Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశల్ని ముక్కలు చేయని వార్త ఒక్కటి కూడా కనిపించని, వినిపించని రోజుల్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్న భావన కలుగుతోంది. దీనిని మహారాష్ట్ర సంక్షోభం మరింత రుజువు చేస్తున్నది. ఒకవైపు 'అగ్నిపథ్' రాజేసిన నిరసన జ్వాలలు, మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల విన్యాసాలు కొనసాగుతుండగానే అక్కడ ప్రభుత్వ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇందులో తమ ప్రమేయమేమీ లేదని, అదంతా శివసేన అంతర్గత వ్యవహారమని ''ఆపరేషన్ కమల్'' నిపుణులు ఎంత చెప్పుకున్నా... తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ గుజరాత్ గూటికి చేరడం, అటునుంచి అస్సాంకు తరలడం కమలనాథుల లోగుట్టును పట్టిచూపుతూనే ఉంది. ఎవరూ అంతగా గమనించలేదుగానీ, నిన్నటి ఆ రాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఓ సీటును అదనంగా దక్కించుకున్నప్పుడే ఈ చీకటి కుట్రల ఆనవాళ్లు కొన్ని కనిపించాయి. దీనికిముందే ప్రభుత్వ కూల్చివేతకు కమలనాథులు చేసిన రెండు విఫలయత్నాలు ఉండనే ఉన్నాయి. అయినా తమ ప్రమేయమేమీ లేదని వీరు అమాయకత్వం ప్రదర్శిస్తుంటే ప్రజలు విస్తుపోవాల్సివస్తోంది.
అయినా ప్రజలేమనుకుంటారన్న పట్టింపేమీ వారికి ఉండదని తెలియనిదెవరికి? ఎవరేమనుకున్నా ఎన్నికల సమయానికి ఎంతటివారినైనా ఏమార్చగలమన్న నమ్మకం వారిది. అందుకే ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ వారి ఆపరేషన్ కమల్ దేశమంతటికీ కోరలు చాస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే... ఉంటే తమ ప్రభుత్వముండాలీ, లేదంటే తాము ఆడించినట్టల్లా ఆడే కీలుబొమ్మ ప్రభుత్వమైనా ఉండాలన్నదే ఈ ఆపరేషన్ కమల్ సారాంశమన్నది వేరుగా చెప్పనవసరం లేదు. అలా ఉన్నప్పుడే ప్రజాభిప్రాయం ఎలావున్నా, ఎన్నికల నాటికి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేలా వ్యవస్థలను నియంత్రించవచ్చన్నది వారి పన్నాగం. కావునే మొన్న మధ్యప్రదేశ్, నిన్న కర్నాటక, నేడు మహారాష్ట్ర..! ఇలా చెప్పుకోవాల్సివస్తే ఈ ఎనిమిదేండ్లలో వీరు గెలిచినవాటికంటే కూల్చిన ప్రభుత్వాలే ఎక్కువుంటాయేమో...! చివరికిది ఎక్కడికి చేరిందంటే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎర్పడాల్సింది మాత్రం బీజేపీ ప్రభుత్వమే అనుకునే స్థితికి దిగజారింది.
మధ్యప్రదేశ్‌లో 121స్థానాలు గెలుచుకుని కమల్‌నాథ్ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జ్యోతిరాదిత్య ద్వారా 26మంది ఎమ్మెల్యేలను చీల్చి, కూల్చి గద్దెనెక్కింది బీజేపీ. కర్నాటకలో జేడీఎస్ నుంచి 16మంది ఎమ్మెల్యేలను చీల్చి, కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి కుర్చీని స్వాధీనం చేసుకుంది. మణిపూర్‌లో అత్యధిక స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు, వీటికి ముందూ వెనుకా అరుణాచల్‌ప్రదేశ్, బీహార్, కాశ్మీర్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలను నిష్కారణంగా పడగొట్టి, అప్రజాస్వామికంగా అధికారపీఠాలను ఆక్రమించుకుంది. ఇలా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడమనే వికృత రాజకీయ క్రీడలో బీజేపీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ కాంగ్రెస్‌ను మించి పోయింది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా, తమకు భిన్నంగా వ్యవహరిస్తే కేంద్రంలోవున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామ దాన దండోపాయాలతో చిన్నాభిన్నం చేస్తోంది.
ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరుగనుందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. లేదంటే అప్పటివరకూ ముఖ్యమంత్రితోనే ఉన్న నేత, అకస్మాత్తుగా తిరుగుబాటు ప్రకటించి, అప్పటికప్పుడే అంతమంది ఎమ్మెల్యేలను సమీకరించి, ఉన్నఫలంగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఉడాయించటంలోని మతలబేమిటి? ముంబైలో అంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా విమానమెక్కుతుంటే నిఘావర్గాలు నిద్ర నటించడం వెనుక దర్శకత్వ ప్రతిభ ఎవరిది? ఇది యాధృచ్ఛికం అంటే నమ్మగలమా?! ఆ తరువాత అస్సాంకు తరలిస్తున్న అసమ్మతి ఎమ్మెల్యేలకు విమానం ఎక్కేవరకూ గుజరాత్ పోలీసులు బందోబస్తుగా వెళ్లడంలోని అర్థమేమిటి? అస్సాంలో దిగీదిగగానే అక్కడి నుంచి గువాహటిలోని 'రాడిసన్ బ్లూ' హౌటల్ వరకూ తిరిగి అస్సాం పోలీసులకు అదే స్థాయి బందోబస్తు కల్పించాల్సిన అవసరమేమిటి? ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందంటే ఒప్పుకోగలమా? అసమ్మతి శిబిరం నుంచి తప్పించుకుని, తిరిగి శివసేన గూటికి చేరిన ఎమ్మెల్యే చెపుతున్న వివరాలు ఏం సూచిస్తున్నాయి? ఇవన్నీ జరుగుతున్న వ్యవహారంలో బీజేపీ ప్రమేయాన్నే స్పష్టం చేస్తున్నాయి కదా! ఇదంతా చేస్తూ కూడా ధర్మాధర్మాలూ, న్యాయ సూత్రాలూ వల్లించడం వీరికే చెల్లింది. బహుశా వీరి దృష్టిలో ధర్మమంటే ఫిరాయింపులూ, న్యాయమంటే కూల్చివేతలు కాబోలు...!!