Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సారి వేసవిలో ఉష్ణోగ్రతలు గతం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తలు ఈ రకమైన హెచ్చరికలు చేశారు. ఫిబ్రవరి నెల పూర్తికాకముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటకలో 35 నుండి 39 సెల్సియస్ డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోగా, అనేక చోట్ల సాధారణం కన్నా ఐదు నుండి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో ఎండలు మండటం ఇటీవల సంవత్సరాల్లో ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ వేసవి ప్రభావం తీవ్రంగానే ఉంటుందన్న నివేదికలు కొంత కాలంగా వస్తూనే ఉన్నాయి. అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పందన కానరావడం లేదు. మండే ఎండలు ముంచుకొచ్చి, చుక్కనీటికి అంగలారుస్తూ వడగాలులకు జనం పిట్టల్లా రాలిపోతే కానీ కదలరా? ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోరా? అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి.
వాతావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణుల నుండి అందుతున్న వివిధ రకాల అంచనాలతో పాటు, ఈ వేసవికి సంబంధించి ఇప్పటికే మూడు హెచ్చరికలు మన దేశంలోని పరిశోధన సంస్థల నుండి కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి (ఐసిఎఆర్) దాదాపు వారం రోజుల క్రితం రైతుల కోసం విడుదల చేసిన సూచనలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలతో పాటే పసుపుపచ్చ పురుగు కూడా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది. వేసవి తీవ్రతకు సంబంధించి ఇది మొదటి హెచ్చరిక కాగా, ఆ తరువాత మూడు రోజులకే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండి) అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తర భారత దేశంలో గోధుమ పంటతో పాటు, ఇతర పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. 21న విడుదల చేసిన మరో ప్రకటనలో ఉత్తరభారత దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా మూడు నుండి ఐదు డిగ్రీలు అదనపు ఉష్ణోగ్రతలు కొద్దిరోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత కూడా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది ఇటువంటి పరిస్థితుల కారణంగా ఉత్తరభారత దేశంలో గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లో గోధుమలకు కొరత ఏర్పడింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద 11రాష్ట్రాలకు చేయవలసిన గోధుమల సరఫరాను చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దాదాపుగా అవే పరిస్థితులు పునరావతమవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?
దీనికి తోడు ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు సైతం వెలువడుతున్నాయి. బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్తో పాటు, వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ఎల్నినో కారణంగా మార్చి-ఏప్రిల్ నెలల మధ్య కాలం నుంచే ఉష్ణోగ్రతలు, వడగాలులు తీవ్రతరం కానున్నాయి. భూ తాపం కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరంగా 2016 ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎల్నినో కారణంగా మళ్ళీ అటువంటి పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలు నిపుణుల్లో వ్యక్తమవు తున్నాయి. అంటే రానున్నది కేవలం ఎండాకాలం... మండేకాలం మాత్రమే కాదు! అంతకన్నా గడ్డు కాలం! ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తాగునీటి నుండి పశుగ్రాసం సరఫరా వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఉపాధి హామీ చట్టంలో భాగంగా పనిచేసే కూలీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు పక్కన బతుకులీడ్చే అభాగ్యులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునేదానికన్నా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తగు కార్యాచరణతో ముందుకు రావాలి.