Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది ఆయనకు విజ్ఞప్తి కాదు. మనకే హెచ్చరిక! ఒక పక్క అందరికీ, అన్నింటా చీకట్లు కమ్ముకుంటున్నాయి. బహుశా, ఆ 'ఇద్దర్నీ' ఇంటా, బయటా ఉన్న వారి మిత్రబృందాన్ని మాత్రం భూగోళపు అద్దరి నుండి ఇద్దరికి తిప్పుతూ ఆ చీకటి నీడలు పడకుండా చూసుకుంటున్న ప్రతిభావంతుడు భారత ప్రధాని. హేమంతంలో మధ్యాహ్న భానుడి నులివెచ్చని నీరెండను వారికి పందారం చేసి కోట్లాను కోట్ల భారతీయులను మాత్రం గాడాంధకారంలో ముంచగలిగి, ఉంచగలిగిన చతురత ఆయనది.
ప్రజలపై దాడి పెరిగింది. అది ఏకాలం కన్నా నేడు నిజం. ఎమర్జెన్సీ కాలం కన్నా నేడే నిజం. ఎందుకంటే నాడు ఒక్కటే టుర్క్మ్యాన్గేట్. వారి భాషలో ''అలగా జనాన్ని'' ఢిల్లీ నుండి వెళ్ళగొట్టి సుందరీకరించడానికి... కాదు... కాదు.. సంపదీకరించడానికి అప్పుడూ బుల్డోజర్లు వాడాడు సంజరుగాంధీ. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, అదీ బలవంతంగా ఆడా, మగా అందరికీ చేశారు. 1976 జూన్ నుండి ఏడాదిలోపు 62లక్షల మందికి వాసెక్టమీలు, ట్యూబెక్టమీలు జరిపారు. ఇది నాజీలు జరిపిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కంటే 15రెట్లు ఎక్కువని ఒక జర్మన్ డాక్టర్ వెల్లడించింది. కార్మికులకు, ఉద్యోగులకు నష్టదాయకమైన వేతనస్తంభన, బోనస్ చట్టాన్ని సవరించి కనీస బోనస్ 4శాతం చేయటం వంటివి అమల్లోకొచ్చినాయి. ఆస్తి హక్కు తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ హరించివేయ బడ్డాయి. మీడియాపై ఆంక్షలు వచ్చాయి. టూర్క్మెన్ గేట్లో ఎందరు చనిపోయారో బి.బి.సి. ద్వారానే ఆనాడు దేశం తెలుసుకుంది. అందుకే ఎమర్జెన్సీ దుర్మార్గం. దాన్ని విధించిన ఇందిరాగాంధీ నియంత. ఆ విధానాలపై పోరాడినవారు హీరోలుగా నిలబడ్డారు. చప్పట్లు కొట్టి, తెల్లజెండా లెత్తినవారు జీరోలై పైకితేలారు. ప్రవాహ వాలుకు కొట్టుకుపోయారు.
ఇవన్నీ మోడీ సాబ్‌కు అవసరం లేదు. కేవలం నాటి పాలకులకు కోరలున్నాయని, చారలున్నాయని దండోరావేస్తున్న మోడీని చూస్తే ''56 అంగుళాల'' గురివింద రూపం మన కండ్లముందు సాక్షాత్కరించట్లేదా? విషయం పెట్టుబడిదారీ విధాన సంక్షోభంది. 1970ల్లో వచ్చిన భారతదేశ సంక్షోభం కంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేడు ప్రపంచ పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్నది. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కార్మికహక్కుల హననం సాగుతున్నది. ఆ విష చట్టాలను కార్మికులు అన్ని దేశాల్లో ప్రతిఘటిస్తూనే ఉన్నారు. రాయితీలు రాబట్టుకుంటున్నారు. భారత్‌లో నాలుగున్నర దశాబ్దాల తర్వాత కూడా 1976 మరింత కక్షతో పునరావృతం అవుతోంది. నేడు ఏ దాపరికం లేకుండా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారు మోడీ Ê కో. గుజరాత్లో అలవాటు కావడానికి పదేండ్లు పడితే మొత్తం దేశంలో ఇంకో పదేండ్లు పట్టవచ్చని మో-షాల ధీమా.
ఏడాది పాటు రైతులు అవిశ్రాంత పోరాటం. 700మంది ప్రాణత్యాగం. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశాయి. కోడ్లు ఎల్లుండి నుండి అమల్లోకొచ్చినా, మరికొంత కాలానికి అమలైనా కార్మికుల బతుకులు బానిసత్వంలోకే! ఇప్పటికే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్ని దాదాపు లాగేసుకున్నారు పెట్టుబడిదారులు. 8గంటల పనిదినం అటకెక్కేసింది. 12గంటలు ఆచరణలో కొచ్చేసింది. కార్మికులు చేతులు ముడుచుకుని కూచోరు మోడీ సాబ్!
అన్నిటికంటే కీలకమైంది నేడు మోడీ హయాంలో భారత రాజ్యాంగానికి మూలస్తంభాలైన ఫెడరలిజం, సెక్యులరిజం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం ఒక్కొక్కటే ధ్వంసం అవుతున్నాయి. దేశంలో మానవ హక్కులు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల కంటే దిగజారాయని న్యూజిలాండ్‌కు చెందిన సంస్థ తాజాగా లెక్కతేల్చింది. జీవించే హక్కుతో సహా అనేక ప్రాథమిక హక్కులు కాలరాయబడుతున్నాయి. ప్రభుత్వనేతలను, విధానాలను ప్రశ్నిస్తే ఏకంగా 'రాజద్రోహ' నేరం (124ఎ) మోపబడుతోంది. రిపోర్టర్స్ వితౌట్ ఫ్రాంటియర్స్ సంస్థ భారతదేశంలో పత్రికా స్వాతంత్య్రం 180దేశాల్లో 2016లో 136వ ర్యాంకు నుండి 2020లో, 2021లో కూడా 142వ ర్యాంకుకు పడిపోయిందని పేర్కొంది. పైన పేర్కొన్న సంస్థ మోడీని, ఇమ్రాన్‌ఖాన్‌ను, ఉత్తరకొరియా అధ్యక్షుడ్ని పత్రికా స్వేచ్ఛ హరించేవారిలో ముగ్గురికీ 37వ ర్యాంకు ఇచ్చింది. దేశంలో పార్లమెంటరీ ప్రజా స్వామ్యం ప్రపంచంలో నగుబాటుకు గురవుతున్నది. గతేడాది మన పార్లమెంటు 50రోజులు కూడా జరగలేదు. సిబిఐ, ఐటి, ఇ.డి.లను నిన్న కేటీఆర్ అన్నట్టు వేటకుక్కలుగానే వాడు తున్నారు. ఆనాటి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నాసా, మీసా, డి.ఐ.ఆర్. లను ఉపయోగించగా నేడు మోడీ సర్కార్ యు.ఎ.పి.ఎ. (ఉపా), 124ఎ వంటి వాటిని విస్తారంగా ఉపయోగిస్తున్నారు. గుంటూరు శేషేంద్ర చెప్పినట్లు...
''ఇక్కడ జీవితం ఎవడ్నీ విడిచిపెట్టదు
మనిషి నుంచి మనిషికి నిప్పంటిస్తోంది.'' ఆ మంటలు అధికారాన్ని కాల్చక మానవు.