Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి నెలలో ప్రారంభమైన శ్రీలంక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఇంతకాలం రాజీనామా చేసేందుకు తిరస్కరించిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక నివాసం నుంచి పారిపోయాడు. శుక్రవారం రాత్రి నుంచి మిలటరీ కాపలాలో గుర్తు తెలియని చోట తలదాచుకుంటున్నాడు. మే నెలలో పదవికి రాజీనామా చేసిన మాజీ ప్రధాని మహిందరాజపక్స అప్పటి నుంచి నౌకాదళ కాపలాలో కాలంగడుపుతున్న సంగతి తెలిసిందే. బుధవారంనాడు రాజీనామా చేస్తానని గొటబయ వర్తమానం పంపాడు. శనివారం నుంచి అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అక్కడే తిష్టవేశారు. రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని నిరసనకారులు దగ్దం చేశారు. ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసేందుకు నిర్ణయించింది. లంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు, ప్రధాని లేనపుడు పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్తగా ఎన్నికలు నిర్వహించటం మినహా మరొక మార్గంలేని స్థితిలో అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండేది ఊహించలేం. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాల గురించి మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. రాజపక్స సోదరులు, ఇతర కుటుంబసభ్యుల పాలన, అవినీతే దీనంతటికీ మూలమని కొందరు సూత్రీకరించారు. రాజకీయ నేతల అవినీతి, అక్రమాలు, కుటుంబపాలన ఒక వాస్తవం. కానీ ఆర్థిక సంక్షోభాలకు అసలు కారణాలు పాలకవర్గం అనుసరించే విధానాలే. శ్రీలంక మాదిరి దివాలా, ఆర్థిక దిగజారుడు చరిత్రలో అనేక దేశాల్లో జరిగింది. ఆ దేశాల్లో ఎక్కడా లంక మాదిరి కుటుంబ పాలనలేదు.
అప్పులిచ్చిన చైనా లంకను ఊబిలో దింపిందన్నది ఒక ఆరోపణ. 1960 దశకం తరువాత అనేక దేశాలు రుణ ఊబిలో పడి దివాలా తీశాయి. వాటికి అప్పులిచ్చింది చైనా కాదు, మరెందుకు అవి సంక్షోభాల్లో పడినట్లు? లంక విదేశీ అప్పులో చైనా రుణమే ఎక్కువ అన్నది ఒక వక్రీకరణ. చైనా కంటే ఎక్కువ మొత్తాన్ని జపాన్ ఇచ్చింది. లంక రుణాల్లో పదిశాతమే చైనా ఇచ్చింది అన్నది ఒక సమాచారం, కాదు 19.5శాతం అన్నది మరొక కథనం. పోనీ దీన్ని పరిగణనలోకి తీసుకున్నా మిగతా 80శాతం రుణాలు ఇచ్చింది ఇతర దేశాలూ, సంస్థలే కదా... సంక్షోభానికి వాటి బాధ్యత లేదా? లాటిన్ అమెరికా, మరికొన్ని చోట్ల ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, అమెరికా, ఐరోపా దేశాలు, అనేక ఆర్థిక సంస్థలు వివిధ దేశాలకు రుణాలిచ్చాయి. అవి దివాలా తీసినప్పుడు సదరు దేశాలు, సంస్థలను వేలెత్తి చూపలేదు. లంక అంశంలో చైనాను బూచిగా ఎందుకు చూపుతున్నట్లు?
ఉగ్రవాదంతో దశాబ్దాల పాటు అస్థిరత ఏర్పడిన లంకలో ఎప్పుడేం జరుగుతుందో, మన పెట్టుబడులకు హామీ ఉంటుందో ఉండదో అని మన దేశంతో సహా పెద్ద దేశాలేవీ ముందుకు రానప్పుడు చైనా చొరవ చూపింది. దానికి గాను ఐఎంఎఫ్, ప్రపంచబాంకు మాదిరి ఎలాంటి షరతులు విధించలేదు. నిజంగా విధించి ఉంటే మన దేశంలో మాదిరి పెట్రోలు, డీజిలు, గాస్ మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేసి, పన్నులను బాది ఉండేవారు. తక్కువ ధరలకు ఇచ్చేవారు కాదు. 2019లో అధికారానికి వచ్చిన గొటబయ ప్రకటించిన పన్నుల రాయితీ కారణంగా పన్ను చెల్లించే ధనికుల సంఖ్య 15 నుంచి నాలుగు లక్షలకు తగ్గింది. వాట్ 15 నుంచి 8శాతానికి తగ్గించాడు, మరో ఏడు పన్నులను రద్దు చేశాడు. వాటిలో ఒకటి దేశ పునర్నిర్మాణానికి కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్న రెండు శాతం పన్ను. పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని నిలిపివేశాడు. ఇవి చైనా విధించిన షరతులు కాదు. 2018లో టూరిజం ద్వారా 440కోట్ల డాలర్లు రాగా 2021నాటికి 40కోట్లకు పడిపోయింది. ఇలాగే వివిధ ప్రాజక్టుల మీద ఆశించిన రాబడి కూడా రాలేదు. ఇలా విధానపరమైన తప్పిదాలు, బయటి కారణాలు జమిలిగా లంకను దెబ్బతీశాయి.
వర్తమాన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా, ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకొనేందుకు లంక నిర్ణయించింది. ఐఎంఎఫ్, అమెరికా, ఇతర సంస్థలను సంతుష్టీకరించేందుకు, విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే లంక సర్కార్ కొన్ని చర్యలను ప్రకటించింది. జూన్ ఒకటి నుంచి వాట్ను ఎనిమిది నుంచి పన్నెండుశాతానికి, కార్పొరేట్ పన్ను 24 నుంచి 30శాతానికి పెంపు, అక్టోబరు ఒకటి నుంచి ఆదాయపన్ను మినహాయింపు 30లక్షల నుంచి 18లక్షలకు కుదింపు, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పన్ను రాయితీల రద్దు, మరికొన్ని పన్నులను ఇప్పుడున్న 6-18శాతాన్ని 4-32శాతానికి పెంపు వంటివి వాటిలో ఉన్నాయి. ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఇవన్నీ సవాళ్లే, కొత్త సమస్యలే.