Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)తో పాటు తెలంగాణలో (పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) శాంతియుతంగా వ్యాపారం నడుస్తోందని 'పుత్రరత్నం' చెప్పుకోవడం చూస్తే కళేబరాల్ని ఎప్పటికీ బీరువాలో నొక్కేయగలుగుతామన్న ఆత్మవిశ్వాసం ఉన్నట్లుంది. నెలల తరబడి జీతాలందక జీవితాలు దిగజారుతుంటే ఆత్మహత్యలకు తెగబడుతున్నారు కార్మికులు. గాడాంధకారంలోనే వారి జీవితాలుంటున్నాయి. తమ చుట్టూ కనపడే సంపద రాసులకై జీవితకాలం పరిగెత్తినా అవి అందనంత దూరంలోనే ఉంటున్నాయి. ఇటువంటి కోట్లాది మందికి మండే నెగుళ్లు, కాలే శవాలు, ఏడ్చే మొహాలు తప్ప పాలకులు చూపించే ఇంద్ర ధనస్సులు కనపడవు.
రాజులు, యువరాజులకు అటువైపు నుండే కనపడుతుంది. పుష్కరకాలం వేతన సవరణ జరగకపోతే షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల బతుకులు ఆగమైన తీరు అనుభవించేవారికేగా తెలిసేది. కనీస వేతనాలు పెంచాలన్న ''కమిటి'' ప్రతిపాదనలను ముఖ్యమంత్రే తొక్కిపట్టింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగమే. తెలంగాణ టాప్‌లో ఉందని మంత్రిగారు అతిశయంతో తుళ్లిపడటానికి అదీ ఒక కారణం. ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేసే మధ్యాహ్న భోజన పథకం, ఆశా, అంగన్వాడీ వంటి ఎన్నో రంగాల స్కీమ్ వర్కర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించరు. పుస్తెలు తాకట్టుపెట్టి వంట వండి పెడుతున్న మధ్యాహ్న భోజన మహిళలున్నారని మంత్రిగారికి తెలుసో తెలీదో!? ఇటీవల నల్లగొండ జిల్లాలో ఒక పాఠశాలలో పనిచేసే ఈ మహిళలకు ఉద్దెరిచ్చేవాడు లేక పనే బంద్‌పెట్టారు. ఆ తరువాత పంతుళ్లే నాలుగురోజులు వండిన వార్తలు, పత్రికల్లో గుప్పుమన్నాయి. వాళ్ళూ ఆపేసిన తర్వాత టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకోగలిగిన పిల్లలు కొందరుంటే, ఆ స్తోమతాలేని వారి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే చదువులు బంద్ పెట్టి ఇళ్లకి పరుగులు పెట్టరా? 1999 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) మనలాంటి ఎన్నో వెనకబడ్డ దేశాల్లో బడి ఈడుపిల్లలు మెకానిక్ షెడ్లలో, గొడ్లు కాస్తూ బతుకు వెళ్ళదీయడాన్ని వెంటనే ఆపి పాఠశాలదారి పట్టించాలంటే మధ్యాహ్న భోజనం వంటి స్కీమ్‌లు పెట్టాలనుకున్నారు. అంతేగాని ఇస్కాన్ సముద్ధరణ కోసం కాదన్న విషయం త్రిభాషా ప్రవీణులవారు అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాలు ఆవిరికాగా వాటినీ 'ఓట్లు' రాల్చుకునే సాధనాలుగా మలుచుకోవడం సబబేనా?
