Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవు. ఎప్పుడూ ఏదో ఒకటి కల్పించుకోకపోతే వాటికి తోచదు. ఉన్మాదులు అది మతం లేదా యుద్ధోన్మాదులు ఎవరైనా సరే వారంతే. ప్రపంచం మీద పెత్తనం తద్వారా తమ కార్పొరేట్లకు లాభాలను తేవటం సామ్రాజ్యవాదుల నిరంతరపని. తమ సరకులకు మార్కెట్ కోసం భారత్‌కు సముద్ర మార్గం కనుగొనాలంటూ నాటి కొలంబస్ను సముద్ర యాత్రకు పంపిన స్పెయిన్ పాలకుల మొదలు నేటి అమెరికా ఏలికల వరకు చేస్తున్నది అదే. ఇప్పుడు కొలంబస్లతో పని లేదు. దేశాలను ఆక్రమించుకొనేం దుకు అవకాశం అంతకన్నా లేదు. సామ్రాజ్యవాదులు గతంలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో సృష్టించిన అనేక సమస్యలు, వివాదాలతో కొన్ని దేశాలు ఇప్పుడు సతమతమవుతున్నాయి. వాటిని సాకుగా తీసుకుని తమ అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్న సామ్రాజ్యవాదులు అందుకోసం గిల్లికజ్జాలను పెట్టుకుంటున్నారు. అందుకు గాను ముందుగా తొత్తులను ప్రయోగిస్తారు.
చైనాలో విలీనం కావాల్సిన తైవాన్ గురించి రెచ్చగొట్టేందుకు ఇటీవల అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే ఈ ఏడాది తొలిసారిగా తూర్పు ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్‌ను పురికొల్పింది. అది హైదరా బాద్ మహా నగ రానికి సమానమైన కోటి మంది జనాభా కలిగిన చిన్న దేశం. చైనాతో పోల్చు కుంటే దేనిలోనూ సరితూగలేదు. కానీ అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండ చూసుకొని చైనాను గిల్లేందుకు పూనుకుంది. అక్కడ తాజాగా ఎన్ని కైన అధ్యక్షుడు పీటర్ పావెల్ సోమవారం నాడు తైవాన్ పాలకురాలు శాయి లింగ్ వెన్‌తో ఫోన్లో మాట్లాడి తైవాన్ వేర్పాటు వాదానికి మద్దతు ప్రకటించాడు. గతంలో ఐరోపాలోని ఏ దేశ అధినేత కూడా ఇలా మాట్లాడలేదు. త్వరలో తాను స్వయంగా ఆమెను కలుసుకుంటానని చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ మాట చెప్పినప్పటికీ ఎన్నిక తర్వాత అధికారికంగా మాట్లాడినదానికి తేడా ఉంటుంది.
తాము గీచిన గీతను కాలుతో చెరిపేందుకు చెక్ అధ్యక్షుడు పూనుకున్నాడని, చైనా పౌరుల మనోభావాలను గాయపరిచినట్లు చైనా ప్రతినిధి మావో నింగ్ ప్రతిస్పందించింది. చేసిన తప్పును సరిచేసుకొనేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేసింది. పీటర్ పావెల్ ఫోన్ సంభాషణ తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చైనా విదేశాంగ శాఖలో ఐరోపా విభాగ అధిపతి వాంగ్ లుటోంగ్ ట్వీట్ చేశాడు. తైవాన్‌లో జోక్యం చేసుకొని సంబంధాలు నెలకొల్పేందుకు పూనుకున్న లిధువేనియాపై ఇటీవల చైనా ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో విలేకర్లు అదే అంశాన్ని పావెల్‌తో ప్రస్తావించగా అయినా సరే ముందుకు పోతానని చెప్పాడంటే వెనుక పశ్చిమదేశాల అండ ఉండబట్టే అన్నది స్పష్టం. తైవాన్ పాలకురాలితో తాను మాట్లాడటం చైనాకు అంగీ కారం కాదని తెలిసినప్పటికీ ఒక స్వతంత్ర దేశంగా తమకు ఎవరితో మాట్లాడేందుకైనా హక్కు ఉందని, తానేమీ విచారపడటం లేదని పావెల్ సమర్ధించుకున్నాడు. పావెల్ తైవాన్‌కు వెళ్లే ముందు చైనా స్పందనను పరీక్షించేందుకు మార్చి నెలలో చెక్ పార్లమెంటు స్పీకర్ తైపే వెళ్లనున్నట్లు వార్తలు.
