Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ 28 - 30 తేదీల్లో స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో కొలువు దీరిన నాటో కూటమి ఆమోదించిన తీర్మానాలు, చేసిన నిర్ణయాలు, ప్రకటనలు ప్రపంచాన్ని శాంతిగా ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్ను కూటమిలోకి చేర్చుకొని రష్యా ముంగిట మారణాయుధాలతో కొలువు తీరాలన్న దుష్టాలోచనే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు కారణం. అది కుదిరే అవకాశం కనిపించకపోవటంతో తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్, ఫిన్లాండ్కు నాటో తీర్ధం ఇచ్చేందుకు నాంది పలికింది. దీంతో ఉక్రెయిన్‌తో పాటు మరో 1,300 కిలోమీటర్ల మేర రష్యా సరిహద్దులకు నాటోను రప్పించేందుకు పూనుకున్నారు. ఈ రెండు దేశాలూ తటస్థ వేష వలువలు విలువలను తొలగించుకొని తమ నిజరూపాన్ని ప్రదర్శించాయి. రష్యాను బూచిగా చూపి అమెరికా చంకనెక్కేందుకు పూనుకున్నాయి. ఈ దేశాలలో గనుక ఆయుధాలను మోహరించి తమకు ముప్పు తలపెడితే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, దెబ్బకు దెబ్బ తీస్తామని రష్యా హెచ్చరించింది.
నాటో కూటమి 2010లో ఆమోదించిన వ్యూహాత్మక సంకల్ప పత్రంలో రష్యాను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నది. ఆ సమయంలో దానికి జి7 కూటమిలో చోటిచ్చి జి8గా మార్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అనేక ఆర్థిక సమస్యలతో ఉన్న రష్యా తమకు ఇంకేమాత్రం పోటీ కాబోదనే అంచనాతో పశ్చిమ దేశాలు తమతో పాటు కలుపుకుపోవాలని చూశాయి. కానీ తరువాత పరిస్థితులు మారటంతో దాన్ని అణగదొక్కేందుకు పూనుకున్నాయి. అదే తరువాత ఉక్రెయిన్ సంక్షోభానికి, ఇప్పుడు మరోమారు నాటో విస్తరణకు కారణం. మాడ్రిడ్ సమావేశంలో ఆమోదించిన తాజా వ్యూహాత్మక సంకల్ప పత్రంలో రష్యానుంచి తమకు ప్రత్యక్ష ముప్పు తలెత్తిందంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. 2010నాటి పత్రంలో ప్రస్తావనే లేని చైనా తమకు శత్రువు కాదంటూనే దాని నుంచి ఇప్పుడు ప్రపంచ స్థిరత్వానికి మొత్తంగానే సవాలు ఎదురైందంటూ దాడికి నాంది పలికింది. ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడలో భాగమే ఇది. దానిలో భాగంగానే తొలిసారిగా నాటో సమావేశాలకు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా నేతలను ఆహ్వానించారు. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నాటో నుంచే ప్రపంచానికి ముప్పు ఉన్నదని, తమ ప్రయోజనాలకు హాని తలపెడితే తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది. శీఘ్రదాడులకు అవసరమైన దళాలను 40వేల నుంచి వచ్చే ఏడాది నాటికి మూడు లక్షలకు పెంచాలని, వారిని ఆయుధాలను మోహరించే తూర్పు ఐరోపా దేశాలకు అందుబాటులో ఉంచాలని, పోలాండ్‌లో రెండు శాశ్వత అమెరికా సైనిక కేంద్రాల ఏర్పాటు, స్పెయిన్‌లో మరో రెండు విధ్వంసక నౌకల మోహరింపు, బ్రిటన్‌లో మరో రెండు స్క్వాడ్రన్ల ఎఫ్35ను మోహరించాలని నిర్ణయించినట్లు అమెరికా అధినేత జో బైడెన్ ప్రకటించాడు.
మాడ్రిడ్ సమావేశం రణోన్మాదంతో ఊగిపోయింది. మానవాళికి ముప్పుతెచ్చే పదేండ్ల కొత్త ప్రణాళికను ముందుకు తెచ్చింది. యుద్ధాలు వద్దు-శాంతి కావాలని కోరుతున్న ప్రపంచశాంతి శక్తులకు ఒక సవాలు విసిరింది. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా అమెరికా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్ల ధనదాహానికి ఐరోపాను బలిపెడితే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాను తన గుప్పిట్లో పెట్టుకొనేందుకు అమెరికా నాటో ఖర్చులో సింహభాగాన్ని భరించింది. ఇప్పుడు అదేమీ కుదరదు, సభ్యదేశాలు తమ జీడీపీలో రెండుశాతం కేటాయించాలని వత్తిడి తెస్తున్నది. ఇప్పటి వరకు 30కి గాను తొమ్మిది దేశాలు మాత్రమే ఆ మేరకు ఖర్చు చేస్తున్నాయి. మిలిటరీ ఖర్చును పెంచటం అంటే కార్మిక సంక్షేమానికి చేసే ఖర్చుకు కోతపెట్టటమే. ఇప్పటికే అనేక పథకాలకు కోత పెట్టారు. ఉక్రెయిన్ సంక్షోభం పేరుతో రష్యా మీద విధించిన చమురు, ఇతర ఆర్థిక ఆంక్షల పర్యవసానాలను ఐరోపా అనుభవిస్తున్నది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థలకు ఆటంకం వంటి అనేకం కనిపిస్తున్నాయి.
నాటో కూటమి ఏర్పడిన నాటికీ నేటికి ప్రపంచం ఒకేలా లేదు. గతంలో దాని దాడి ఒక్క సోవియట్ మీదనే కేంద్రీకృతం కాగా ఇప్పుడు రష్యాతో పాటు ఒకేసారి చైనాను దెబ్బతీయాలని నాటో కూటమి చూస్తున్నది. దాన్ని పసిగట్టే ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-చైనా పరిమితులు లేని భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి. రోజులు మారాయని గ్రహించకుండా రష్యా వద్ద ఉన్న ఆయుధాలను, చైనా ఆర్థిక, మిలిటరీ సత్తాను తక్కువ అంచనా వేస్తే అమెరికా కూటమికి భంగపాటు తప్పదు.