటించటం అమెరికా ఆధిపత్యం చెల్లదని చెప్పటమే. ఇది ఒక్క లాటిన్ అమెరికాలోనే కాదు, అమెరికా పలుకుబడి బండారం ఏమిటో ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. అమెరికా అంటే ''మీ ఇంటి కొస్తే మాకేం పెడతారు - మా ఇంటి కొస్తే మాకేం తెస్తారు'' అన్నట్లుగా దాని ప్రయోజనాలను అది చూసుకొంటుంది.
ఈ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడిస్తున్నది. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా లాటిన్ అమెరికాలో, ప్రపంచంలో నియంతలు, సరహంతకులు, మాదకద్రవ్యాల సరఫరా చేసేవారితో సహా అన్ని రకాల అవాంఛనీయ శక్తులను బలపరిచిన, మద్దతు ఇస్తున్న చరిత్ర కలిగి ఉంది. తనకు నచ్చని భావజాలం, రాజకీయవైఖరులు కలిగిన పాలకులకు ఏదో ఒక ముద్రవేయటం, రంగుల విప్లవాల పేరుతో కూలదోస్తున్న తీరు తెన్నులు, ఆర్ధిక ఆంక్షలు, దిగ్భంధనాల దారుణాలు ఎవరికి తెలియనివి! లాటిన్ అమెరికాలో గత రెండు దశాబ్దాలుగా ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. ట్రంప్ మాదిరి బైడెన్ నోరుపారవేసుకోకపోయినా సేమ్ టు సేమ్ అదేబాటలో నడుస్తున్నాడు.
మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్ 19ని సాకుగా చూపారు. అమెరికా అర్థగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదు అని దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు నాటకీయంగా క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.
లాటిన్ అమెరికా పరిణామాలు అమెరికాకు మింగుడుపడటం లేదు, వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. ఇప్పటికీ గతంలో మాదిరి కుట్రలు జరుపుతూనే ఉంది. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్య. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినప్పుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని దేశాలను మినహాయిస్తే మరికొన్ని దేశాల నేతలు ఆ సమావేశాన్ని బహిష్కరిస్తారని బైడెన్ యంత్రాంగానికి ముందే తెలిసినా అదే వైఖరితో ముందుకు పోవటం పట్ల దాని చిత్తశుద్దినే ప్రశ్నించాల్సి వస్తోంది. లాటిన్ అమెరికా దేశాలు అమెరికాతో సంప్రదింపులు, చర్చలను కోరుతున్నాయి తప్ప దాని ఆదేశాలు, మార్గదర్శనం కోసం ఎదురు చూడటం లేదన్నది నేటి నిజం!