Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానమే ఒక భారాల కుంపటి కాగా, తాజాగా ప్రజలపై ముఖ్యంగా సామాన్య కుటుంబాలపై భారం పడేలా కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవడం దారుణం. చండీగఢ్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో మంగళ, బుధ వారాల్లో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలు ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దారి తీస్తాయి. ఇప్పటివరకూ పన్ను మినహాయించబడిన ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, బెల్లం, అటుకులు, మొర్మరాలు తదితర ఉత్పత్తులపై ఇకమీదట 5శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. దానికి పన్నుల హేతుబద్దీకరణ అని ముద్దుపేరు పెట్టారు. విద్యార్థులకు ఉపయోగపడే పెన్సిల్ చెక్కుకునే షార్పెనర్, అట్లాస్ సహా మ్యాప్‌లు, చార్ట్లపైనా పన్ను పెంచారు. ఇదీ మోడీ మార్కు విద్యాభివృద్ధి! ఇంధన ఆదాకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎల్ఈడీ విద్యుత్ బల్బులు, ఫిక్సర్లు, సోలార్ వాటర్ హీటర్, విద్యుత్ వాహనాలకూ పన్ను పెంచడం దారుణం. చెప్పుల పైనా పన్ను పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడంతోపాటు, ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎగిసిపడుతున్న ద్రవ్యోల్బణం జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో మరింత పెరుగుతుంది. ఆపై వడ్డీ రేట్లు, ఇతర రేట్లు పెరిగి సామాన్యుల జీవనం మరింత దుర్భరమవుతుంది. ప్రజలపైన ఇన్ని భారాలు మోపిన సర్కారు క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై 28శాతం పన్నులు వసూలు చేయాలనే ప్రతిపాదనను వాయిదా వేయడం గమనార్హం. ఆహారోత్పత్తులను, విద్యా సౌకర్యాలను మరింత ప్రియం చేసింది కానీ, జూద క్రీడలపై నిర్ణయం చేయడానికే వెనక్కు తగ్గడాన్నిబట్టి జూద క్రీడా గృహాల నిర్వాహకులకు, ఆన్లైన్ పేరిట సొమ్ము చేసుకుంటున్న వారి ప్రయోజనాలకు బీజేపీ కొమ్ము కాస్తోందని విదితమవు తోంది.
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపు అంశం ఎజెండాలో ఉన్నప్పటికీ కౌన్సిల్ ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం దుర్మార్గం. 2017 జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొత్త పన్ను విధానంలో ఐదేండ్ల పాటు రాష్ట్రాలకు ఆదాయ నష్టం జరిగితే ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలనేది జీఎస్టీ చట్ట ప్రధాన నిబంధన. ఐదేండ్లు పూర్తి అవుతుంది కనుక 2022 జులై 1 నుండి పరిహారం నిలిపివేయనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంతో కరోనా సంక్షోభ నేపథ్యంలో మరికొంత కాలం పరిహారం చెల్లింపు హామీని కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు ముక్తకంఠంతో కోరాయి. చాలా కాలంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇంత కీలకమైన ఎజెండాపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం రాష్ట్రాల హక్కులను తృణీకరించడమే! పన్ను ఆదాయం పెంచుకోలేని పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తామంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల పేరిట మోకాలడ్డుతూ, ప్రజలపై భారాలు మోపే 'సంస్కరణల'ను అమలు చేస్తేనే అదనపు అప్పును ఆనుమతిస్తామని కేంద్రం విషమ షరతులు విధిస్తోంది. బీజేపీ చెప్పే సహకార ఫెడరలిజం ఇదేనా?
జీఎస్టీ విధానం వస్తే రాష్ట్రాల సొంత ఆర్థిక వనరులకు ముప్పు ఏర్పడుతుందని తొలి నుంచీ పలువురు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా మోడీ సర్కారు మొండిగా తీసుకొచ్చింది. దాని దుష్పరిణామాలు ఇప్పటికే తేటతెల్లమయ్యాయి. ఇప్పుడు మరింత నష్టకరంగా పరిణమిస్తున్నాయి. ప్రజలపై అధిక పరోక్ష పన్నులు వేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలి. సర్కారు ఆదాయానికి సంపన్నులపై ప్రత్యక్ష పన్నులను పెంచాలి. కానీ మోడీ సర్కారు తీరు తిరకాసుగా ఉంది. సంపన్నులకు, దేశ విదేశీ కార్పొరేట్లకూ పన్ను మినహాయింపులు, రాయితీలిస్తోంది. రెండేండ్ల క్రితం 30శాతంగా ఉన్న కార్పొరేట్ టాక్స్‌ను 22శాతానికి తగ్గించడం మూలంగా కేంద్ర ఖజానా ప్రతి ఏటా లక్షన్నర కోట్ల రూపాయలు కోల్పోతోంది. కేంద్ర ప్రభుత్వ పన్ను విధాన ప్రాతిపదికలు మారాలి. సామాన్యులపై పరోక్ష పన్నులను తగ్గించాలి, సంపన్నులకు రాయితీలివ్వడం మాని ప్రత్యక్ష పన్నులు పెంచాలి. ఆ దిశగా నిర్ణయాలు తీసుకునేలా ప్రజా ఉద్యమాల ఒత్తిడి పెంచాలి.