Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అన్నం పరబ్రహ్మ స్వరూప'మని ఆధ్యాత్మికులు దాని గొప్పతనాన్ని గూర్చి బోధిస్తారు. అన్నం స్వీకరిస్తున్నప్పుడు దాన్ని గౌరవించి స్వీకరించాలనీ అంటారు. వారి వివరణలు ఎలా ఉన్నా అన్నము మానవులనందరినీ బతికిస్తున్న ఆహారము. కాల్లూ చేతులు ఆడేందుకు, పని చేసే శక్తికోసమే కాదు, జీవి ప్రాణాధారము ఆహారము. 'అన్న మయము లైనవన్ని రజీవమ్ములు, కూడులేక జీవకోటి లేదు. కూడు తినెడి కాడ కుల భేదమేలకో! కాళికాంబ హంస కాళికాంబ!' అని పోతులూరివారు సెలవిచ్చారు. అన్నాన్ని నిందించరాదు. ఎందుకంటే శరీరం అన్నాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. ప్రాణం శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. 'పళ్లెంలో ఆహారము వెనుక భూమాత, సముద్రం, మేఘాలు, నదులు, వృషభాలు, వ్యవసాయ పనిముట్లు, ప్రకృతిలోని ప్రాణులు, కూలీలు, ముఖ్యంగా రైతన్నల కష్టం దాగున్నాయి' అని ధర్మబోధనలోనూ ప్రాచీనులు చెబుతారు.
మరి అంత ముఖ్యమైన ఆహారమును సేవించే సమయములో కుల, మత భేదాలు చూపరాదనే తత్వాన్ని పదిహేడవ శతాబ్దంలోనే పోతులూరి ప్రచారం చేశాడు. మనం అన్నం ముద్దను నోట్లోపెట్టుకుంటున్నప్పుడు, దాని కోసం శ్రమపడిన కర్షక, శ్రామిక లోకానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. ఎవరు ఎన్నిరకాల శ్రమలు చేసినా అన్నమనేది ప్రాథమికావసరం. అందుకే కోటి విద్యలు కూటికొరకే అన్నారు పెద్దలు. ఎంత సంపద పోగేసుకున్నా, వేల కోట్లు సంపాదించినా, రెండు పూటలా తినగలిగేది అన్నం మాత్రమే - అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి అన్నాన్ని అందించే శ్రమ జీవుల పట్ల అమానవీయంగా వ్యవహరించడం మన సమాజంలో తరచూ చూస్తూనే ఉంటాము. మొన్నీ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో జొమాటో డెలివరీ బారుని దళితుడవంటూ... తను తెచ్చిన హౌటల్ ఆహారపు పార్సిల్‌ను తీసుకోవటానికి నిరాకరించాడు ఒక ప్రబుద్దుడు. అంతే కాదు, దళితుడైన కారణంగా అతని ముఖంపై ఉమ్మేసి, తీవ్రంగా కొట్టారు. గాయపరిచారు. అతని పేరు తెలుసుకుని కులాన్ని పసిగట్టి, ఈ దౌర్జన్యానికి పూనుకున్నారు. ఈ గాయాలు ఒక్క వ్యక్తికి సంబంధించినవి కావు. ఒక వ్యవస్థకు సంబంధించినవి. ఇది ఒక్క సంఘటనా కాదు. అంతకు ముందు మధ్యప్రదేశ్‌లో 2019లోనూ ఒకటి జరిగింది. డెలివరీ బారు హిందూయేతరుడని ఆహారాన్ని నిరాకరించారు. ఇవి అక్కడక్కడ జరుగుతున్నట్లు కనపడుతుంటాయి కానీ, కుల వ్యవస్థలో తెలియకుండానే కొనసాగుతున్న దుర్మార్గపు ఆచరణ, ఆలోచనయిది. ఇంతెందుకు మన రాష్ట్రంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారుచేస్తున్న వాళ్లు దళితులని చెప్పి, వారి పిల్లలు అక్కడ భోజనం చేయకుండా బహిష్కరించిన తల్లిదండ్రుల సంఘటనలు ఎన్నిలేవు! హౌటళ్లలో రెండు గ్లాసులు, మాటల్లోనూ మర్యాదల్లోనూ కులం మలినాలు దాగిన సామాజిక చిత్రాలు కోకొల్లలే కదా!
ఆ దళితులే వ్యవసాయ కూలీలుగా నిత్యం మట్టిలో, పొలాల్లో, నాట్లు వేస్తూ, కలుపుతీస్తూ, నీళ్లు పెడుతూ, కోతకోస్తూ, కాపలాకాస్తూ నూర్పిడి చేస్తూ, కాళ్లతో చేతులతో చెమటతో పంటను పండించి అన్నంముద్దల్ని తయారుచేస్తున్నారు కదా! అప్పుడు అంటుపడలేదా ఆహారానికి. అప్పుడు అవసరమైన వారి శరీరం, పార్సిల్లో కట్టిన ఆహారపు రవాణాకు మైలగా తోచిందా! ఇది తరతరాలుగా మన సమాజంలో పేరుకుపోయిన కులం కుళ్లు ప్రతిఫలనం. కష్టపడే వారిపట్ల మన వ్యవస్థ కల్పించిన హీన భావనల ఫలితం. మతం, ధర్మాలు, నీతి న్యాయాలు, అధికారాలు అన్ని కలిసి కొనసాగించిన వివక్షా పూరిత విధానాల పర్యవసానాలు. ఆధునిక కాలంలోనూ అంతర్లీనంగా అదే దృష్టి, భావన సాగుతూనే ఉన్నది. ఎన్నో తరాలు మారుతూ వచ్చాము. ప్రజాస్వామిక లౌకిక, సమతా భావనల ప్రాతిపదికగా మనల్ని మనం పునర్నిర్వచించు కొన్నప్పటికీ పూర్వ భావదారిద్య్రం ఇంకా వీడనేలేదు. పైగా రోజు రోజుకు మరింత పెచ్చరిల్లుతోంది.
ఇలాంటి విషయాలు పత్రికలలో వార్తలుగానే ఉంటాయి తప్ప, వాస్తవంగా రాజకీయాలలో కానీ ప్రభుత్వంలో కానీ అసలు చర్చకేరావు. నాయకుల నుండి కనీసం ఖండనలూ వెలువడవు. సామాజిక పరమైన ఈ వివక్షతలపై కఠిన చర్యలూ పెద్దగా చూసిందిలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు, రాజకీయాలు కూడా అందులో భాగంగానే ఉన్నాయి కనుక. ఇప్పుడు కుల వ్యవస్థను, దాని పునాదిని మరింత స్థిరపరిచే హిందూ తాత్వికతను, మనువాదాన్ని అమలు పరచే శక్తులు ఆధిపత్యంలో ఉన్నాయి. దళిత, ఆదివాసీ ప్రజలపై వివక్ష మరింత పెరుగుతోంది. ఇదీ నేటి విషాదం. అందుకని అన్నంతో పాటు ఆత్మగౌరవం నేటి ప్రధాన సమస్య, ఉమ్మినవాడి కులోన్మాదంపైన నిప్పులు చిమ్మటమే నేటి తక్షణావసరం.