Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త అల్లుడు ఇంటికొస్తే... రకరకాల రుచికరమైన వంటకాలతో వడ్డిస్తారు. ఏకంగా 135 వంటకాలతోనో, 379 వంటకాలతోనో విందు భోజనం వడ్డించారన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇష్టమైనవారికి కోరిన వంటకాలు చేయడం, కొసరి కొసరి వడ్డించడం... ప్రేమను వ్యక్తీకరించే ఒక మార్గం. 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు/ వియ్యాలవారి విందు ఓ హౌహ్హౌ నాకె ముందు/ ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల/ ఓహ్హౌరె అరెసెలుల్ల అహహ్హహ...' అంటూ షడ్రసోపేతమైన పెళ్లి విందును రకరకాల పదార్థాల పేర్లతో బహు పసందుగా రాస్తాడు సినీకవి పింగళి. సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ భోజన ప్రియులు భుక్తా యాసంతో తేన్చాల్సిందే. గతంలో అందుకు తగ్గట్టుగానే శారీరక శ్రమ కూడా వుండేది. కానీ, ఈ రోజుల్లో మారిన జీవనశైలి, తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల ఇంతకుముందెన్నడూ చూడని రోగాలు రొప్పులు, ప్రాణాంతక వ్యాధులు ముప్పుగా మారాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం విపరీ తంగా పెరిగింది. పిల్లలు సైతం ఈ స్థూలకాయం బారిన పడడం ఓ విషాదం.
'తిండి కలిగితే కండ కలదోరు.. కండ కలవాడే మనిషోరు' అని గురజాడ అప్పుడెప్పుడో అన్నారు. కానీ ఈ కాలంలో ఇది రివర్స్ అయ్యింది. 'ఒక్కపూటే తినవోరు... ఆరోగ్యంగా వుండవోరు' అంటున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు...తింటే ఎంత తినాలి అనే అవగాహన లేకపోతే... అనారోగ్యం బారిన పడకతప్పదంటున్నారు కొందరు నిపుణులు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడతారని తాజాగా 'అంతర్జాతీయ ఒబేసిటీ ఫెడరేషన్' హెచ్చ రించింది. ఊబకాయంతో బాధపడుతున్న జనాభా వున్న దేశాల్లో భారత్ కూడా వుంది. రాబోయే దశాబ్దంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడనున్నారు. ముఖ్యంగా ఈ సమస్య చిన్నారుల్లోనూ, తక్కువ ఆదాయంగల దేశాల్లోనూ వేగంగా పెరుగుతోందని డబ్ల్యుఓఎఫ్ అంచనా వేసింది. ఈ నివేదిక ప్రపంచానికొక హెచ్చరిక. పరిస్థితి మరింత దిగజారక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు, యుక్తవయస్సు వారిలో ఊబ కాయం పెరుగుదల రేటు ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతోంది. ఈ సమస్యను నివారించే దిశగా ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు దష్టి సారించాల్సివుంది. 2035 నాటికి 208 మిలియన్ల మంది అబ్బాయిలు, 175 మిలియన్ల మంది అమ్మాయిల్లో స్థూలకాయం రేటు రెట్టింపు కానుందని ఆ నివేదిక చెబుతోంది. మరోవైపు ఆకలికేకలు, పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలు కనిపించే దేశం మనది. శతాబ్దాల నుంచి పోషకాహార సమస్య వెంటాడుతుండగా, దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య కూడా దానికి తోడయ్యింది. పూర్తి భిన్నమైన రెండు సమస్యలను ఏకకాలంలో మన దేశం ఎదుర్కొంటోంది.
నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత షార్ట్‌కట్‌లో సక్సెస్ సాధించి, పిల్లలను డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చాలని అనేకమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాల విద్యావిధానం కూడా ఇందుకు తగ్గట్టుగానే వుంది. దీంతో పిల్లల్లో గతంలో మాదిరిగా ఆట, పాట కొరవడింది. స్కూల్స్‌లో సైతం ఆట పాటలను పక్కన బెట్టి పాఠాలను బట్టీ వేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అసలు కొన్ని స్కూళ్లకు ఆటస్థలాలే లేవు. కొండొకచో వున్నా... పిఇటీలు వుండరు. చెరువుల్లో కాలువల్లో ఈతలెయ్యడం వంటివి ఇప్పటివారికి అసలే తెలియవు. వ్యాయామాలను పక్కనపెట్టేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే శారీరక శ్రమ, కంటినిండా నిద్రా వుండాలి. ఇప్పుడా రెండూ లేవు. దీనికితోడు మొబైల్ ఫోన్లు పిల్లల ఆరోగ్యానికి మరింత ప్రతిబంధకంగా మారాయి. 'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ అయిదా రేడుల పాపల్లారా' అంటాడు మహాకవి శ్రీశ్రీ. భావితరానికి దూతలు వీళ్లు. వీరిని యంత్రాలుగా, ఊబకాయులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. 'మీదే, మీదే సమస్త విశ్వం/ మీరే లోకపు భాగ్యవిధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు' అని శ్రీశ్రీ అన్నట్టుగా- దేశం ప్రగతిపథంలో పయనించాలంటే... ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరం కావాలి.