Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో బుల్డోజర్ రాజకీయాలు ఇప్పుడు కనీ వినని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ల వాచాలతతో ప్రపంచదేశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దేశానికి వచ్చినా వారి విద్వేషాగ్ని ఇంకా చల్లరడంలేదు. శుక్రవారం నిరసన తెలిపిన వారిని హెచ్చరిస్తూ యూపీ సీఎం మీడియా సలహాదారు మృంత్యుంజరు కుమార్ ''గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది'' అని ట్విట్టర్ వేదికగా నిరసనకారులకు 'బుల్డోజర్ వార్నింగ్'ను పంపారు. అగ్నికి ఆజ్యం పోసేలా హర్యానా బీజేపీ ఐటీ సెల్ బాధ్యులు అరుణ్ యాదవ్ ''ఇప్పుడు శుక్రవారం స్టోన్-డే. శనివారంను 'బుల్డోజర్ డే'గా ప్రకటించాలి'' అని ఆ ట్వీట్ చేశాడు. అంతే కాదు నిరసన తెలిపిన జావేద్ మహమ్మద్, అఫ్రిన్ ఫాతిమా ఇండ్లపై బుల్డోజర్లనే ప్రయోగించారు. విద్వేషాన్ని రగిల్చిన నేతలపైకి లేవని లాఠీలు... ఆ వ్యాఖ్యలపై నిరసనలు తెలిపిన వారిపై మాత్రం విరుచుకుపడుతున్నాయి. బుల్డోజర్లు శిక్షలను అమలు చేస్తుంటే, న్యాయస్థానాలు నోరెళ్లపెడుతున్నాయి. పాలకులే స్వయంగా చట్టాలను పక్కన పెట్టి శిక్షలు అమలుచేస్తూన్నారు. డెబ్భయి ఐదేండ్ల స్వాతంత్య్రం సాక్షిగా రాజ్యాంగాన్నే బుల్డోజ్ చేయడం నేటి విషాదం.
గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో భారత్‌కున్న సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. గల్ఫ్‌లో 90లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారు 'ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు' అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రకటన చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్ శర్మ కానీ, నవీన్‌కుమార్ జిందాల్ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
రెచ్చగొట్టడం... చిచ్చుపెట్టడం... ఓట్లుపట్టడం... అంతిమంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం... తద్వారా దేశాన్ని మత రాజ్యంగా మార్చడం. దానిని అడ్డం పెట్టుకొని పాలించడం, దోపిడీ చేయడమే కమలనాథుల లక్ష్యం. అందుకోసం మరుగునపడిన సమస్యలను వారే పైకి తీసుకువస్తారు. లేకుంటే సమస్యలను వారే సృష్టిస్తారు. ప్రజల మౌలిక సమస్యలేవీ సామాజిక, రాజకీయ కార్యక్షేత్రంలోకి రాకుండా ఉండేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. దేశ ప్రజలలో విభజన తీసుకొచ్చి, వారిని రెండు శత్రు శిబిరాలుగా మార్చే భావోద్వేగాలపై కేంద్రీకరించి రాజకీయం నడుపుతారు. అందుకు ప్రధాని మొదలు వారి పరివారమంతా విద్వేషాన్ని నిత్యం రగిలిస్తూనే ఉంటారు. అందుకు తాజా ఉదాహరణలే మన ముందు జరుగుతున్న ఘటనలు.
నిజానికి ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పరిపాటిగా మారిపోయింది. ఆర్టికల్ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది.
మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయమై కూర్చుంది. ప్రతి విషయాన్నీ మత కోణంలో చూడడం పెరిగిపోయింది. ఆకలి, నిరుద్యోగం, అప్పులు, అధిక ధరలు, ప్రజా ఆస్తులు ఆమ్మకం వంటివేవి చర్చనీయాంశాలు కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. ఈ బుల్డోజర్ రాజకీయాలను ఖండించాల్సిన అవసరాన్ని ఈ దేశ ప్రతిపక్షపార్టీలు గుర్తించాలి. రాజ్యాంగం ప్రజలకిచ్చిన ప్రశ్నించే హక్కును, నిరసన తెలిపే హక్కును హరించే దుర్మార్గామైన పాలన గురించి ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయ శక్తులు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు కూడా మెల్కొనకపోతే ఇంతకంటే దారుణమైన, దౌర్జన్యకరమైన పాలనను మనం చూడాల్సి వస్తుంది.