Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని ప్రదేశాల పేర్లు పోరుకు సంకేతాలవుతాయి. జరిగిన, జరుగుతున్న ఆకృత్యాలకు, అఘాయిత్యాలకు సాక్ష్యాలుగానూ నిలుస్తాయి. ఆ స్థలం పేరు వినగానే కొందరికి చైతన్య పెల్లుబుకుతుంది. మరికొందరికి వణుకు పుడుతుంది. అధికార బలనిరూపణకు వేదికవుతుంది. యుద్ధాలన్నీ భూమికోసమే కదా! ఆనాటి మహాభారత గాథలోనయినా, వీరతెలంగాణ విప్లవ పోరాటమయినా, ముదిగొండ పోరాట రక్తపుధారలోనయినా భూమే ప్రధాన జెండా, ఎజెండా. అయితే ఆనాడు ఐదు ఊళ్లుకావొచ్చు, తరువాత పంట పొలం, ఇప్పుడు యాభైగజాలనేల. అక్కడిప్పుడు మంటలు ఎగిసిపడుతున్నాయి. బుల్డోజర్లు ఉరుకులు పెడుతున్నాయి. క్రూరమైన సైనికులు ఇనుప బూట్ల చప్పుళ్ళు పరేడ్ చేస్తున్నాయి. రియల్ఎస్టేట్ డేగల కళ్ళు కంచెలు నిర్మిస్తున్నవి. అయినా ప్రాణాలకు భయపడక వీరోచిత సమరానికి సన్నద్ధమైన సామాన్యులకు చేతులెత్తి మొక్కుతున్నది జక్కలొద్ది. ఇప్పుడు 'జక్కలొద్ది' సామాన్యుల హక్కుల కోసం నినదిస్తున్న యుద్ధక్షేత్రం.
అది ఎక్కడయినా సరే సామాన్యుడు నిన్ను నిలదీస్తున్నాడంటే, ప్రశ్నను లేవనెత్తుతున్నాడంటే బుల్డోజర్లు ముందుకు తెస్తారు. ఈ బుల్డోజింగ్ సంస్కృతికి రాజకీయాలు ఎందుకు పాల్పడుతున్నాయీ అంటే సరయిన సమాధానాలు, ప్రజాస్వామిక విధానాలూ లేకపోవడమే కారణం. వాళ్లేమడిగారు! మణులడిగారా! మాన్యాలడిగారా! అక్షరాలా నువ్విచ్చిన వాగ్దానం మాత్రమే కదా! ఎనిమిదేండ్లు దాటిపోయింది. డబుల్ బెడ్రూములని ఊరిస్తుంటివి. ఖాళీస్థలం, ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకున్నాం. పట్టాలియ్యమన్నారు. అంతేగా... కట్టివ్వమనీ అడగలేదు. ఎనిమిదివేల మంది ఇండ్లులేని పేదలే. నెల రోజులుగా అక్కడే బతుకులీడుస్తున్నారు. రాత్రికి రాత్రే వందల మంది బెటాలియన్లు, గుడిసెలను తగలేసి, బుల్డోజింగ్కు పాల్పడతారా! ఆడా, మగా, పిల్లలూ, ముసలి వాళ్ళూ అనే విచక్షణలేకుండా హింసకు పూనుకుంటారా! ఇదెక్కడి రాక్షసకృత్యం! ఇదెక్కడి స్నేహపూరిత పోలీసు విధానం! ఇదికాక ప్రయివేటు గూండాలనూ దాడులకు ఉపయోగిస్తున్నారని తెలిసి మరింత గుగుర్బాటుకు గురవుతాము. వందలాది మందిని నిర్భంధించి భయభ్రాంతులకు గురిచేయటం ప్రజా ప్రభుత్వాలకు తగనిపని. పరామర్శించే నాయకుల, కార్యకర్తలపై కూడా అక్రమ నిర్బంధాలకు పూనుకోవటం, అరెస్టులకు పాల్పడటం గర్హనీయం. ఇలాంటి చర్యలు ప్రభుత్వాలకు తీవ్ర వ్యతిరేకతను