Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు ఇరవయ్యేండ్లు. ఆకలి, దారిద్య్రాలనే మంటలను దాటుకుంటూ సైన్యంలో చేరాలనే, ''ఒక్క రోజైనా సరిహద్దులో ద్యూటీ చేసి చచ్చి పోవాల''నే ఆవేశం ప్రజ్వలించిన యువత క్రోధాగ్ని దేశమంతా దావానాలమై మండుతోంది. నేడు అది సికింద్రాబాద్ స్టేషన్లో ఎగిసిపడింది. పోలీసుల లాఠీచార్జీ మరింత విధ్వంసానికి దారితీసింది. ఒక భవిష్యత్ జవాను మన పోలీసుల తూటాకు బలయితే మరొకరు తీవ్ర గాయాలపాలైనారు. మరెందరో క్షతగాత్రులైనారు. జంటనగరాల్లోని మూడు రైల్వే స్టేషన్లు మూసివేశారు. 2019లో పరీక్ష రాసిన ఎందరో అభ్యర్థుల వయసు నేడు 23. అగ్నిపథ్ కనీస వయస్సు 21. నేడు కేంద్ర మంత్రులు ఎన్ని తియ్యని కబుర్లు చెప్పినా ఈ అపభ్రంశపు నిర్ణయాన్ని పరిష్కారం చేయవు.
త్రివిధ దళాలలో సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకం, దేశంలోని అనేక రాష్ట్రాలలోని నిరుద్యోగ యువత గుండెలు రగిలి పోయేలా చేసింది. ఇప్పటికే బీహార్‌లో, యూపీ, ఎంపీ, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ, జార్ఖండ్‌లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ జ్వాల మన తెలంగాణనూ అంటుకున్నది. పోలీసులు వారి దుందుడుకుతనంతో ఇద్దరిని బలి తీసుకున్నారు. కేంద్రం దీనికి బాధ్యత వహించాలి. బాధితులకు న్యాయం చేయాలి.
గత రెండు సంవత్సరాలుగా మెడికల్ టెస్టులు, ఫిజికల్ టెస్టులూ పూర్తి చేసుకుని, సైనిక నియామక పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు యువకులు. ఇప్పటికీ కోచింగ్ సెంటర్లలోనే బతుకులీడుస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కేంద్రం పరీక్షలు నిర్వహించటం లేదు. ఇక ఇప్పుడేమో 'అగ్నిపధ్' అనే కొత్త పథకాన్ని ప్రకటించి సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగులను ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకొమ్మంటున్నది..
ఈ నూతన పథకంలో వున్న విధానమేమంటే పదిహేడున్నర యేండ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేయాలి. నాలుగేండ్లు మాత్రమే సైనిక ఉద్యోగం ఉంటుంది. తర్వాత బ్రతికేందుకు పెన్షన్ కూడా ఉండదు.వెనుతిరిగి ఇంటికి రావటమే. అంటే కాంట్రాక్టు సైనికుడుగా పని చేయాలి. ఇది ఆశావహయువతను త్రీవ కోపానికి గురి చేసింది. వారి ఆశలపై నీళ్ళు చల్లగానే గుండెలో నిప్పులెగిసాయి.
దేశభక్తులమని తమకు తామే కితాబులిచ్చుకునే కేంద్ర పాలకులు దేశ రక్షణకు సంబంధించిన సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపడతారా! దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించటానికి సిద్ధపడి, ఇంటినీ, తల్లిదండ్రుల్నీ వొదిలి వచ్చే వారికి నాలుగేండ్లు ఉపాధి చూపి పొమ్మంటారా! పెన్షను డబ్బును ఆదా చేసుకోవడవ కోసం తెచ్చిన పథకం ఇది. సైనికుల దేశభక్తిని చైతన్య స్ఫూర్తిని నీరుగార్చే విధానమే కాక, వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధబలగాల సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసే చర్య కూడా. దేశం పట్ల నిబద్ధతను, అంకిత భావాన్ని దెబ్బతీస్తుంది. సైనికులుగా పని చేసి తిరిగి సమాజంలోకి వచ్చిన వారి జీవితానికి భద్రతలేని తనం నుంచి సామాజిక అలజడి పెరుగుతుంది. యువతలో సైనిక తత్వం పెరిగి కాఠిన్యత అలవడుతుంది. నాలుగేండ్ల తర్వాత యువత భవితకు భరోసా ఏమిటి? ఎలా జీవనం సాగిస్తారు! అందుకనే మాజీ ఆర్మీ అధికారులు ఇది సరైన పథకం కాదని తెలిపారు. అనేక మంది ప్రముఖులు, ప్రతి పక్షాలు, వామపక్షాలు వెంటనే దీన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
ఈ పథకంలో మరో కోణమూవుంది. సైనికులుగా నియమించిన వారిలోంచి 25 శాతం మందిని కొనసాగిస్తారట. మిగితావారిని వెళ్ళగొడతారు. దేశ సైనిక వ్యవస్థలోకి ప్రయివేటు ఆలోచనా ధోరణిని, వారి భావజాల అనుకూల వర్గాలతో నింపి నియంతృత్వ చర్యలకు పూనుకోవడమూ ఈ ఆలోచనలకు కారణమయి ఉంటుందనే భావనా ఏర్పడుతోంది. ఇది రాజ్యాంగ విలువలకు హాని కలుగజేస్తుంది. ఇక ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ఆశ ఎలాగూ వమ్మయింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటు పరం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఎండమావిలా మారిన ఈ పరిస్థితుల్లో , సైనిక ఉద్యోగాలకూ ఎసరు పెట్టటం, ఆశను చూపెట్టి అధఃపాతాళానికి తొయ్యటం యువత కడుపులో మంటను రగిల్చింది.
దేశమంతా ఇంత అల్లర్లు ఆందోళనలూ ఉధృతమవుతోంటే, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ప్రజల్లోదేశభక్తి, జాతీయ భావన పెంచేందుకు అగ్నిపథ్‌లో పాల్గొంటారని, గొప్ప పథకమని పేర్కొనడం మరింత ఆజ్యం పోస్తుంది. విసుగెత్తిన నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పి రోడ్లెక్కారు. బతుకో చావో అనే స్థితిలోకి వచ్చిన వారు, వాళ్ళంత వారే నిరసన పథం చేపట్టారు. ఎంతో వేదన వారి హృదయాల్లో గూడు కట్టుకుని ఉంది. అందుకే, గుండెల్లో తూపాకీ గుండు దిగినా డిమాండ్ ఆగలేదు. చావుకు రాజ్‌నాథ్ సింగ్ కారణమని నినదించాడు. అట్లాంటి వారితో సంయమనంతో చర్చించి శాంతింప చేయాలి. కానీ రెచ్చకొట్టగూడదు. ప్రజలలో వ్యతరేకతను గమనించి కేంద్రం అగ్నిపథ్‌ను రద్దు చేయాలి. పనికిరాని మతవిద్వేషాలనాపి ఉద్యోగ కల్పనకు పూనుకోవాలి. లేదంటే తిరుగుబాట్లు తప్పవు.