ఇక అసలు సూత్రధారి అమెరికాను చూస్తే 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు తైవాన్‌లో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువలన ఆ తరుణంలో చైనా ముందుకు పోవచ్చని, 2025లో తైవాన్ పేరుతో చైనాపై డాడికి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనరల్ మినిహాన్ చెప్పినట్లు జనవరి చివరి వారంలో వెల్లడైంది. ఈ అంశాన్ని అనధికారిక లీకుల ద్వారా వెల్లడించారు. రెండు సంవత్సరాల్లో తైవాన్ అంశంపై చైనాతో జరిగే యుద్ధానికి సిద్ధం కావాలని తన ఆధీనంలో నడిచే ఎయిర్ మొబిలిటీ కమాండ్ సిబ్బందితో చెప్పాడు. పోరు జరుగుతున్నపుడు యుద్ధ విమానాలకు ఇంథనం నింపే ప్రక్రియ గురించి జారీ చేసిన ఒక పత్రంలో దీని గురించి పేర్కొనట్లు ఒక టీవీ ఛానల్ పేర్కొన్నది. నిజానికిది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.2021లోనే అమెరికా పార్లమెంటుకు అమెరికా నౌకాదళ అడ్మిరల్ ఫిల్ డేవిడ్సన్ చైనా గురించి ఆందోళన వెల్లడిస్తూ 2027కు ముందే తైవాన్ స్వాధీనం జరుగు తుందని అందువలన దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా వేగంగా కదలాలని పేర్కొన్నాడు. అనుకుంటున్నదాని కంటే ముందే ఎంతో వేగంగా తైవాన్ విలీన ప్రక్రియకు చైనా పూనుకొనే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ 2022లో చెప్పాడు.జనరల్ మినిహాన్ ఆసియా పసిఫిక్ కమాండ్ ఉప అధిపతిగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత వైమానిక విభాగ అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అతనితో పాటు అనేక మంది మిలిటరీ అధికారులు కూడా సన్నాహాలు జరగాలని చెబుతున్నారు.
ఒక వైపు యుద్ధోన్మాదం మరోవైపు చైనాతో తలపడితే భారీ ప్రాణ నష్టం జరుగుతుందనే భయం కూడా అమెరికాలో ఉంది. వేల కిలోమీటర్ల దూరం వెళ్లి చైనా మీద టాంకులతో పోరుకు దిగటం సరికాదని, క్షిపణి, వైమానిక దాడుల మీద కేంద్రీకరించాలని సూచించేవారు కూడా ఉన్నారు. చైనాను దారికి తెచ్చేందుకు అవసరమైన నౌకలు, ఆయుధ నిల్వలకు పెట్టు బడులు పెట్టటం లేదని మాజీ నౌకా అధికారి సేత్ క్రాప్సే వంటి వారు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి గుంజాటనలు ఉండగా పౌరుల స్పందన గురించి భయం కూడా ఉంది. తైవాన్ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఒకే చైనాను అధికారికంగా గుర్తించి సంబంధాలు పెట్టుకున్న తరువాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రక్తాన్ని చిందించటాన్ని అమెరికా సమాజం అంగీకరించే అవకాశాలు తక్కువ. అందువల్లనే జనంలో కూడా అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు అమెరికా నానా తంటాలు పడుతున్నది. అభూత కల్పనలతో ప్రచారదాడి జరుపుతున్నది. అనవసరంగా తమతో పెట్టుకుంటే తగిన శాస్తి చేస్తామని గతంలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే !