Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా పుట్టిన రోజు సందర్భంగా పదికాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుతూ కానుకలు అందించి దీవించటం సహజం. కానీ నీక్కావలసిన అస్త్ర శస్త్రాలన్నీ ఇస్తాం మరిన్ని ప్రాణాలను బలిపెట్టమని దీవించి ప్రోత్సహిస్తారా? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ(45) పుట్టిన రోజు సందర్భంగా బుధవారంనాడు మరికొంత కాలం యుద్ధం చేయాలని దీవిస్తూ అమెరికా, జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు ఆధునిక టాంకులను అందచేస్తామని ప్రకటించాయి. కానీ ఈ బహుమతుల అందచేత సదరు దేశాల మిలిటరీ పరిశ్రమలకు కాసుల వర్షం కురిపిస్తే ప్రపంచాన్ని కష్టాల్లో ముంచుతుంది. ఇదే ఆందోళనకరం. ఇప్పటికే వైఫల్యం చెందిన ప్రభుత్వాలకు, జనం మీద భారాలు మోపదలచుకున్న పాలకులకు ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపటం అలవాటైంది. అది ప్రారంభమై పదకొండు నెలలు గడిచింది, ఫిబ్రవరి 24నాటికి ఏడాది పూర్తి చేసుకోనుంది. చిత్తశుద్ది, జనం పట్ల జవాబుదారీ తనం ఉంటే ఈ దేశాలుగానీ, నేతలు గానీ వివాదపడుతున్న ఉక్రెయిన్ -రష్యాలను కూర్చోబెట్టి రెండు దేశాల్లో ఉన్న భయ, సందేహాలను పోగొట్టి ప్రశాంతతను చేకూర్చాలిగానీ, మరింత ఆజ్యం పోయటం గర్హనీయం. ఒకవైపు రష్యా మీద మరిన్ని కఠిన ఆంక్షలను అమలు చేసి మరింతగా రెచ్చగొడుతూ మరోవైపు చచ్చేదాకా పోరు సల్పండి మీకు కావాల్సిన ఆయుధాలు, మందుగుండు ఇస్తామంటూ ఉక్రెయిన్ను ముందుకు నెడుతున్నాయి.
ఎలాగూ అమెరికా ఇస్తోంది కనుక మనం ఎందుకు వెనుకబడాలని జర్మనీ, జర్మన్లు కొద్దిసేపటిక్రితమే ప్రకటించారు గనుక మనమెందుకు తగ్గాలంటూ అమెరికా కొద్ది గంటల తేడాలోనే ఉక్రెయిన్‌కు యుద్ధ టాంకులను ఇస్తామని ప్రకటించాయి. సంక్షోభంలో ఇదొక కొత్త మలుపు. గడచిన పదకొండు నెలల కాలంలో గతంలో సోవియట్, తరువాత రష్యా అందచేసిన టాంకులు, ఆయుధాలనే తిరిగి రష్యా మీదకు ప్రయోగించారు. ఇతర తూర్పు ఐరోపా దేశాలు కూడా తమ వద్ద ఉన్న పూర్వపు సోవియట్ అస్త్రాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి. అవి ఖాళీ కావటంతో ఇప్పుడు పశ్చిమ దేశాల అస్త్రాలతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. వాటిని ఉపయోగించే నైపుణ్యమూ, ఇంథనం కూడా లేనందున వాటిని కూడా ఇతర నాటో దేశాలే సమకూర్చుతున్నాయి. నాటో దేశాల సైనికులు పాల్గొ నటం లేదు కనుక ఉక్రెయిన్ల రక్తం ఎంత చిందినా, ఎన్ని ప్రాణాలు పోయినా వారికి పట్టదు.
తమ వద్ద ఉన్న లెపర్డ్(చిరుత పులి) రకం టాంకులను ఇస్తామని జర్మనీ ప్రకటించింది. ఇప్పటికే అనేక నాటో దేశాలకు వాటిని సరఫరా చేసింది. వాటికి పనిలేక తుప్పు పట్టేదశలో ఉన్నా సదరు దేశాలు మరో దేశానికి విక్రయించాలంటే జర్మనీ అనుమతి అవసరం. ఆమేరకు మిగతా దేశాలకు సైతం అనుమతి ఇచ్చింది. దీంతో జర్మనీకి రెండు రకాల లాభాలు... ఒకటి ఉక్రెయిన్ను మరింతగా ఆదుకొనేందుకు ముందుకు వచ్చిందన్న పేరుతో పాటు అది కొత్త టాంకులను ఇతర దేశాలకు అమ్ముకొని లాభాలు గడించవచ్చు. ఈ సంగతి తెలిసే అబ్రామ్ రకం టాంకులను అందచేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించేశాడు. లేకుంటే వాటిని తయారు చేసే కంపెనీలు ఊరుకుంటాయా? జర్మనీ తొలుత 14 చిరుత రకం టాంకులు ఇస్తామని చెబితే అమెరికా 31 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తరువాత వాటిని ఇంకా పెంచుతారు. ఈ పోటీలో ఫ్రాన్స్ వెనుకబడింది. దాని దగ్గర ఉన్న స్వంత తయారీ టాంకులను అందచేస్తే మూడు రకాల టాంకులను వినియోగించటం ఉక్రెయిన్‌కు కుదిరేది కానందున మరచి బేరం పోయిందే అని అది నిట్టూర్పులు విడుస్తోంది.
శీతాకాలం ముగిసిన తరువాత ఈ పశ్చిమ దేశాల ఎత్తుగడలకు ధీటుగా పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు రష్యా సిద్ధం అవుతున్నట్లు మరోవైపు నుంచి వార్తలు. టాంకులు ఇవ్వటాన్ని చారిత్రాత్మకం అని జర్మనీ వర్ణించటమే కాదు ఆట తీరునే మార్చివేస్తుందని కూడా ఉక్రెయిన్ను ఉబ్బేసింది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి అదే కబుర్లు చెబుతున్నారు, ఇదిగో పుతిన్ పతనం అదిగో రష్యా వెనుకడుగు అని అంటూనే ఉన్నారు. ఇలాంటి టక్కు టమారాలను చాలా చూశాం, టాంకుల అందచేత ఒక విధ్వంసక పథకం, సామర్థ్యం గురించి అతివర్ణన అంటూ రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కొట్టిపారవేశాడు. ఇలాంటి మాటలన్నీ ప్రచార ఎత్తుగడల్లో భాగం కావచ్చు గానీ రానున్న రోజుల్లో సంక్షోభం కొత్త రూపం సంతరించుకోవటం, మరింత ప్రాణ, ఆస్తి నష్టం అనివార్యంగా కనిపిస్తోంది. దీనికి పూర్తిగా పశ్చిమ దేశాలదే బాధ్యత అవుతుంది. తమ టాంకులు ఉక్రెయిన్ ప్రాంతాలను కాపాడటం కోసం తప్ప రష్యాకు ముప్పుతెచ్చేందుకు కాదని అమెరికా విదేశాంగ మంత్రి లాయడ్ ఆస్టిన్ నమ్మబలుకుతున్నాడు. పుతిన్ సేనలు ఎప్పుడు వెనక్కు పోతే పోరు ఆ మరునాడే ఆగుతుందన్నాడు. తమ ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇచ్చి, నాటోను విస్తరించబోమని, ఉక్రెయిన్ను తమ పక్కలో బల్లెంగా మార్చబోమని హామీ ఇస్తే సైనిక చర్యను వెంటనే ఆపివేస్తామని ప్రారంభంలోనే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేమీ తెలియనట్లు పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నాయి. రోజు రోజుకూ ఎగదోస్తూ వంచనకు పాల్పడుతూ ప్రపంచాన్ని ప్రమాద అంచుకు నెడుతున్నాయి.