Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉల్లిపాయ తామ స గుణాన్ని కలుగజేస్తుంది. సుగుణ సంపన్నులైన భక్తులారా! మానవ స్వభావాన్ని మరింత దయామయంగా మలుచుకోవటానికి ఆహారంలో వీటిని తీసుకోగూడదు.'' అని నొక్కి వక్కాణించిన భాగవతార్ గారి ప్రవచనాన్ని వారి సతీమణీ చెవులు రిక్కించి మరీ వినింది. రాత్రి భోజనంలో వుల్లిని నిషేధించి పాకం తయారుచేసింది. భాగవతార్ల వారు ఆశ్చర్యంగా ''ఏమిటీవంటకం? ఏదీ ఉల్లి?'' అంటూ నిలేసాడు సతిని. అయ్యో మీరు చెప్పిన మాటే విన్నా మహాశయా! అని అనగానే, ప్రవచనాలు ఎన్నో చెబుతాను. అవి వాళ్లకి కదా! పిచ్చిదానా అని మండిపడ్డాడు మహాపండితుడు. ఈ కథను ఎప్పటి నుండో వింటున్నాము. కానీ వర్తమాన ప్రపంచ వేదికలపైనా ఇప్పటికీ ఇదే కొనసాగటం కొంత అబ్బురపరుస్తుంది. అడవిలో క్రూర మృగాలు సమావేశమై శాంతిని కాపాడటం, అహింస, హక్కుల గురించి చర్చ చేయటమనే పంచతంత్ర కథలూ గుర్తుకొస్తున్నాయి నేడు.
'చెప్పేవి శ్రీరంగనీతులు... చేసే పనులు నీతి భాహ్యమైన పనులూ' వంటి సామెతలు మనకు కోకొల్లలున్నాయి. 'ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అని స్పష్టంగానే కవులు పాడుకున్నారు కూడా. అలాంటి నీతుల వళ్లింపులు మ్యూనిచ్ మహావేదికగా జి-7 దేశాల సదస్సులో సాక్షాత్తూ మన అధినేత భావప్రకటనా స్వేచ్ఛ ఒప్పందంపై సంతకం చేసి మరీ ఉద్ఘాటించారు మన హరిదాసులవారిలాగానే. సదస్సు వేదికపై నుండి స్వేచ్ఛా పావురాన్ని ఎగరేశారు. ఆ సంతకం తడి కొనసాగుతుండగానే మన దేశంలో ఫాక్ట్ చెకింగ్ వెబ్ సైట్, ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు, మహ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసుకు చెందిన స్పెషల్ సెల్ అరెస్టు చేసి నిర్బంధించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు వ్రాక్కుచ్చారు కూడా. మాటలకు చేతలకు ఉన్న వైరుధ్య భావాన్ని ఇంతకంటే ఏ ఉదాహరణలు వివరించగలవు!
ఆన్లైన్, ఆఫ్‌లైన్ వేదికల్లో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడ టానికి భాగస్వామ్య దేశాలన్నీ కలిసి కృషి చేస్తాయని, ఇంటర్నెట్ ప్రపంచాన్ని మరింత స్వేచ్ఛగా, విశ్వసనీయంగా, భద్రమైన ప్రదేశంగా మార్చుతామని, జి-7 దేశాలు ఆ ప్రకటనలో పేర్కొనటాన్ని జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో రోజు రోజుకీ భావప్రకటనా స్వేచ్ఛపై మోపుతున్న ఉక్కుపాదం ఎవరి స్వేచ్ఛకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఈ స్వేచ్ఛా ప్రకటన పరంపరలోనే దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే, చట్టం పరిధిలోనే న్యాయం కోసం పోరాడుతున్న ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి ప్రముఖ జర్నలిస్టు తీస్తా సెతల్వాద్‌ను కక్షపూరితంగా జైలులో పెట్టారు. అంతేకాదు గుజరాత్లో జరిగిన నరమేధానికి కారకుల వివరాలను బయటపెట్టారనే కారణంగా ఐ.పి.ఎస్. అధికారులు ఆర్.బి. శ్రీకుమార్, అంతకుముందే సంజరుభట్నూ జైల్లో వేసి తమ అసలు స్వరూపాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడే వారినీ, భావప్రకటనా స్వేచ్ఛను వినియోగిస్తున్నవారినీ ఏదో ఒక సాకుచూపి నిర్బంధించడం ఈ నీతి ప్రవచనకారుల క్రూరమైన ఆచరణగా మారింది.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటో నియోగుటెరస్ కూడా ఈ నిర్బంధ చర్యలను ఖండించారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు, తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది అన్నారాయన. ఎలాంటి భయం లేకుండా తమ పని చేసుకునే స్వాతంత్య్రం జర్నలిస్టులకు ఉండాలనీ వారు ఆకాంక్షించారు. నోబెల్ బహుమతి గ్రహీత పిలిప్పీన్స్ జర్నలిస్టు మరియోరెస్సా, సెతల్వాద్, జుబేర్ నిర్బంధాన్ని వ్యతిరేకించారు. ప్రపంచంలోని పాత్రికేయలోకమంత భారత ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నది. అంతెందుకు మనదేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రశ్నించడం, నిలదీయడమే జర్నలిజమని బల్లగుద్ది చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రశ్నను సహించలేక నిర్భంధానికి పూనుకొంటున్నది.
భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది దేశంలో నశించిపోయింది. ప్రభుత్వానికి కానీ, అధినేతలకు కానీ వ్యతిరేకంగా రాసినా, పనిచేసినా, మాట్లాడినా ఏదో ఒక కేసును చూపి నిర్బంధించటం, వేధించటం నిత్యకృత్యమైపోయింది. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే, మత విద్వేషాలు పెంచి విభజించే ఉన్మాదులకు మాత్రం రక్షణ కల్పించి కాపాడటం మరోవైపు మనంచూస్తున్నాము. ఈ రకమైన ద్వంద్వనీతిని నిలదీయాలి. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామిక భావాన్నే వ్యతిరేకించడం. నియంతృత్వ పోకడకు ఇది నిదర్శనం. ఇది కేవలం పత్రికలకు, పాత్రికేయులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల భావాలకు అద్దం పట్టే పత్రికల స్వేచ్ఛ ప్రజలందరిదీ. దీనిని కాపాడుకోవటం మనందరి బాధ్యత.