Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరీక్షల్లో ఫెయిలైతే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా అయ్యా...' సరిగ్గా 24ఏండ్ల కిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఆ డైలాగ్ నిత్య నూతనంగానే ఉంది. ఎందుకంటే... మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల తర్వాత వాటిలో ఫెయిలయ్యామనే కారణంతో ఏడుగురు, మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో మరొకడు... మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు వారి తల్లితరడ్రులకు గర్భశోకం మిగిలింది కాబట్టి. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో పదో తరగతికి సంబంధించి 'కరోనా బ్యాచ్'గా ముద్రపడిపోయిన ఆనాటి హైస్కూలు పిల్లలు ఇప్పుడు ఇంటర్ పూర్తి చేశారు. ఈ క్రమంలో మొదటి ఏడాదిలో 63.32శాతంతోనూ, రెండో ఏడాదిలో 67.16శాతం మేర ఉత్తీర్ణతా శాతాన్ని సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఇందులో అమ్మాయిల హవా కొనసాగటం గమనార్హం. ప్రభుత్వ విద్యారంగమంటే చిన్న చూపు నెలకొన్న ప్రస్తుత తరుణంలో... రాష్ట్రంలోని 41 గురుకులాలు నూటికి నూరుశాతం ఫలితాలను నమోదు చేయటం ద్వారా ప్రయివేటు, కార్పొరేట్‌కు తామేమీ తక్కువ కాదని నిరూపించటం సర్వత్రా హర్షణీయం.
ఫలితాలు, ఉత్తీర్ణతా శాతాలు ఈ విధంగా ఉంటే... ఒకవైపు విద్యార్థుల మరణాలు, ఇంటర్ బోర్డు తప్పిదాలు విస్తుగొలుపుతున్నాయి. 2019లో కూడా పేపర్లు దిద్దటంతోపాటు ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల 26 మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో కొందరు పరీక్షలు బాగా రాసిన వారుంటే... మరికొందరు ఫెయిలయ్యామనే ఆత్మన్యూనతా భావంతో తనువు చాలించారు. అప్పుడే సాంకేతిక అంశాలను పర్యవేక్షించిన 'గ్లోబరీనా...' సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంస్థకు టెండర్లు కట్టబెట్టటం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయముందనీ, అందువల్లే దానిపై చర్యలు తీసుకోవటానికి సర్కారు వెనుకా, ముందూ ఆడుతోందనే ఆరోపణలూ వచ్చాయి. అనేక ఆందోళనలు కొనసాగాయి. తల్లిదండ్రులు, వారి పిల్లలూ రోడ్లెక్కారు. ఆ తర్వాత చెంపలేసుకున్న సర్కారు వారు... ఫెయిలైన వారి పేపర్లను ఉచితంగా రీవాల్యూయేషన్ చేయిస్తామంటూ ప్రకటించి, దాన్ని అమల్జేశారు. కానీ ఈలోగా విద్యార్థుల ఉసురు గాల్లో కలిసిపోయింది కదా..? దీనికి ఎవరు బాధ్యులు...? రీవాల్యూయేషన్ కంటే ముందు ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆ తర్వాత పాసైపోయారు. ఇలాంటి అనుభవాలను మనం మరిచిపోకముందే మరికొన్ని తప్పులు దొర్లడం ఇంటర్‌బోర్డు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఈసారి ఆ బోర్డు ఒకడుగు ముందుకేసింది. గతంలో పేపర్లు దిద్దే క్రమంలోనే తప్పులు సంభవిస్తే... ఇప్పుడు ఇంకాస్త అప్డేట్గా పరీక్షలు నిర్వహించేటప్పుడు, ప్రశ్నా పత్రాలు అందజేసేటప్పుడే కుప్పలు తెప్పలుగా తప్పులు దొర్లాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ ప్రశ్నా పత్రానికి బదులు... కెమిస్ట్రీ పేపరు వచ్చింది. హైదరాబాద్‌లో హిందీ మాద్యమం ముద్రించి ఇవ్వలేదు దాన్ని కూడా ఇంగ్లీషులోనే ఇచ్చారు. దాన్ని అక్కడి నిర్వాహకులు అప్పటికప్పుడు అనువదించి, చేతి రాతతో ప్రశ్నాపత్రం తయారు చేసి... పిల్లలకు అందించారు. ఈలోపు వారి విలువైన గంట సమయం వృధా అయింది. వారికి జరిగిన ఈ నష్టాన్ని ఎవరు పూడ్చగలరు...?
ఇంటర్ పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులకు సంభవించిన ఈ కష్టాల్, నష్టాల్... ఇప్పుడు ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా వారిని వెన్నాడాయంటే ఘనత వహించిన మన ఇంటర్ బోర్డుకు దండేసి దండం పెట్టాల్సిందే కదా..? విద్యార్థులకొచ్చిన మార్కులను రెండుసార్లు (డబుల్) చెక్ చేశామంటూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ నొక్కి వక్కాణించినా... అన్ని సబ్జెక్టుల్లోనూ పాసైన పిల్లలకు ఒక్క అంశంలో మాత్రం సున్నా మార్కులు రావటం ఆశ్చర్యమే కాదు... తెలంగాణలో జరిగిన మహాద్భుతమేనని చెప్పక తప్పదు. ఆంగ్లంలో 70, తెలుగులో 90, చరిత్రలో 93, రాజనీతి శాస్త్రంలో 80 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి ఆర్థిక శాస్త్రంలో గుండు సున్నా రావటం ఇక్కడ విస్మయపరిచే అంశం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థుల్లో ఏటేటా ఆందోళన రెట్టింపవుతున్నది. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైనా, ఇటు తల్లిదండ్రులు, అధ్యాపకులపైనా ఉంది. ఇదే సమయంలో 'ఫెయిలైతే అంతా అయిపోయినట్టే...' అని భావించి, ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు 'ఉందిగా సెప్టెంబరు.. మార్చిపైనా...' అని పాడుకుంటూ మరింత పట్టుదలతో, కసితో చదివి పాసై పోవాలి. అలాంటి వారు అవిభక్త కవలైన వీణా, వాణిలను ఆదర్శంగా తీసుకుని ముందడుగేయాలి. అన్నీ సక్కంగా ఉన్న వారే మానసికంగా ఎంతో కుంగిపోతున్న తరుణంలో... శరీరాలు సహకరించకపోయినా ఇంటర్లో తమ సత్తా చాటిన ఆ ఇద్దరమ్మాయిలను చూసి ఎంతో నేర్చుకోవాలి.