Authorization
Mon Jan 19, 2015 06:51 pm
X=Y
చీకటి పడింది
చీకటి పడింది
చీకటి పడింది
వెతకాలిక వెలుతురు దారులనూ, ద్వారాలనూ...'' అంటూ నిన్నటి సంఘటనకు స్పందించాడు ప్రముఖ కవి సీతారాం. చీకటి పడుతూ వస్తూన్న స్థితి నుండి ఇప్పుడంతా చీకటి కమ్మేసింది. ఇది ఏ ఒక్కరికో పదుగురికో చెందిన చీకటికాదు. ఎవరైనా అలా అనుకుంటే అమాయకత్వమూ అజ్ఞానమే అవుతుంది. మార్టిన్ నీమోల్లర్ వందేండ్ల క్రితమే జర్మన్లో నాజీల గురించి చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా వర్తిస్తాయి. ''వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టును కాను కాబట్టి మాట్లాడలేదు, తర్వాత వాళ్లు యూదుల కోసం, ఆ తర్వాత కార్మిక నాయకుల కోసం వచ్చారు, క్యాథలిక్కుల కోసం వచ్చారు, నేను కాదు కాబట్టి మాట్లాడలేదు. చివరికి వాళ్లు నా కోసం వచ్చారు, అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగలలేదు'' అని చెప్పారాయన... ఇప్పుడూ అంతే అవుతుంది. అవును... మనం మౌనంగా ఉంటే అదే జరుగుతుంది. వాళ్లు మనదగ్గరికీ వస్తారు. ఇక గొంతెత్తకపోతే మన బతుకులూ, భవితా విధ్వంసమవుతాయి. దేశంలో ఇప్పటికీ మిగిలివున్న ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకోవాలి. నియంతల దుర్మార్గాలకు కాలం చెల్లిందని నిరూపించాలి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం జరిగిందని లోక్‌సభ సెక్రటరీ పేర్కొన్నారు. దీనితో సభ్యత్వం కోల్పోవటంతో పాటు, ఆరేండ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం వర్తిస్తుంది. అసలు రాహుల్‌పై ఈ కేసులో శిక్షెందుకు పడిందంటే... ''దొంగలందరికీ మోడీ అన్న పేరే ఎందుకుంది?'' అని ప్రశ్నిస్తూ విమర్శించాడని. కానీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ మొదలయిన వాళ్లు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి, అక్కడే హాయిగా ఉంటున్నారు మరి!
గతంలో ప్రతిపక్షాలు పరిపాలనలోని అవకతవకలను ఎండగడుతూ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ అత్యంత సహజమైనది. సమర్థత గల ప్రభుత్వమైతే ఎదుర్కొవాలి. లేదా సమాధానం చెప్పాలి. కానీ అసలు ప్రతిపక్షాలను లేకుండా, గొంతెత్తకుండా చేస్తామనుకోవటం నియంతృత్వ లక్షణం. ఇదే తరహాలో కేసలు పెట్టి మూసేయాలనుకుంటే పార్లమెంట్లో అనేకమంది సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరికీ శిక్ష పడేట్టు చేస్తే సభ సగం ఖాళీ అవుతుంది. ఇక ఆ మధ్య మన జాతిపిత గాంధీ బొమ్మను పిస్తోలుతో మళ్ళీ మళ్లీ కాల్చి నాధూరాం గాడ్సే అమర్‌రహే అంటూ, గాంధీని దేశద్రోహి అంటూ నినాదాలు చేసిన ఎంపీలు, కాషాయి గుంపులకు ఎలాంటి శిక్షలు పడ్డాయి? చంపుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్న వారిని ఏం చేస్తున్నాం మనం? నిజంగానే డబ్బు దోచుకున్న వాళ్లు పారిపోతే ఎందుకు ఇప్పటి వరకూ తీసుకు రాలేకపోయాము. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి, ఎల్ఐసి నుండి తీసుకున్న సొమ్ము ఒక్కరోజులోనే ఆవిరైపోయిన అదానీ షేర్ మాయాజాలంపై దేశాన్ని కాపాడే ప్రధాని, పాలకులూ మాట్లాడరెండుకు? కనీసం దర్యాప్తు కోసం కమిటీని కూడా వెయ్యటానికి పూనుకోని వాళ్లు ఎవరికోసం పనిచేస్తున్నట్లు! వీటన్నింటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న చర్యలే ఇవన్నీ.
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పి కక్ష తీర్చుకోవటం ఈ ప్రభుత్వకాలంలో మరింత నగంగా జరుగుతోంది. సిబిఐ, ఈడీ, ఐటీ కేసులలో 95శాతం విపక్షనేతలపైనే కావటం యాదృచ్ఛికం కాదు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఏ పార్టీతో గెలిచినా తనవైపునకు తిప్పుకునేందుకు వీటిని నిర్లజ్జగా వినియోగించడం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు దోచుకుంటున్నవాళ్లకు అండగా నిలుస్తూ, ప్రశ్నించే వారిపై ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గం. మొన్న మొన్నటి వరకూ రాహుల్ గాంధీని పప్పూ అంటూ హేళన చేసిన వారే ఈ రోజు ఆయనకు భయపడే పరిస్థితి వచ్చింది. భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందన కూడా వీరి ఆందోళనకు కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా నియంతులు తమ గోతిని తామే తవ్వుకుంటారన్నట్లుగా ప్రతిపక్షాల ఐక్యతనూ బలాన్నీ పెంచుతున్నారు. రాహుల్ గాంధీపై జరిగిన ఈ దాడిని ప్రతిపక్ష నేతలందరూ ఖండించారు. మోడీ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సంఫ్‌ు పరివార్ హింసాత్మకదాడి ఇదని కేరళ ముఖ్యమంత్రి విజయన్ మొదలైన నేతలందరూ గళమెత్తారు. దేశ వ్యాపిత ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 'నేను సావర్కర్‌ను కాదు క్షమాపణ కోరడానికి.. నేను రాహుల్ గాంధీని' అని రాహుల్ ప్రతిస్పందించాడు. ఆనాడు నియంతృత్వంతో వ్యవహరించిన ఇందిరాగాంధీని ప్రజలు ఓడించారు. హిట్లర్ లాంటి నియంతలనే మట్టి కరిపించారు. ఇవి చరిత్ర నేర్పుతున్న పాఠాలు. ప్రజలు అవగాహనలోకి రాగానే ఎంతటివారినైనా నిలువరించగలుగుతారు. అందుకు చైతన్య పర్చటమే మన ముందున్న కర్తవ్యం. కమ్మిన చీకట్లు చెదరిపోక మానవు... సూర్యోదయం అనివార్యం.