Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తటస్థత నిన్ను పీడకుల పక్షాన్నే నిలుపుతుందని మార్టిన్ లూథర్‌కింగ్ (జూనియర్), నామ్ చోమ్స్కీ వంటి ఎందరో మేధావులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు దేశ ప్రథమ పౌరుని ఎన్నిక వంటి కీలక సందర్భంలో తటస్థత ప్రదర్శించినా, దానికి ఏ సాకు చెప్పినా, టీఆర్ఎస్ను మరీ ముఖ్యంగా కేసీఆర్‌ను నగుబాటుకు గురిచేస్తుంది. నిజానికి చేసింది కూడా. ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసానని చెప్పుకునే వ్యక్తికి ఇటువంటి సూక్తులు తెలియవనుకోలేం. కొన్ని పార్టీలు ఎందుకైనా మంచిదని ''అటువైపు'' కూడా దస్తీ వేసి ఉంచాయని పత్రికల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ కోవలో తమను జమేసుకోకుండా చూసుకోవాలని సారు ఉబలాటం కాబోలు! కాని 'బుల్డోజర్' నైజమేమంటే ఎవర్నీ వారిలాగా వారిని ఉండనియ్యదు. ''ఉంటే నాతో, లేకుంటే ఉగ్రవాదులతో!'' అన్న జూనియర్ బుష్ వారి ఆరాధ్య దైవం.
మన రాజ్యాంగానికి ముప్పిరిగొంటున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక కీలకమైనది. ప్రతిపక్షాల సంఖ్యా బలం అధికార పక్ష మందబలం ముందు పేలవమైంది ఏమీ కాదు. అన్ని ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే శ్రీ వి.వి.గిరి ఎన్నికలాంటి స్థితి పునరావృతం కావచ్చు. ఏది ఎటు జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా ఇంతకాలం రాష్ట్ర పాలకులు చెపుతున్నవి ''ప్రగల్భాలంటే'' నొప్పి కలిగితే, ''డైలాగులు'' కాదని రుజువు చేసుకోవాల్సిన సందర్భం రానేవచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల లోగుట్టు బయల్పడే సందర్భం ఇంతకన్నా ఏముంటుంది. కార్పొరేట్ మీడియా మోడీ నామ సంకీర్తనల హౌరు మధ్య, ఏలినవారి అంతేవానుల లౌడ్‌స్పీకర్ల గోలని మించి అరవగలిగే గొంతులు ఒకదానికొకటి జతకూడాలి. అందుకు రాష్ట్ర అధినేత సిద్ధమైతే అద్భుతాలు జరగవచ్చు.
లిట్మస్ పరీక్షలు వ్యక్తులకీ ఉంటాయి. వ్యక్తులే తిరుగులేని నాయకులుగా విరాజిల్లుతున్న పార్టీల్లో, ఆ వ్యక్తే దైవాంశ సంభూతుడైనచోట సదరు పార్టీలకూ 'లిట్మస్' పరీక్షలుంటాయి. రాష్ట్రావతరణ కాలం నుండి ''కేంద్రంతో కోట్లాడితే పనులు కావ''నే మాట రాష్ట్ర నేతలు చెపుతున్నారు. ప్రదక్షిణలు చేస్తున్నారు. నోట్ల రద్దును రెండు చేతులా ఆహ్వానించారు. జీఎస్టీతో దేశంలో, రాష్ట్రంలో నూతన శకం ఆరంభమవుతుందన్నారు. (ఇప్పుడు చెంపలేసుకున్నామని కేటీఆర్ ప్రకటించారనుకోండి.) కరోనా పోతుందంటే పళ్ళాలు కొట్టారు. 370వ అధికరణం రద్దుకు పార్లమెంట్లో ఓటేశారు. శ్రీకృష్ణకమిషన్ చెప్పకున్నా భద్రాచలంలోని 7 మండలాలు ఏపీకి బదలాయిస్తే చప్పుడు చేయలేదు. రాష్ట్రంలో ఒక్క సీపీఐ(ఎం) మాత్రమే దీన్ని వ్యతిరేకించింది. సున్నం రాజయ్య శాసనసభలో దాన్ని వ్యతిరేకిస్తూ నెత్తీనోరు కొట్టుకున్నారు. ఇంత చేసినా వ్రతం ఎలానూ చెడింది. ఫలితం ఏం దక్కింది? రాష్ట్రానికి మోడీ పాలన ఏం ఒరగబెట్టిందో చెప్పగలరా అధ్యక్షా!
చాలా ఆలస్యంగానైనా టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంతో యుద్ధంలోకి దిగింది. అంతే కాదు, బీజేపీ విధానాలపైనా, ముఖ్యంగా మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం పైనా, దాన్ని పరివార్ నేతలు ధ్వంసం చేస్తున్న తీరుపైనా అధినేత విమర్శల బాణాలు సంధించడం వల్ల ప్రజాస్వామ్య శక్తులకు ఒక గొంతు అదనంగా కలిసినట్టే! కాని చిత్తం శివుడిమీద ఉంచి భక్తి చెప్పులమీద ఉంచారన్న విమర్శ రాకూడదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడంలో తానూ ఒక చెయ్యి వెయ్యాలి. ఎంత ఎగిరినా ద్రాక్షపళ్ళు అందలేదు కాబట్టి చేదంటున్నారని ఎవరూ అనుకోకూడదంటే తమ అరవైలక్షల మంది సభ్యుల్లో కనీసం నాల్గవ వంతు రోడ్లపైకొచ్చినా వడ్లూ కొంటారు, సింగరేణీ బతికి బట్టకడుతుంది. అది కోలిండియాని కాపాడగలిగితే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు ఊపునిస్తుంది. అంబానీ, అదానీలను మోడీ సర్కార్ మేపలేక చేతులెత్తేయ్యాలి. అదే జరిగితే మోడీ సర్కార్‌కున్న ఊత కర్రలు కూలిపోతాయి.
దేశంలో ప్రజల జీవితం రోజు రోజుకూ దుర్భరమవుతోందని ఇటీవల సికింద్రాబాద్ స్టేషన్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో 'అగ్నిపథికుల' ఉద్యమం తెలియజేస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ వాగ్దానం హుళక్కి అయ్యింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న బూటకపు మాటలపై జనం తిరగబడుతున్నారని అర్థమవుతోంది కదా! ప్రజాసామాన్యంపై మోడీ టక్కుటమార విద్యలు పారే స్థితి తగ్గుతోంది. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేడీలు సీరియస్‌గా మద్దతిస్తే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించవచ్చు. తన వంతు ప్రయత్నం గా కేసీఆర్ ఒకపట్టు పడితే దేశ రాజకీయ యవనిక స్వరూప స్వభావాలే మారిపోతాయి. లేకుంటే 17వ శతాబ్ది స్పానిష్ నవల్లోని డాన్క్విక్సోట్లా శత్రువులతో పోరాడుతున్నా ననుకుని గాలిమరపై యుద్ధం చేసినట్లే ఉంటుంది.