Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురువారంనాడు రూపాయి డాలరుతో మారకంలో రూ.79.99గా నమోదైంది. అంటే ఎనభై రూపాయల రికార్డుకు ఒక్క పైసా తక్కువ. లావాదేవీల సమయంలో రూ.79.87గా ముగిసినట్లు రాయిటర్స్, బ్లూమ్‌బెర్గ్ వార్త కాగా, లావాదేవీలు ముగిసిన తరువాత 79.9975గా ఖరారైనట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. శుక్రవారం నాటి అంతిమ విలువ తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ కొత్త పతనాన్ని నమోదు చేస్తున్న రూపాయి తీరు తెన్నులు రూ.80తోనూ ఆగేట్లు లేవు. జూన్ నెలలో 9.1శాతంతో అమెరికా ద్రవ్యోల్బణం 41సంవత్సరాల తరువాత రికార్డును నెలకొల్పింది. దీంతో వడ్డీ రేటు మరోశాతం పెంచనుందనే వార్తలు... రెండు దశాబ్దాలలో తొలిసారిగా యూరో మారకం రేటు డాలరుతో సమం కావటంతో ఈ భయాలు మరింతగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమైన తరువాత రూపాయి 27సార్లు రికార్డు పతనాలను నమోదు చేసింది. తన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసుకొనేందుకు అమెరికా చేపట్టిన వడ్డీరేటు పెంపుదలతో మన మార్కెట్ నుంచి జూలై 12నాటికి 30.3 బిలియన్ డాలర్ల మేరకు స్టాక్మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. జూలై ఒకటవ తేదీ నాటికి మన విదేశీ మారక ద్రవ్యం పదిహేను నెలల కనిష్ట స్థాయి 588.3 బిలియన్ల డాలర్లకు తగ్గింది..
రూపాయి విలువ పతనం గురించి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నానా యాగీ చేసిన నరేంద్రమోడీ గానీ, ఇతర బీజేపీ పెద్దలు గానీ ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడటం లేదు. సమస్య మన రూపాయి పతనం కాదు, డాలరు విలువ పెరగటం అనే వితండవాదం చేస్తున్నారు. ఇదే వాస్తవమైతే చైనా కరెన్సీలో ఇలాంటి పెను మార్పులు ఎందుకు లేవు? ఫిబ్రవరి 24న ఒక డాలరుకు 6.3228 యువాన్లుండగా జూలై 14న 6.7611గా ఉంది. మన మాదిరి పతనం లేదు. ఇతర అనేక దేశాల కరెన్సీలు పతనం కావటం అంటే వాటి బలహీనతలు తప్ప మరొకటి కాదు. మన కరెన్సీ బలహీనత కాదు డాలరు బలం అని అంగీకరిస్తే 2014కు ముందు పతనానికి కూడా అదే కారణం కావచ్చు కదా! కానీ బీజేపీ నేతలు సెలవిచ్చిందేమిటి?
2013 ఆగస్టు 20న సీఎంగా ఉన్న నరేంద్రమోడీ ఏమన్నారో చూడండి. ఆరోజు రూపాయి విలువ 64.11. ''ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ, రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి చింతలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ గత మూడు నెలలుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు'' అన్నారు. మరి ఇప్పుడెందుకు నోరు విప్పరు...! విలేకర్లతో మాట్లాడకున్నా కనీసం మన్‌కీ బాత్లోనైనా ఎందుకు ప్రస్తావించటం లేదు? పోనీ ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు కదా! ఎందుకు పట్టించుకోవటం లేదు?
ఒక వైపు రూపాయి పతనం మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతుల పెరుగుదలతో వాణిజ్యలోటు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మన కరెన్సీ పతనమైతే దిగుమతి చేసుకొనే సరకుల ధరలు పెరిగి జనం మీద మరిన్ని భారాలు పడతాయి. ముడిచమురు ధరల పెరుగుదల దానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు ఒకటేమిటి ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగి మన జనం మీద భారాలు మోపేదే. అందువలన మనదేమీ లేదు డాలరు బలపడటమే కారణమని దాని మీద నెట్టివేస్తే కుదరదు. దిగుమతి వస్తువులకు అధికధరలు చెల్లించేందుకు జనం ఎలాగూ అలవాటు పడ్డారు గనుక రూపాయి పతనాన్ని పట్టించుకోవటం లేదనే అభిప్రాయం బలపడుతోంది. 2021లో ఔషధాల ధరలు 10.7శాతం పెరిగాయి. వీటి ధరల పెరుగుల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండదని, సాధారణ ధరలు తగ్గితే ఇవి తగ్గుతాయి పెరిగితే పెరుగుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ ఏప్రిల్ నెలలో సెలవిచ్చారు. ఇప్పుడు ఔషధాల ముడిపదార్థాల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో పాటు రూపాయి పతనం కూడా మరింత భారం మోపనుంది. అన్ని దిగుమతి వస్తువులకూ ఇదే వర్తిస్తుంది. అదే ధరల పెరుగుదల గురించి అడిగితే అది మన చేతుల్లో లేదు ప్రపంచమంతటా పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి చెబుతారు. మరి ప్రధాని, మంత్రులుండి చేసేదేమిటి?