Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఈనెల పదమూడు నుంచి బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల సరదాలను తీర్చుకున్న పిల్లలు... పుస్తకాల సంచిని భుజానేసుకుని తిరిగి బడుల్లో కాలు మోపారు. వారిని ఆ విధంగా బళ్లలో దిగబెట్టేసరికి తల్లిదండ్రులకు చుక్కలు కనిపించాయి. షరా మామూలుగా పుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫారాలు, టైలు, షూల పేరుతో ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్లు వారి జేబులను గుల్ల చేశాయి. వీటిపై నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదే తప్ప నోరు మెదపటం లేదు. మరోవైపు ఫీజుల నియంత్రణ కోసం 2017లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన తిరుపతిరావు కమిటీ... ఆ ఫీజుల్ని తగ్గించాలంటూ సిఫారసు చేయకపోగా, వాటిని ప్రతీయేటా 10 నుంచి 30 శాతం వరకూ పెంచుకోవచ్చంటూ పేర్కొనటం విస్మయపరిచే అంశం. ఇదే సమయంలో ఆ కమిటీ... ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లోని టీచర్లకు ఎంతెంత జీతాలివ్వాలనే దానిపై మాత్రం ఎలాంటి సిఫారసులూ చేయకపోవటం గమనార్హం. ఇలాంటి పరిణామాల మధ్య 2018లో సదరు కమిటీ ఇచ్చిన నివేదికపై విమర్శలు, భిన్నాభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. పోనీ కనీసం తప్పుల తడకగా ఉన్న ఆ రిపోర్టునైనా ప్రభుత్వం బయటపెట్టిందా..? అంటే అదీ లేదు. మరోవైపు ఈ యేడాది జనవరిలో 'ఫీజులను నియంత్రిస్తాం...' అంటూ మరోసారి ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు, అందుకోసం ఏకంగా మంత్రివర్గ ఉపసంఘాన్నే ఏర్పాటు చేసింది. ఇందుకోసం చట్టం తీసుకొస్తామంటూ ప్రకటించినప్పటికీ... మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో మాత్రం దాని ఊసే ఎత్తలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆ చట్టాన్ని తీసుకురావాలంటే కచ్చితంగా ఆర్డినెన్సును రూపొందిం చాల్సిందే. ఆ పని చేయాలన్న చిత్తశుద్ధి సర్కారుకు ఉంటుందా..? ఒకవేళ ఉన్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్‌కు దాన్ని పంపించి.. ఆర్డినెన్స్‌ను జారీ చేయించగలరా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కమిటీలు, చట్టాలు, వాటి కథా కమానీషు ఇలా ఉండగా... అసలు వాటితో ఎలాంటి సంబంధమూ లేకుండానే ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు... ఈ యేడాది ఇప్పటికే తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని విపరీతం గా మోపాయి. కరోనా సమయంలో ఫీజు వసూలు చేయని స్కూళ్లు, ఒకవేళ వసూలు చేసినా ఎంతో కొంత తగ్గించి తీసుకున్న పాఠశాలలు... ఇప్పుడు తమ ప్రతాపాన్ని చూపాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏకంగా 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచిన ఆయా పాఠశాలలు... వాటిని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. కరోనా టైంలో ఫీజులను పూర్తిగా వసూలు చేసిన స్కూళ్లు సైతం ఇదే బాటపట్టి తామేం తక్కువ కాదని నిరూపించాయి. కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి... అప్పట్లో ఫీజులే చెల్లించని తల్లిదండ్రులు ఇప్పటి పరిస్థితి చూసి మరింత జంకుతున్నారు.
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. ప్రభుత్వ బడుల దుస్థితి మరో రకంగా ఉంది. 'సర్కారు బడులను బలోపేతం చేస్తాం.. మన ఊరు-మన బడి ద్వారా వాటి దశను, దిశను మారుస్తామనే' ప్రభుత్వ పెద్దల హామీల వర్షం మధ్య పాఠశాలలకు చేరుకున్న పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆ ఆనందం తొలిరోజే ఆవిరైంది. రాష్ట్రంలోని అనేక బడుల్లో సమస్యలు తిష్టేవేయటమే ఇందుకు కారణం. మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సమస్యలు ఇటు పంతుళ్లను, అటు పోరగాళ్లను వెక్కిరించాయి. పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో టీచర్లే చీపుర్లు పట్టి పాయఖానాలను శుభ్రం చేయాల్సిన దుస్థితి. ప్రస్తుత వర్షాకాలంలో మంచినీరు, పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో ఇటు పిల్లలు, అటు టీచర్లు రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. బడుల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులది మరో రకమైన సమస్య. గత పదిహేనేండ్లుగా సేవలందిస్తున్న వీరి వేతనం నెలకు కేవలం వెయ్యి రూపాయలే. దీన్ని రూ.మూడు వేలకు పెంచుతామంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని బాలికలకు అవసరమైన అనేక వస్తువులతో కూడిన కిట్లను అందిస్తామంటూ గత మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక లేయకుండా సర్కారు ఉదాశీనంగా వ్యవహరించటంతో ఇప్పటి వరకూ వాటికి అతీగతీ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీలను భర్తీ చేయకపోవటం, విద్యా వాలంటీర్లను నియమించకపోవటం తదితర సమస్యలు వీటికి అదనం. ఈ నేపథ్యంలో నేటి భావి భారత పౌరులు... ఇటు చదువుకోలేక, అటు చదువులను కొనలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన అనేక రంగాలను ప్రయివేటీకరించటం ద్వారా ఆయా బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోజూడటమే ఇందుకు కారణం. దాని పర్యవసానమే ఈ 'చదువుల గోస...'. ఇటీవల బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళననుబట్టి ప్రభుత్వ విద్యారంగంపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో విదితమవుతున్నది. అందుకే ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్లలో ఫీజుల తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదలకు ఇటు తల్లి దండ్రులు, అటు ఉపాధ్యాయులు, మేధావులు నికరంగా పోరాడాలి.