Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థితి, గతి అనే రెండు మాటల్ని తత్వశాస్త్రంలో విస్తృతంగా వాడతారనే మాట నిజమే. కాని నిజ జీవితంలో ఆ రెండు మాటలకు ఎంతో విలువ ఉంది. అవి వాస్తవానికి సంబంధించినవి. మాటల మాంత్రికుడు భారత ప్రధాని. దేన్నైనా అటు తిప్పి ఇటు తిప్పి కాంగ్రెస్‌పై, అది చచ్చిన పామే అయినా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరోదెబ్బ కొడుతూనే ఉంటారు. ఏ అవకాశాన్నీ ఆయన జారవిడుచుకోరు. భారతదేశంలో వీరందరి దృష్టిలో 'సంస్కరణల' ప్రారంభకుడిగా ఈమధ్యనే కేసీఆర్ పీవీని ఆకాశానికెత్తితే మోడీ తందానంటూ వంతపాడిన సంగతి మరీ అంత పాతదేంకాదు జనం మర్చిపోవడానికి! వీరంతా కలిసి పీవీతో పాటు డాక్టర్ మన్మోహన్సింగ్ను కూడా కలిపి భయానక ''సంక్షోభం'' నుండి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడిన ''విముక్తి'' ప్రదాతగా కీర్తించలేదా? మన్మోహన్సింగ్ అప్పటికప్పుడు ఐఎంఎఫ్ నుండి దిగుమతి చేసుకున్న ఆర్థికవేత్తే కదా!? మెల్లిగా మనదేశం ఐఎంఎఫ్ వొళ్లో ఒదిగిపోయింది ఆనాటి నుండేగా!
మొన్న అరుణ్‌జైట్లీ గారి వర్థంతి సభలో మోడీ మహాశయుడు, కాంగ్రెస్ పేరు చెప్పకుండానే, గతంలో ''విధిలేక'' షరతులు ఆమోదిస్తే, అంటే ఆ విధానాలను అమలు చేస్తే తాము ''గతి మార్చాలని'' ఆ విధానాలనే ఉధృతంగా అమలు చేస్తున్నామని సెలవిచ్చారు. గుజరాతీ భాషలో దాన్నేమంటారో గానీ, తెలుగులో మాత్రం ''పళ్లూడగొట్టుకోడానికి ఏరాయయితేనేమి'?! అంటారు. అనేక మంది మేధావులు, వామపక్షాలు, కార్మిక సంఘాలు దేనిగురించైతే భయపడ్డారో, ఏవి జరుగుతాయని మొత్తుకున్నారో అవేకదా నేడు ఒక్కొక్కటిగా తెలియవచ్చేవి? ఇది సుమతీ శతక కాలం కాదు. ఇక్కడ అప్పిచ్చేవాడు 'వైద్యుడు' కాదు. తలారి! బీజేపీ పాలనలో యజ్ఞయాగాదులు చేస్తున్నది ఈ తలార్లే! ఆరేడు దశాబ్దాలపాటు భారతీయుల రక్తమాంసాలతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను 'హవిస్సు'తో కలిపి యాగాగ్ని కీలలకు ఆహుతిస్తున్నదీ ఈ 'తలార్లే!' ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల మానస పుత్రులు వీరు. ప్లాసీయుద్ధం మొదలు వందేండ్లు ఎన్నో యుద్ధాలు చేసి, ఎంతో రక్తమోడ్చిన తర్వాత 1858లో యావత్ భారతదేశం ఇంగ్లీషోడి పాలన కిందకెళ్లింది. కానీ, ఇప్పుడీ పెట్టుబడి మానసపుత్రులు ఓ వందమందిని పురమాయిస్తే చాలు... కావాలనుకున్న రిపోర్టులు, కావాల్సిన రూపంలో, కావాల్సిన సమయంలో ప్రభుత్వాల చేతిలో ఉంటున్నాయి. ప్రభుత్వరంగ భవిష్యత్ అంతటినీ తేల్చేసిన డాక్టర్ అర్జున్‌సేన్ గుప్తా నివేదిక సరిగ్గా మూడునెలల్లో పూర్తి అయ్యిందన్న మాట ఇక్కడ గమనార్హం. సారాంశమేమంటే... గుప్పెడు మంది బ్యూరోక్రాట్లు చుక్క నెత్తురు చిందకుండానే భారత ఆర్థిక స్వాతంత్య్రాన్ని చుట్టచుట్టి బంగారుపళ్లెంలో పెట్టి సామ్రాజ్యవాదుల నోటికందిస్తున్నారు. ఈ విషయాన్ని 90వ దశకం చివర్లోనే ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ స్పష్టం చేశారు.
మోడీ బృందం పాలనా సీజనొచ్చే సరికి పెట్టుబడిదారీ విధానం ప్రపంచంలోనూ, మనదేశంలోనూ సంక్షోభంలో కూరుకుపోయింది. దానినుండి బయటపడటానికి కార్మికులపై దాడి పెంచింది. అన్ని దేశాల్లో జరిగే పోరాటాలూ తమ జీతాలపైనా, సాంఘిక సంక్షేమ చర్యల కత్తిరింపుపైనా జరుగుతున్నవే. తాము పోరాడి సాధించుకున్న హక్కుల రక్షణ కోసం సాగేవే! పెట్టుబడిదాడి ఏకపక్షం కాదు. కార్మికులు నోరువాయిలేని జంతువులు కాదు. ప్రతిఘటిస్తున్నారు. భూగోళమంతా ఇవి నేడు కనపడతాయి. దానిలో భాగమే మనదేశంలో జరిగే దాడి - ప్రతిఘటన. ప్రభుత్వ సంస్థల్లోనే డి.ఎ. చెల్లింపుపై ఆంక్షలొచ్చాయి. వేతనాల ఒప్పందాలు జరగడం లేదు. అనేక ప్రయివేటు పరిశ్రమల్లో వేతనాల్లో కోతలు సర్వసాధారణం. కార్మికుల సగటు నెలసరి ఆదాయాలు తగ్గిపోయాయి. కార్మికుల సామాజిక భద్రతపై దాడి పెరిగింది. ఈపీఎఫ్‌పై చెల్లించే వడ్డీరేటు ఎప్పటికన్నా కనిష్టానికి చేరింది. ఆశ్చర్యమేమంటే... ఇవన్నీ మోడీ సర్కార్ ఇష్టపూర్వకంగా, ''గతిమార్చాలని'' చేస్తున్నవేననే మాటల మాంత్రికుడి వ్యాఖ్యలు పరమ సత్యాలు.
కార్పొరేట్లకు అనుకూలంగా సాగేపాలనలో నలిగిపోతున్నదీ, చితికిపోతున్నదీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి చూపుతున్న ఈ ఎంఎస్ఎంఈలు దెబ్బతినడంతో నిరుద్యోగం అలివిగాని స్థితికి చేరింది. మోడీ సాబ్ మారుస్తున్న ''గతి''లో ఇవీ ఉన్నాయి. ఈ విధానాల ఫలితమే నేడు ధరలు ఆకాశాన్నంటాయి. రూపాయి డాలర్‌తో మారకం పాతాళంలో ఉంది. ఈ విధానాల పరాకాష్ట నేడు శ్రీలంకలో చూస్తున్నాం. గతంలో అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో చూశాం. మీరు ఇష్టపూర్వకంగా మార్చిన ''గతి'' స్థితి ప్రపంచంలో ఇలానే అఘోరిస్తుంది.