పెట్టుబడులొచ్చేస్తున్నాయని అనేక పార్టీలు జబ్బలు చరుచు కుంటున్నాయి. దాని కోసం రాయితీలిచ్చేస్తున్నాయి. కార్మిక చట్టాలు దాదాపు లేకుండా చేస్తున్నాయి పాలకపార్టీలు. మనలాంటి దేశాల్లో పెట్టుబడిపెట్టి చౌకగా లభ్యమయ్యే శ్రమశక్తిని కొల్లగొట్టాలనుకున్నా వారి సరుకుల్ని అమ్ముకునే మార్కెట్ ఉండాలికదా!? అదిలేకే నేడు మాంద్యం ప్రపంచ పెట్టుబడిదారీ విధానాన్ని వెన్నంటే నడు స్తోంది. అందుకే నాడు ప్రణబ్‌దా నుండి అరుణ్‌జైట్లీ మీదుగా నేటి నిర్మలమ్మ వరకు ఆర్థికమంత్రులు, మన్మోహన్ వంటి ఆర్థికవేత్తలు 'కమ్' రాజకీయ నేతలైనా, ఫక్తు ఆరెస్సెస్ మానసపుత్రుడు మోడీ అయినా ఎవరెన్ని మాటలు చెప్పినా వచ్చిన పరిశ్రమలూ తక్కువ, వాటివల్ల దొరికిన కొలువులు లేవు.
ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు 'తయారీ' ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను చూడాలి. 2014లో 142 నుండి 2022 నాటికి మన దేశ ర్యాంకు 63కి ఎగబాకింది. దీన్ని 50కి చేర్చాలని మోడీ సాబ్ పంతమట! అందుకే చట్టాలన్నీ దున్నివేయబడుతున్నాయి. ఇప్పుడు కేటీఆర్ కథాకథనాలను పరిశీలిస్తే పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలుచేసేటప్పుడు అందులో పనిచేసే కార్మికులు యంత్రాలు కాదు మనుషులనే ఆలోచన ఉందా? ఏ పరిశ్రమా ఈ ఎనిమిదేండ్లలో లాకౌట్ చేయలేదని ఘనంగా అదీ పెట్టుబడిదార్ల మీటింగ్‌లో జబ్బలు చరుచుకుని చప్పట్లు కొట్టించుకోవడం కాదుసార్! వాస్తవాలు తెలుసుకోండి. జీతాలు పెంచమని అడిగినందుకు యాదాద్రిజిల్లాలో అడిగిన నాయకులందర్నీ లే ఆఫ్ చేసి కాళ్లు పట్టుకునేలా చేసిన యాజమాన్యం గురించి సారుకు తెలియదా? వేతనాలు పెంచమంటే తొలగిస్తున్నాయి ఎన్నో యాజమాన్యాలు. యూనియన్ను రద్దుచేసుకుంటేనే వేతనాలు పెంచుతామనే యాజమాన్యాలు ఈ ''బంగారు తెలంగాణ'' నిండా ఉన్నాయి. నెలల తరబడి వేతనాలివ్వకుండా చేపల్ని బండకేసి రాకినట్లు రాకుతున్న యాజమాన్యాలు నిర్భీతిగా ఇక్కడ సంచరిస్తున్నాయి.
మోడీసాబ్ కార్మికకోడ్‌లు అమల్లోకి తేకముందే తెలంగాణ రాజధాని చుట్టూవున్న పారిశ్రామిక వాడల్లో 12 గంటల పనిదినం విస్తారంగా అమల్లో ఉంది. యంత్రానికైనా మధ్యమధ్య కందెనేసే పెట్టుబడిదారులకు కార్మికులకింత కూడుపెట్టాలనే ఆలోచన కూడలేదు. పైకి లేచే తలల్ని డైనోజర్ యాజమాన్యాలు అణిచివేస్తున్నాయి. అది ప్రశాంతత కాదు. ఇది జురాసిక్ పార్క్కాదు. మత్తగజాల్ని బంధించగలశక్తి కార్మికులకుంది. బలవంతమైన సర్పాలే అధికారానికి దారులుపరుస్తాయని భ్రమపడవద్దు. చలిచీమలు ఏమి చేయగలవో రావిశాస్త్రి పిపీలకాన్నడగండి.