మూటకడతాయి. పతనాలకు దారితీస్తాయి. వాళ్ళడిగినప్పుడు నేనియ్యడమేమిటనే అహంలోంచి అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. ఏదైనా చేస్తే నేనే చెయ్యాలనే విధానం ప్రజాస్వామిక లక్షణం కాదు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వ్యవహరించిన వారే నాయకులుగా ఎదుగుతారు. ప్రజా సమ్మతిని పొందుతారు. భారతంలో ఐదూళ్లడిగినప్పుడు ఇచ్చేస్తే కురుక్షేత్ర యుద్ధమే వచ్చేది కాదు. కౌరవ నాశనం జరిగేదీ కాదు. బోధకులు, చదువరులకు తెలియని విషయం కాదది. అయితే భూమికోసం, గూడుకోసం పోరాటం చేయటం, దాడులను నిర్బంధాలను ఎదుర్కొవటం ఎర్రజెండాలకు కొత్తేమీకాదు. వాటికి ఎదురునిలబడి పోరాటాన్ని రాజెయ్యటం, ప్రజల పక్షాన నిలబడటంలో వాళ్ళెప్పుడూ ముందే ఉంటారు. భూమిని, జాగను రాజకీయ ఎజెండాలోకి తెచ్చింది కూడా వాళ్ళే.
ఇకపోతే ప్రభుత్వ భూములు ప్రయివేటు రియల్ఎస్టేట్ కబంధ హస్తాలలోకి పోతున్న, పోయిన దాని పర్యవసానంగా జరుగుతున్న సంఘటనలు ఇంత ఘోరంగా ఉంటున్నాయి. కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలలో నేల విలవిల్లాడుతోంది. పేదలకు కావాల్సిన నీడకు మాత్రం కరువు తాండవిస్తోంది. ప్రయివేటు కంపెనీలకు, సంస్థలకు వేలాది ఎకరాలు కేటాయిస్తారు. స్వాములకు, బాబాలకు ఇవ్వటానికి భూములు సమృద్ధిగా దొరుకుతాయి. కానీ నిరుపేద గుడిశలను నిర్మూలించేందుకు బుల్డోజర్లు వీరంగం వేస్తాయి.
పోలీసుల ప్రవర్తనలు కూడా ఏమీ మారలేదు. బలహీనులపై బలప్రయోగానికి తెగబడటం బీభత్సాన్ని సృష్టించడం అదే పనిగా జరుగుతూనే ఉన్నది. అంతకు ముందు పోడు భూముల పోరాటంలో గిరిజన, ఆదివాసీ మహిళలపై నిర్భంధానికి పూనుకుని, పసిపిల్లలను, తల్లులకు దూరం చేసి జైళ్లల్లో తోసేసారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పబ్, మైనర్ బాలిక లైంగికదాడి కేసులో సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి యువజనులపైకి జాగిలాలను విడిచి ఉసిగొల్పటం పోలీసుల ఆటవిక లక్షణాన్ని బయటపెడుతున్నది. జక్కలొద్దిలో పోరాట పటిమను కనబరుస్తున్న మహిళలను బెదిరింపులకు గురిచేస్తూ దాడులకు దిగడం దారుణం. ఎన్ని ఆటంకాలు కల్పించినా, చేతులు విరిగినా, తలలు పగిలినా, రక్తాలు కారినా గుడిసెల కోసం పోరాటం ఆపేదిలేదని చెబుతున్న వారి సాహసం, ధైర్యం స్ఫూర్తిదాయకం. అందుకే 'జక్కలొద్ది' ఇప్పుడు వీరగడ్డ. పోరాటస్థలి. చైతన్యం నింపుకున్న నేల...