Authorization
Sun April 20, 2025 11:45:17 pm
పొద్దు పొడిచింది మొదలు చిమ్మచీకటి కమ్ముకునే వరకు క్షణం తీరికలేకుండా శ్రమించే ఆమె కష్టానికి విలువ కడితే పది మంది 'కుబేరుల' సంపదలు కూడా ఒక వారానికి సరిపోతాయా? ఆమె అత్యవసర గృహ వైద్యురాలు. శిక్షణలేని ఉపాధ్యాయురాలు. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడే సంరక్షకురాలు. బుద్ధిలోనూ, సాహసంలోనూ సమ ఉజ్జీ అయినా ఆమె తీవ్రమైన వివక్ష, అసమానతల్ని ఎదుర్కోంటోంది. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా నేటికీ సమానత్వం, సామాజిక న్యాయం మహిళలకు ఎండమావులుగానే మిగిలాయి. వీటిని అధిగమించడానికి ఏటికేడూ ముందుకు పడాల్సిన అడుగులు మరింతగా వెనక్కి పడుతుండటం సిగ్గుచేటు. ఆకాశంలో సగంగా భావించే మహిళలను అవకాశాలలో అథ:పాతాళానికి తొక్కివేయడం అత్యంత దుర్మార్గం. ఈ 15ఏండ్లలో వివక్ష మరింతగా పెరిగిపోయిందని ఆక్స్‌ఫామ్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలు పొందటంలోనూ ఈ అసమానతలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం వివక్షేనని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ఏదో కాకి లెక్కలతో వెలువరించింది కాదు. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 'కార్మికరంగంలో మహిళల ప్రాతినిథ్య రేటు' గణాంకాల్ని విశ్లేషిస్తూ రూపొందించిందే. మహిళా ప్రాతినిథ్యం 2004-05లో 43శాతముంటే, 2021నాటికి 25శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఉపాధి, వేతనాలల్లోనే కాదు, ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావటంలోనూ పని ప్రదేశాల్లోనూ తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవటంతో కార్మికరంగంలో మహిళల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. గత 20 ఏండ్లలో నెలవారీ వేతనాలు అందుకునే మహిళా ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల కేవలం 39 లక్షలు మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఈ ట్రెండ్ అత్యంత ఆందోళనకు గురిచేసే అంశమని 'ఆక్స్‌ఫామ్' హెచ్చరించింది.
గ్రామీణ మహిళల పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ కూడా ఆదాయ అసమానతలకు లింగ వివక్షతే 100 శాతం కారణం. దినసరి కూలి ద్వారా పురుషుల సగటు నెల ఆదాయం రూ.6 వేలు కాగా, మహిళల ఆదాయం కేవలం రూ.3 వేలే.. ఇంత కంటే వివక్షత ఏముంటుంది? పురుషులతో సమాన విద్యార్హత, అనుభవం ఉన్నప్పటికీ లేబర్ మార్కెట్లో మహిళలకు తక్కువ వేతనాలు, కూలి అందుతోందని ఆక్స్‌ఫాం పేర్కొంది. దినసరి కూలీగా ఉపాధి పొందడం కూడా అణగారిన ప్రజానీకానికి కష్టంగా మారిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూపీఏ ప్రభుత్వ హాయాంలో వామపక్షాల చొరవతో తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజిఎ) అణగారిన ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఎంతగానో దోహదపడింది. కానీ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీపై కత్తి వేలాడదీసింది. నిధులు తెగ్గోసి నిర్వీర్యం చేసేందుకు కుట్ర సాగిస్తోంది. 'ఉపాధి' వేతనాలను కులాల వారిగా విభజించాలని కూడా ఇటీవలే కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విధానాలు ఎంత ప్రమాదకరమైనవో వేరే చెప్పాల్సిన పని లేదు.
కార్మికరంగంలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి చైనా ప్రభుత్వం చేపట్టిన వృత్తి శిక్షణ, సహకారం, రుణ సాయం వంటివి గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. వస్త్ర పరిశ్రమలో మహిళా కార్మికులు, ఉద్యోగుల్ని పెంచటం ద్వారా బంగ్లాదేశ్ సైతం అనూహ్యమైన ఫలితాల్ని అందుకుంది. ల్యాండ్ ఫూలింగ్, సహకార వ్యవసాయం మహిళా సంఘాలకు అప్ప గిస్తూ కేరళ ప్రభుత్వం చేపట్టిన 'కుటుంబశ్రీ' పథకం మహిళల్ని తిరిగి కార్మికశక్తి వైపు తీసుకెళ్లడానికి దోహదపడు తోంది. కానీ, మోడీ ప్రభుత్వానికి ఇవేవీ పట్టకపోవడం విషాదం.
ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యానికి తోడుగా దేశంలో మోడీ సర్కార్ అమల్జేసిన నోట్లరద్దు, జిఎస్టి వంటి విధానాల వల్ల, ఆ తర్వాత లాక్డౌన్ ఆంక్షల ఫలితంగా జీవనోపాధులు అడుగంటాయి. నిరుద్యోగం ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, సామాజిక వివక్షతను పెంచుతూ దుర్మార్గమైన విధానాలను పాలకులు అమల్జేస్తు న్నందునే ఈ దుస్థితి దాపురించింది. నిత్యం ఉపన్యాసాలతో దంచికొట్టే కమలనాథులు మహిళా రిజర్వేషన్‌పై మాత్రం నోరు మెదపరు. రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వపు లక్ష్యాలను పాలకులే నీరుగారుస్తుంటే ఇక మహిళల జీవితాల్లో పొద్దు పొడిచేదెప్పుడు?