Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాల రాకతో వ్యవసాయ సీజన్ మొదలవుతుందో లేదో.. అటవీ అధికారులు, పోడు సాగుదారులకు తగాదాలు తలెత్తడం తెలంగాణలో రివాజుగా మారింది. ఆ భూముల్లో పంటలు వేసుకుంటామంటూ పోడు రైతులు... కుదరదని అటవీ అధికారులు... మధ్య నిత్యం రణరంగమే. జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పోడు భూములకై పోరాడుతున్న ఆదివాసీ మహిళలపై లాఠీలు విచక్షణరహితంగా విరుచుకుపడ్డాయి. కోయపోషగూడెంలో 20ఏండ్లుగా సాగుచేస్తున్న భూములలో వారు వేసుకున్న గుడిసెలను కూల్చీ, తమను తరిమివేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి వాళ్లేమి సామాన్యులు కారు. వాళ్లు సాయుధ పోరాటపు వారసులు. ఆనాటి స్ఫూర్తితోనే ఆ మహిళలు ప్రతి ఘటించారు. తిరగబడ్డారు. దానిని సహించలేని ఖాకీలు వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. ఇలా ప్రశ్నించిన వారందర్ని దుర్మార్గంగా జైళ్లకు పంపుతూ పోతుంటే పోడు సమస్యకు పరిష్కారమెప్పుడు? రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం అమలుకు నోచుకునేదెన్నడు?
2019 జూలై 19న స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా 'గిరిజన ప్రాంతంలో పోడు భూముల, అటవీ భూముల సమస్య ఎక్కడ ఉందో అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించి స్వయంగా నేనే కుర్చీ వేసుకుని సమస్య పరిష్కారం చేసి రైతుబంధు ఇప్పిస్తాను' అని చెప్పారు. మూడేండ్లుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఒక్క ఎకరా అటవీ భూమికీ పట్టాలు ఇవ్వకపోగా, గిరిజనులపై అధికారులు దాడులు చేయడం, వారిని హింసించడం, వారి పంటలను ధ్వంసం చేయడం, వారి ఇండ్లను కూల్చడం అధికమయ్యాయి. గిరిజనుల పక్షాన చట్టాలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోగా, అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతమైన 14జిల్లాల్లో గిరిజనులు అధికంగా అటవీ భూమిని సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఏడు నెలల కింద లక్షలాది మంది పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. తాజాగా అటవీ అధికారుల ద్వారా రైతులపై తప్పుడు కేసులకు తెగబడుతోంది. 30, 40ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను దున్నేందుకు వెళ్తున్న రైతులపైనా కొత్తగా చెట్లు కొట్టి, పోడు చేస్తున్నట్టు ఫారెస్టోళ్లు కేసులు పెడ్తున్నారు. గతంలో చిన్నచిన్న కేసులు పెట్టి వదిలేసేవాళ్లు. కానీ ఇప్పుడు అడవుల దురాక్రమణ, పర్యావరణానికి విఘాతంలాంటి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఏడేండ్ల దాకా జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర పన్నుతున్నారు.
తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కనీసం చోరవ చూపడం లేదు. ఇది అనేక సార్లు స్పష్టమైంది. ఇటీవల కూడా పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని కలిసినా సమస్య పరిష్కారానికి నిర్ధిష్టమైన హామీ ఇవ్వకుండా... 'మై హునా' అంటే ఇది దళితలకు ముడెకరాలు అన్న హామీగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమ కన్నీళ్లు ఆగి, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని గిరిజనులు ఆశపడ్డారు. కానీ, ఎనిమిదేండ్లుగా వారికి నీరాశే మిగిలింది.
'తెలంగాణలో భూ సమస్య పరిష్కారం కావాలంటే ధరణి పోర్టల్ ఒకటే మార్గం. ఒక గంటలో భూ సమస్య పరిష్కారం అవుతుంది' అని గొప్పలు చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ అటవీ హక్కుల చట్టం ఆన్లైన్లోకి ఎందుకు ఎక్కించలేదు? భూ తగాదాల పరిష్కారం ఎందుకు కాలేదు? అనే వాటికి సమాధానం చెప్పాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం, 'పెసా' చట్టం 1996, ఎఫ్ఆర్ఎ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలి. ఇదిలా ఉండగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అడవిని కొల్లగొట్టే కొత్త నియమాలతో 2006 అటవీ హక్కుల చట్టం ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ సర్కార్ యుద్ధం చేయాల్సింది తమ హక్కులకై పోరాడుతున్న గిరిజనులపై కాదు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేస్తున్నామంటునే, మరో పక్క లక్షలాది మంది గిరిజనుల, ఆదివాసీల హక్కులను కాలరాసి, అడవుల నుంచి అడవి బిడ్డలను గెంటివేయ పూనుకున్న బీజేపీ సర్కార్ ద్వంద్వ వైఖరిపై యుద్ధం చేయాలి. ఆ భూములను ప్రయివేటు కంపెనీలకు కట్టపెట్టే తాజా నియమాలను అడ్డకొని కేసీఆర్ తన చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలి.