Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేశారు. దీన్ని ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ వాదులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆమె రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిందే తప్ప ఏ దేశ వ్యతరేక కార్యక్రమాలకు, కుట్రలకు పాల్పడలేదు. అందుకే ఆమె అరెస్టును ఐరాస మానవహక్కుల విభాగం సైతం ఖండించింది. న్యాయాన్ని ఆశ్రయించడమే నేరమైతే ఈ దేశంలో పౌరులుంటారా? ప్రజలు న్యాయం కోసం కోర్టులను కాకుండా ఎవర్ని ఆశ్రయించాలి? ప్రభుత్వ పెద్దలే ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తుంటే, రాజ్యాధినేతలే రాజ్యాంఘోల్లంఘనకు పాల్పడుతుంటే అలాంటి నేతలనేమనాలి? ప్రజలేం చేయాలి..?
''నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు.. కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం నా ప్రాణమిస్తా'' అంటాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్. భిన్నాభిప్రాయాలను సైతం సమున్నతంగా గౌరవించే ప్రజాస్వామ్యస్ఫూర్తికి ప్రతిబింబాలు ఈ వాక్కులు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ భిన్నాభిప్రాయాలపై మున్నెన్నడూ లేని అసహనం నిర్భంధం పెల్లుబుకుతోంది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆ కేసులో పోరాడిన హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ మోడీ ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆమెను గుజరాత్ పోలీసులు నిర్భంధంలోకి తీసుకోవడం గమనార్హం.
స్వతంత్రత, సమగ్రతకు నిలయమైన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం గుజరాత్ అల్లర్ల కేసులో ఇచ్చిన తీర్పు యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ సరైన ఆధారాలు లేవంటూ మోడీ, ఆయన సన్నిహితులకు అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చిన క్లీన్చిట్నే సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆమె 2002లో 'సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' సంస్థను ప్రారంభించి, బాధితుల తరఫున పోరాడడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాధితుల నుంచి పిటిషన్లు వేయించడం, వారికి న్యాయనిపుణులను సమకూర్చడం, సాక్షులను సమీకరించడం, వారికి న్యాయం జరిగేలా చూడడం ఆ లక్ష్యంలో భాగమే. ఈ సంస్థ పాత్ర కారణంగా నాటి 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో 120మంది దోషులకు శిక్ష పడిందంటే వారి పోరాట ఫలితమే. దానిని మోడీ షాలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తీస్తా సెతల్వాద్ పై గుజరాత్ పోలీసులు పాత కేసులను తిరగదోడారు.
పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్లో కోత విధించడానికి, రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించే అన్ని సంస్థలను ధ్వంసం చేయడానికి మోడీ ప్రభుత్వం తన ఎనిమిదేండ్ల పాలనలో ఒక పద్ధతి ప్రకారం అనేక చర్యలకు పాల్పడింది. ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు పూనుకుంది. మానవ హక్కుల కార్యకర్తలని తీవ్రవాద సానుభూతి పరులుగానో లేదా తీవ్రవాదులు గానో అభివర్ణించడం ఆనవాయితీగా మారింది. 'మా పక్షాన లేని వారందరూ మా శత్రువులే' అనే మూర్ఖులు వ్యవస్థలను గౌరవిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
జర్మనీ పర్యటనలో ఉన్న మన ప్రధాని ''దేశ ఉజ్వల ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ''గా వర్ణించారు. ''సంస్కృతి, ఆహారం,ఆహార్యం వంటి అంశాల్లో ఉన్న వైవిధ్యమే మన ప్రజాస్వామ్యాన్ని ఉజ్వలంగా తీర్చింది'' అని వాపోయిన మన ప్రధాని, ప్రతి భారతీయుడి డీఎన్ఏ లోనూ నిక్షిప్తమై ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఆనాడు దారుణంగా అణిచివేశారని తీవ్ర ఆవేదన చెందారు. ఒక పక్క దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలుచేస్తూ విదేశాలలో మాత్రం ఆనాటి ఎమర్జెన్సీ గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడు తున్నారు. అవి అన్ని మొసలి కన్నీళ్లేనని భారతదేశ పరిస్థితులు నిత్యం గమనించే వారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎమర్జెన్సీ రోజులు మళ్లీ రావచ్చని స్వయంగా బీజేపీ కురువద్ధుడు అద్వానీనే 2015లోనే ఇంటర్య్వూలో తెలిపారు. ఆ ప్రకటిత ఎమర్జెన్సీ 21 నెలలే ఉంటే.. నేడది ఎనిమిదేండ్లుగా కొనసాగుతోంది.
పతిపక్షాలైనా, పౌరసమాజమైనా తమను అనుసరించా ల్సిందే తప్ప ఆక్షేపించడానికి వీలులేదంటూ నియంతలాగా వ్యవహరిస్తుంటే ఇక ప్రజాస్వామ్యానికి మనుగడేముంటుంది? పౌరహక్కులన్నీ దిక్కులేనివైనప్పుడు రాజ్యాంగానికి అసలు అర్థముంటుందా? మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా, రాజ్యాంగం ఎంతటి ఉన్నతాశయాలతో రూపొందించుకున్నా... పాలకులకు వాటి అమలులో నిజాయితీ, ఆచరణలో నిబద్ధతా లేనప్పుడు అవి వృథాయే అవుతాయనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఆనాడే ఎమర్జెన్సీని తీవ్రంగా ప్రతిఘటించి ఓడించారు. నేటి మోడీ నిర్భంద పరిపాలనను కూడా అంతకంటే తీవ్రంగానే నిలువరిస్తారు ప్రజలు. ఎంతటి నియంతలకైనా ఓటమి తప్పదని చరిత్ర రుజువు అనేక సందర్భాలలో రుజువు చేస్తుంది.