Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దొంగలున్నారు జాగ్రత్త... చుట్టాలొస్తున్నారు జాగ్రత్త... అనే సినిమా టైటిళ్లను గతంలో మనం విన్నాం. ఇప్పుడు వాటి సరసకు దోమలొస్తున్నాయి జాగ్రత్త.. వ్యాధులొస్తున్నాయ్ జాగ్రత్త అని రాసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల ఇంటా బయటా ఎక్కడ చూసినా ఒకటే నీరు. చిన్న చిన్న వీధుల నుంచి మెయిన్ రోడ్ల దాకా అన్నీ వర్షం దెబ్బకు నానిపోయి ఉన్నాయి. మొదటి రెండు రోజుల వాన నీరు భూమిలోకి ఇంకిపోగా, ఆ తర్వాత నీరు వరదలా, కాలువల్లా గల్లీల వెంట పారింది. ఇప్పుడు ఆ దశ కూడా అయిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నది. ఇదే అదునుగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో డెంగీ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయంటూ ప్రజారోగ్య సంచాలకులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నీరు కలుషితమవుతున్న కారణంగా టైఫాయిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయంటూ ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన డెంగీ కేసుల సంఖ్య 1,184. గతంతో పోలిస్తే ఈ సంఖ్య భారీగా పెరగటం గమనార్హం.
వీటితోపాటు మలేరియా కేసులు సైతం పెరిగే ప్రమాదం పొంచి ఉందంటూ వైద్యాధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుందనే విషయం మనకెరుకే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా 24.10కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. వాటిలో మన దేశానికి చెందిన కేసులే 83 శాతంగా ఉండటం విస్తుగొలిపే అంశం. ఆ ఏడాది అన్ని దేశాల్లో కలిసి మొత్తం 6,27,000 మంది మలేరియాతో మరణించారంటే దాని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పూర్వాపరాల నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీ వానాకాలంలోనూ అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దోమల నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాల అమల్లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తున్నారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. గతంలో నివాస ప్రాంతాలతోపాటు ఆఫీసులు, కార్యాలయాల ప్రాంగణాల్లో మున్సిపాల్టీ సిబ్బంది ఫాగింగ్ నిర్వహించేవారు. ఇప్పుడది మచ్చుకు కూడా కానరావటం లేదు. ఇండ్లూ, ఆఫీసుల పైభాగాలు, వాటి పైకప్పుల మీద నిలిచి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు పారబోయటం, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నాఫ్తాలిన్ బిళ్లలు వేయటం, కిరోసిన్‌ను పిచికారీ చేయటం లాంటి చర్యలు ఇప్పుడు చూద్దామన్నా కానరావటం లేదు. సంబంధిత అంశాలపై ఇటు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ గానీ, అటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గానీ ఎక్కడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయటం లేదు. దోమల బారి నుంచి కాపాడుకునేందుకు వీలుగా గతంలో మారుమూల పల్లెటూళ్లు, గిరిజన ప్రాంతాల్లో రసాయన పూత పూసిన దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసేది. ఇప్పుడు వాటి ఉనికిగానీ, ఊసుగానీ లేకపోవటం సర్కారు వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
ఇప్పుడు వానలు తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇవి తగ్గిన తర్వాత అసలు కత మొదలవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు కురిసి, ఆగిపోయిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోతుంది. వాటిలో నీరు నిల్వ ఉన్న చోట దోమలు మళ్లీ గుడ్లు పెడతాయి. పేరుకుపోయిన బురద వల్ల అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. మురికి నీటిని శుద్ధి చేయకుండా తాగితే డయేరియా సోకుతాయి. ప్రజలు ఇలాంటి విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి చికిత్స కంటే నివారణే ప్రధానం అనే సూత్రాన్ని ఒంటబట్టించుకుని మన ఒంటినీ, ఇంటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇదే సమయంలో ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ... ప్రాణాంతక జబ్బుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, గిరిజన గూడేలు, ఆదివాసీ పల్లెల్లో యుద్ధ ప్రాతిపదికన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. అందుకనుగుణంగా కార్యాచరణను ప్రకటించాలి. గతంలో డెంగీ కేసులు అధికమైనప్పుడు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల్ని జలగల్లా పీల్చి పిప్పిచేశాయి. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీకి చికిత్స అందే విధంగా సకల సదుపాయాలను సమకూర్చాలి. విధిగా ఆ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలి.