Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్'' అన్నారు మహాకవి గురజాడ. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. గడిచిన ఎనిమిదేండ్లలో సుపరిపాలన అందించామని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నామని, 'బయో-ఎకానమీ' 8 రెట్లు వృద్ధి చెందని స్వయంగా ప్రధానే అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయచేస్తున్నారు. ఏలినవారివి అసత్యాలే అని కుండబద్దలు కొట్టి మరి చెప్పాయి పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు. ఒక్క ఆకలి విషయంలోనే కాదు. ప్రజాస్వామ్యం, లింగసమానత్వం, మానవాభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్యం వంటి పలు అంశాల్లో మన దేశం నేల చూపులే తప్ప తలెత్తుకునే పరిస్థితి లేదని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. ఇలా.. ఏ రంగం వైపు చూసినా 'ఏమున్నది గర్వ కారణం' అన్నట్టుగానే పరిస్థితులున్నాయి.
75ఏండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా ఈ దేశంలో ఆకలే రాజ్యమేలుతుంటే.. ఇన్నేండ్లుగా మన దేశాధినేతలేం చేస్తున్నట్టు..!? ఎందరు ప్రధానులొచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరిదీ పేదరికంపై యుద్ధమే..! పేదరిక నిర్మూలనకే అన్ని పథకాలు. బడ్జెట్లో వేలకోట్లు కేటాయింపులు... పథకాలు అమలవుతూనే ఉంటాయి, వేల కోట్లు ఖర్చవుతూనే ఉంటాయి. అయినా అదేం విచిత్రమోగానీ ఇవేవి పేదరికాన్ని నిర్మూలించలేదు సరికదా ''ఆకలి సూచి''ని మాత్రం మరింత పెంచుతున్నాయి! గత ప్రధానుల కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం 55గా ఉంది. 2021నాటికి దానిని 101వ స్థానానికి తీసుకువెళ్లి ''ఆకలి'' అభివృద్ధిలో మన దేశాన్ని ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలబెట్టారు మోడీజీ.
ఏ దేశ సుస్థిరాభివృద్ధికైనా ప్రజల ఆరోగ్యమే గీటురాయి. ప్రజల ఆకలి సమస్యను పరిష్కరించడమే సుస్థిరాభివృద్ధి అవుతుంది కానీ, ఎత్తైన విగ్రహాలు పెట్టడంలోనో, ఉన్న భవనాలను కూల్చి విలాసవంతమైన భవంతులు కట్టడంలోనో ఉండదు. మనిషి అంతరిక్షానికి ప్రయాణిస్తున్న కాలంలో కూడా ఇంకా ''ఆకలి'' అనేది తీరని సమస్యగానే ఉండటం ఎంత విషాదం..!? ''ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్..'' అన్న ప్రశ్న ఇప్పుడు గురజాడదే కాదు... తిండికి మలమలలాడుతున్న కోట్లాది భారతీయులది. దీనికెవరు సమాధానం చెప్పాలి?
ప్రస్తుత పాలకుల ఆచరణ రాజ్యాంగ ఆదర్శాలకు భిన్నంగా ఉందని మన అనుభవం తెలుపుతోంది. మోడీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో, దైనందిక అవసరాలు తీర్చడంలో విఫలమైందని ప్రజల సామాజికార్థిక స్థితిని చూస్తే విధితమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి పెట్టుబడి సేవలో, సామ్రాజ్యవాద సేవలో తరించి పోతున్నారు ఏలికలు. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి మానవాభివృద్ధి కాదు, అది సంపన్నుల అభివృద్ధి అని పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజల రాజ్యం కాదు, పెద్దల రాజ్యమని చెప్పడానికి ఇంతంటేే రుజువులేమి కావాలి. అన్ని అంశాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌ల కంటే భారత్ వెనుకబడి ఉందని పలు నివేదికలు ఘోషిస్తుంటే అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పడం మోడీజీకే చెల్లుతుంది!
పేదరిక నిర్మూలనే తమ ప్రధాన ఎజెండా అంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ... పేదరికం, పౌష్టికాహారలోపం, నిరక్షరాస్యత తన ముందున్న అతిపెద్ద సవాళ్లనీ, వీటి నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడమే తన ధ్యేయమనీ కూడా చెప్పింది. కానీ గడచిన ఎనిమిదేండ్లలో ప్రపంచ ఆకలి సూచీ, విదేశాలకు వెళ్లివారి సంఖ్యను తెలిపే పాస్‌పోర్ట్ సూచీ, ప్రపంచ సంతోష సూచీ, ప్రజాస్వామ్య సూచీ, లింగభేద సూచీల్లో భారత్ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. దీనిపై సోషల్ మీడియాలో వరల్డ్ రిపోర్ట్ కార్డ్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే 'భారత్ ఎంతో మెరుగైందంటూ సోషల్ మీడియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఈ ర్యాంకింగ్‌కి ఏలాంటి విశ్వసనీయత లేదని వీటిని నిలిపివేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు గతంలోనే పేర్కొన్నది. ఇలాంటి విలువ లేని రిపోర్ట్‌లను తమ గొప్పలంటూ గోబెల్స్ పచారాన్ని మోడీ సర్కారు చేసుకుంటున్నది. అదే విశ్వసనీయతున్న సూచీల నివేదికలను మాత్రం తప్పుడు నివేదికలని, అశాస్త్రీయమని కొట్టిపారేస్తోంది. వాస్తవాలను అంగీకరించలేక, నిజాలను కప్పిపుచ్చడానికి కమలనాథులకు ఉన్న ఏకైక అస్త్రం ఎదురుదాడే. ఇప్పటి వరకు దేశానికి, దేశనాయకులకే పరిమితమైన ఈ ఎదురుదాడి.. ఇప్పుడు సరిహద్దులు చెరుపుకొని అంతర్జాతీయ సంస్థలపైకి కూడా దిగుతోంది. అందుకు ప్రధాని మొదలుకొని వారి అనుంగులందరూ నాలుకలకు కత్తులు కట్టుకొని మరి కూర్చుకున్నారు. అయితే ప్రజలేమి అమాయకులు కారు... అన్ని గమనిస్తూనే ఉంటారు.