Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మీలో 'అగ్నివీరుల' రిక్రూట్మెంట్కు కేంద్రం సోమవారమే నోటిఫికేషన్ జారీచేసింది. జులై నుంచి అభ్యర్థు రిజిస్ట్రేషన్ విధి విధానాలను కూడా ప్రకటించింది. అయినా, అగ్నిపథ్‌ను రద్దు చేయకుంటే తగ్గేదేలే అన్నట్టుగా యువత పోరాడుతోంది. నాలుగేండ్ల తరువాత తమ భవిష్యత్తు ఏమిటో తెలియని అభ్యర్థులపై కేంద్ర పెద్దల వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యంపోస్తున్నాయి. దేశం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడటానికి వస్తున్న యువతకు డ్రైవర్స్, ఎలక్ట్రిషియన్స్, బట్టలు ఉతకడం, హెయిర్ కట్టింగ్ చేయడం వంటివి నేర్పిస్తామని, అది వారికి భవిష్యత్తులో ఉపాధినిస్తుందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే చెబుతున్నారంటే ఈ దేశ సైనిక వ్యవస్థ మీద వారికి ఏ పాటి గౌరవముందో తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి కైలాష్ విజయవర్గీయ మరో అడుగు ముందుకేసి మాజీ అగ్నివీరులకు తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని సెలవిచ్చారు. దేశ సైనికులతో బీజేపీ ఒక ప్రయివేటు సైన్యాన్ని తయారుచేసుకోవడానికి ఈ పథకాన్ని వాడుకోనుంది అన్నడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ.
2021 నాటికే ఆర్మీలో లక్షకుపైగా సైనికుల, అధికారుల కొరత ఉంది. రెండేండ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. దేశభక్తి తమ సొంతమని రంకెలు వేసే బీజేపీ పెద్దలే కాంట్రాక్టు సిపాయిలను పెట్టుకొని సైన్యం నైపుణ్య సామర్ధ్యాలను నిర్వీర్యం చేయబూనడమంటే వారిది ముమ్మాటికీ నకిలీ దేశభక్తే కాదు, దేశద్రోహం కూడా. 2032 నాటికి సైన్యంలో 50 శాతం కాంట్రాక్టు సిపాయిలతో నింపడం మోడీ ప్రభుత్వ లక్ష్యం.
రిటైరైన అగ్నిపథ్ సైనికులకు తాము ఉపాధి కల్పిస్తామంటూ మహీంద్రా వంటి కార్పొరేట్ దిగ్గజాలు మద్దతు పలుకుతున్నారంటే సైన్యంలోకి కూడా ఉదారవాద విధానాలను ప్రవేశపెటేందుకేనన్నది స్పష్టం. ఇలాంటి వారు తమ ఆఫీసుల్లో ఒకరిద్దరికి, మహా అయితే వంద మందికి సెక్యూర్టీగార్డు ఉద్యోగాలిస్తారంతే! మరి మిగతా వారి సంగతేమిటి? అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడ్డ నవ జవాన్లకు వారిచ్చే బహుమానం ఇదా! మరోవైపు నపూర్ శర్మ వ్యాఖ్యలపై కానీ, రైతులను కార్లుతో తొక్కించి చంపిన సందర్భంలో కానీ స్పందించని లోక్‌సత్తా అధినేత, కడుపుమండి సైనిక అభ్యర్థులు చేసిన చర్యను మాత్రం దేశద్రోహంగా వర్ణిస్తున్నారు. ఆయన మాత్రం మాజీ ఐఏఏస్గా, మాజీ ఎమ్మెల్యేగా రెండు పెన్షన్లు తీసుకోవచ్చు కానీ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపలా కాసే సైనికులకు మాత్రం పెన్షనే వద్దా? ఇదెక్కడి న్యాయం జేపీ గారు?
సైన్యంలో పెన్షన్ వ్యయం పెరగడంతోనే అగ్నిపథ్‌ను తీసుకువస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. అదే నిజమైతే చేయాల్సింది ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకోవడం కానీ దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేటుకు ధారాదత్తం చేసేస్తోంది. ఈ పరిణామంలో భాగమే 'అగ్నిపథ్'! ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్మెంట్ విధానాన్నేగాక, యువసైనికుల మనోధైర్యాన్ని మౌలికంగానే దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. అంతే కాదు, ఇది బీజేపీ ప్రభుత్వం 'ఒక ర్యాంకు ఒక పెన్షన్' విధానానికి కూడా వ్యతరేకమే. కానీ, ఇప్పుడు అదే బీజేపీ 'ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు' పొమ్మని పొగ పెడుతోంది. ఇది ఆర్మీ ఉద్యోగార్థుల భవితపై పిడుగు పాటే కదా!
ఎనిమిదేండ్లుగా ఇస్తానన్న రెండుకోట్ల ఉద్యోగాల ఊసేలేని మోడీ సర్కార్.. ఉన్న ఉద్యోగాలను సైతం ఊడకొట్టే పనిలో తలమునకలయ్యింది. అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 'అగ్నిపథ్' కింద నియమించేవారిలో నాలుగోవంతు మందిని 15ఏండ్ల సర్వీస్ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయం ఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. అదెలా అని అడిగితే ఉపాధి అడిగితే పకోడిలు అమ్ముకొమని యువతకు ఉచిత సలహాలిస్తున్నారు. వారు మాత్రం దేశాన్ని పోగులు పెట్టి అమ్ముతున్నారు. వారేమో దేశభక్తులు.. మిగతా వారు మాత్రం దేశద్రోహులా? ఇదెక్కడి న్యాయం?