Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రమంతా తడిలో తల్లడిల్లుతోంది. గత వారం రోజులుగా విడవకుండా అలుముకున్న ముసురుతో ప్రజల కష్టాలూ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తుండటంతో వరదల ప్రమాదాలూ ఎదురుకావచ్చని ప్రజలు భయపడుతున్నారు. ఒకవైపు కరోనా విజంభిస్తూనే ఉంది. దానికి తోడు ఇప్పుడు ముసురు అలజడి. వానాకాలం వచ్చిందంటే పారిశుధ్య సమస్యలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలడం ఏటా సర్వసాధారణమే అయినా... ప్రభుత్వాలు మాత్రం ముందస్తు చర్యలు తీసుకొవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మహానగరాల్లోని మురికి వాడల్లో, లోతట్టు ప్రదేశాల్లో సీజనల్ వ్యాధులు పునరావృతమవుతూనే ఉన్నాయి. కాబట్టి జర పైలంగుండాలి!
వర్షాలు ముమ్మరించి సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు జోరందుకుంటున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ వర్షాలకు కలుషితమైన నీటినే ప్రజలు తాగడంతో వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. గత వారం రోజులగా బస్తీదవాఖానలు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఇలా ఒకటేమిటి అన్ని దవాఖానలు మలేరియా, డెంగ్యూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో నాలాల విస్తరణ పనులు నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడపడితే అక్కడ గుంతలు త్వవి వదిలేశారు. ఎక్కడ చూసినా మురుగు నీరు నిలవడంతో వాటిలో దోమలు, ఈగలు చేరి పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఇండ్ల మధ్యనే మురుగు నీరు చేరి చెత్తకుప్పలతో దుర్వాసన కొడుతోంది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఓ వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంటే.. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. కొవిడ్‌ను, సాధారణ విషజ్వరాలను వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఈ విషయంలో వైద్యులతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాల్సిన అవనరం ఉంది.
దోమకాటు ద్వారా సంభవించే మలేరియా, డెంగ్యూ, చికున్ గన్యా వ్యాధులు భారత్‌లోనే అధికం. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని మొత్తం డెంగ్యూ కేసుల్లో 34శాతం, మలేరియా కేసుల్లో 11శాతం ఇండియాలోనే నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో లక్షలాది మంది ప్రజలు కలుషిత నీటిని తాగడంవల్ల ప్రాణాలు కొల్పొతున్నారని తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలవుతున్నా, నేటికీ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీటికి సైతం నోచుకోని ఆవాసాలు, ప్రాంతాలు, మురికివాడలు ఇలాంటి సీజనల్ వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి. ఇప్పటికే మన్యం జ్వరంతో మంచం పట్టింది. ప్రభుత్వాలు ఏటా ప్రజారోగ్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలోని దుర్భర పరిస్థితులు వ్యవస్థాగత లోపాలను కండ్లకు కడుతున్నాయి. తరచూ తలెత్తుతున్న సీజనల్ వ్యాధుల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించింది. వీటి నివారణకు అవగాహణ, నిర్ధారణ, చికిత్స అనే మూడంచెల వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించడాన్ని స్వాగతించాల్సిందే. దీని ఆచరణ ఎలా ఉంటుందన్నది మాత్రం వేచిచూడాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పినట్టు తక్షణం చర్యలు తీసుకోకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే విషజ్వరాలు కరోనా కంటే ఎక్కువ మందిని బలితీసుకుంటాయి. ఆ ప్రాంతాలలో ముందు కావాల్సిన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు పూనుకోవాలి. కరోనా యేతర వ్యాధులకు వైద్య సదుపాయాన్ని పెంచుకోవాల్సి ఉంది. మందులు, సిబ్బందిని ముందుగా సమాయిత్తపరచుకోవాలి.
ప్రజలు అధికంగా రక్షిత మంచినీరు లేకనే అనేక రోగాల బారినపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత మంచినీళ్ళు అందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలి. నిరవధికంగా కురిసే వర్షాల కారణంగా వీధులు, డ్రయినేజీలు చెత్తాచెదారాలతో కాలుష్యాన్ని పెంచుతున్నాయి. దోమలు, ఈగల నివారణకు కూడా చర్యలు చేపట్టాలి. పారిశుద్ధ్య పనులను చేపట్టి కాలుష్యాలను నిరోధించాలి. ఇప్పటికైనా ఈ సమస్యలపై దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటేనే వర్షాకాలంలో ప్రజలను ఆదుకోగలుగుతాము. లేదంటే వ్యాధులతో బాధలతో ప్రజలు తల్లడిల్లుతారు.