Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీనేలే మారాజులు 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తే... హైదరాబాద్లో ఉన్న దొరవారు ఆ చట్టాన్ని నేనసలు పట్టించుకోను పొమ్మంటూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల కింద ఇండ్లు, భూములు, పశు సంపద, ఇతర ఆస్తులు కోల్పోయిన వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరిది. తాజాగా సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులపై ప్రభుత్వ దాష్టీకంతో మరోసారి అలాంటి సమస్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తమకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా ప్రాజెక్టుపై సర్కారు ఎలా ముందుకెళుతుందంటూ ప్రశ్నించిన నిర్వాసితులపై సర్కారు ఉక్కుపాదం మోపింది. బాధితుల ఇండ్లకు విద్యుత్ సరఫరాను కట్ చేసి మరీ దాడికి దిగడం ద్వారా తమకు ఎదురు తిరిగితే బతుకులను అంధకారంలోకి నెడతామంటూ హూంకరించారు. యువకుల తలలను పగలగొట్టిన పోలీసులు... మహిళలకు భద్రత భరోసా అనే పెద్ద మనుషుల వాక్కులను పక్కనబెట్టి.. ఆడవారిని ఇండ్లలోంచి ఈడ్చుకొచ్చారు. ఇది గౌరవెల్లి నిర్వాసితుల దీనగాథ.
ఈ అంశాన్ని కేవలం గౌరవెల్లికే పరిమితం చేసి చూస్తే... అసలు విషయాలు పక్కకు పోతాయి. ఇక్కడ నిర్వాసితులైన బాధితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలి. కానీ ఈ ఒక్క చోటే కాదు... తెలంగాణలోని మరే ప్రాజెక్టు, రిజర్వాయర్లలో కూడా నిర్వాసితులకు ఈ చట్టాన్ని వర్తింపజేయటం లేదు. దాని గురించి అడిగితే... 'అంతకంటే మంచి ప్యాకేజీనే మేం ఇస్తాం...' అంటూ మన ప్రభుత్వాధినేత బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక్కడ గమ్మత్తేమిమంటే 2013లో భూ సేకరణ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఇదే అధినేత అప్పుడు ఎంపీగా ఉండి... దానికి ఓటేశారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి అడ్డంగా వాదిస్తున్నారు. అది మల్లన్న సాగర్ అయినా గౌరవెల్లి, నెట్టెంపాడు, పాలమూరు- రంగారెడ్డి అయినా, మరేదైనా సరే... సర్కారు వారికి ప్రాజెక్టులూ, కమీషన్ల మీదున్న శ్రద్ధ, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం మీద ఉండటం లేదు. మొదట్లో ప్రజలు పనులకు అడ్డు పడతారు కాబట్టి... ఎంతో కొంత మందికి తమకు నచ్చిన పరిహారమిచ్చి దులిపేసుకోవటం పాలకులకు ఆనవాయితీగా మారింది. ఆ తర్వాత మిగిలిన బాధితులకు రిక్తహస్తమే ఎదురవుతున్నది. అంటే చట్టబద్ధంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నీ, దక్కాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం కాలరాస్తున్నదన్నమాట.
మరోవైపు పరిహారమిచ్చేప్పుడు కూడా మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకోకపోవటం విస్తుగొలిపే అంశం. చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో ఎకరాకు రూ. నాలుగు లక్షల 15 వేలు పరిహారంగా ఇచ్చిన అధికారులు... ఆ రకంగా 3,500 ఎకరాలు సేకరించారు. కానీ అక్కడ మార్కెట్ ధర చూస్తే ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంది. ఈ నేపథ్యంలో నివాసాలు కోల్పోయిన బాధితులు కొంచెం బాగున్న చోట స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకోవాలంటే కనీసం జాగా కూడా రాని పరిస్థితి. అంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు, ప్రాంతాలు సుభిక్షంగా ఉండటం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసే పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులను పట్టించుకోని వైనం ఇక్కడ మనకు కనబడుతున్నది. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించే ప్రభుత్వానికి వీరికి సరైన పరిహారమివ్వటమనేది పెద్ద లేక్కే కాదు. కాకపోతే ఇవ్వాలన్న చిత్తశుద్దే లేదు. 'వారు మనల్ని ఏం చేస్తారులే...' అనే ధీమా ఈ తల పొగరుకు కారణం.
వాస్తవానికి 2013 భూ సేకరణ చట్టమనేది ఇప్పుడున్న చట్టాల్లోకెల్లా నిర్వాసితులకు కొంతలో కొంత మెరుగైన పరిహారాన్ని ఇచ్చేదిగా ఉందంటూ రైతు నేతలు చెబుతున్నారు. కొన్ని లోపాలు, లొసుగులు ఉన్నప్పటికీ అది ప్రయోజన కారేనన్నది వారి అభిప్రాయం. కానీ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కార్ గతంలో రకరకాల కుయుక్తులు పన్నింది.. కుప్పి గంతులేసింది. ఆఖరికి ఆర్డినెన్సును కూడా తెచ్చింది. కానీ తన పప్పులుడక్క పోవటంతో దానిపై రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. తద్వారా తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంది. దీన్ని సాకుగా తీసుకున్న రాష్ట్రాలు... తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపట్ల అనుసరిస్తున్న తీరుకు నిర్వాసితులు మరింత ఐక్యంగా పోరాడాల్సిందే. ఎన్ని ఆటంకాలు, నిర్బంధాలు సృష్టిస్తున్నా గౌరవెల్లి బాధితులు చూపుతున్న పట్టుదలకు, పోరాట పటిమకు జేజేలు పలకాల్సిందే.