Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన పథకాలను రూపొందించేది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ అనే బ్రెట్టన్‌ఉడ్ కవల సంస్థలని చెబుతారు. ఆ పేరుతో మనతో సహా అనేక దేశాలు అప్పులు వాటితో పాటు తిప్పలు తెచ్చుకుంటున్నాయి. ఈ సంస్థలకు అవసరమైన పెట్టుబడులు పెట్టేది అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. అమెరికాలో 2021 డిసెంబరులో నెలవారీ దారిద్య్రరేటు 12.5శాతం కాగా ఫిబ్రవరిలో 14.4శాతం ఉంది. అంటే అక్కడి జనాభాలో నూటికి 14.4మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లుగా అమెరికాలో ఈ దుస్థితి ఏమిటి? దీన్నే విధానపరమైన దారిద్య్రం అంటున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పేదలు గళమెత్తుతూ వీధుల్లోకి వస్తున్నారు.
జూన్ 18న దేశంలోని నలభై రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షా 50వేల మంది ''విధానపరమైన హత్య''లకు స్వస్థి చెప్పాలని రాజధాని వాషింగ్టన్ పట్టణంలో ప్రదర్శన, సభ జరిపారు. ఇది ఒక రోజు సభతో ముగిసేది కాదని, నవంబరు ఎన్నికల తరువాత కూడా కొనసాగిస్తామని ''పేద ప్రజల ప్రచార ఉద్యమ కమిటీ'' నేతలు ప్రకటించారు. పేదల జీవితాలతో పాటు అంకెలతో ఆడుకోవటం పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే అధికారికంగా ఏమి చెప్పినప్పటికీ 33కోట్ల మంది జనాభాలో పేదరికంలో ఉన్న, అల్పాదాయ జీవులు కోట్లాది మంది ఉన్నారని ఉద్యమ కమిటీ అంచనా వేసింది. ఈ కారణంగానే వాషింగ్టన్ ప్రజా ప్రదర్శనలో చిరుద్యోగులతో సహా వివిధ తరగతుల వారు పాల్గొన్నారు. వీరిలో ఆఫ్రో- అమెరికన్లు(ఆఫ్రికన్ సంతతి), లాటినోలు(స్పానిష్ మాట్లాడే దక్షిణ అమెరికా దేశాల వారు), శ్వేత జాతి పేదలు గణనీయంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు.
అమెరికాపై 2001 సెప్టెంబరు 11నాటి ఉగ్రవాద దాడి తరువాత ఉగ్రవాదంపై పోరు, మరొక సాకుతో వివిధ దేశాల్లో చేస్తున్న అమెరికా దాడుల్లో మానవ నష్టంతో పాటు ఇంతవరకు చేసిన ఖర్చు ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు. దీనివలన మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు, వారిని ఆశ్రయించిన వారు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం 85దేశాల్లో అమెరికా మిలిటరీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిని నిలిపివేసి ఆ సొమ్మును పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలన్నది వాషింగ్టన్ సభ డిమాండ్లలో ఒకటి. పెద్ద మొత్తాలలో వేతనాలు పొందే వారిని చూసి అవే అమెరికా అంతటా ఉన్నట్లు భావిస్తే పొరపాటు. అవసరం కొద్దీ కొన్ని కంపెనీలు ఎక్కువ మొత్తాలను ఇస్తున్నాయంటే అది వాటి అవసరం లేదా కార్మిక సంఘాల బేరమాడేశక్తి కారణం. 2009లో జాతీయ కనీసవేతనంగా గంటకు 7.25 డాలర్లుగా నిర్ణయించిన దానిలో ఎలాంటి మార్పు లేదు. అందుకే దాన్ని పదిహేను డాలర్లకు పెంచాలని కార్మికవర్గం డిమాండ్ చేస్తున్నది. డెమోక్రటిక్ పార్టీ అధికారంలో లేనపుడు పేదల గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చటం తప్ప అధికారానికి వస్తే దానికి వారు గుర్తుకురారు. అదే యుద్ధాలను కొనసాగిస్తారు, కార్పొరేట్లకు సొమ్ము కట్టబెడతారు. తాజా పరిణామాల్లో ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం పేరుతో వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్న సొమ్మంతా మిలిటరీ పరిశ్రమలవారికి చేరేదే. కనుక ప్రజల కోసం జోబైడెన్ ఎన్నికల వాగ్దానంగా ప్రకటించిన సంక్షేమ పథకాల(బిల్డ్ బాక్ బెటర్ )బిల్లును అమలు జరపాలని ఈ సభ కోరింది.
దారిద్య్రం, ఆర్థిక అసమానత అనేక విధాలుగా జన జీవితాలను ప్రభావితం చేస్తున్నది. అమెరికాలోని ధనికులైన ఒక శాతంలోని పురుషులతో పోలిస్తే పేదల్లో సగటు జీవన కాలం 14.6సంవత్సరాలు తక్కువ, మహిళల్లో 10.1 సంవత్సరం తక్కువ. ఆఫ్రో- అమెరికన్లలో శిశుమరణాల రేటు 10.8శాతం కాగా మెజారిటీ శ్వేతజాతివారిలో 4.8శాతమే ఉంది. ఇవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే. వరుసగా ఐదు సంవత్సరాల పాటు అధికారిక లెక్కల ప్రకారం తగ్గిన దారిద్య్రం 2019లో 10.5శాతం ఉండగా 2020లో 11.4శాతానికి పెరిగింది. మతం జనాన్ని మత్తులో ఉంచుతుంది. కానీ అనేక లాటిన్ అమెరికా దేశాలు, అమెరికాలో సైతం మెజారిటీ మతంగా ఉన్న క్రైస్తవ మతానికి చెందిన ఫాదర్లు తదితరులు చర్చిలకే పరిమితం కావటం లేదు. తమ చర్చ్‌లకు వచ్చే జనం చేస్తున్న బతుకుపోరులో వారూ చేతులు కలుపుతున్నారు. వాషింగ్టన్ నిరసన సభ నిర్వహించిన ''పేద ప్రజల ప్రచార ఉద్యమ కమిటీ'' సహ అధ్యక్షుడు రెవరెండ్ విలియం బార్బర్ పోరును కొనసాగించాలని పిలుపు ఇచ్చినవారిలో ఉన్నారు. అమెరికాలో గతంతో పోలిస్తే ఉద్యమాలు తగ్గటానికి అనేక కారణాలుండవచ్చు. పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, శ్వేతజాతి దురహంకారం వంటి అంశాలకు కరోనా తోడై పరిస్థితి మరింతగా దిగజారుతున్న తరుణంలో ఎక్కడైనా పేదలకు ఉద్యమబాట తప్ప మరొక దగ్గరదారిలేదు. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది.